శంకరయ్య నిజాయతీ!

చోళరాజ్యాన్ని కేశవుడు పాలించేవాడు. అతను ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకునేవాడు. కుటుంబంలోని ఆడపిల్ల వివాహానికి ఆ కుటుంబ పెద్దకు అయిదు బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చేవాడు. అవి సరిపోకపోతే వారు చేసిన అదనపు ఖర్చును కూడా మళ్లీ ఇచ్చేవాడు.

Updated : 09 Oct 2021 12:07 IST

చోళరాజ్యాన్ని కేశవుడు పాలించేవాడు. అతను ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకునేవాడు. కుటుంబంలోని ఆడపిల్ల వివాహానికి ఆ కుటుంబ పెద్దకు అయిదు బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చేవాడు. అవి సరిపోకపోతే వారు చేసిన అదనపు ఖర్చును కూడా మళ్లీ ఇచ్చేవాడు.

ఒకసారి శంకరయ్య తన కూతురికి వివాహం చేయాలనుకున్నాడు. మహారాజును కలిసి అయిదు బంగారు నాణేలు బహుమతిగా పొందాడు.  శంకరయ్య తన కూతురి వివాహం ఘనంగా చేశాడు. అయినప్పటికీ రెండు బంగారు నాణేలు మిగిలాయి. వాటితో కోటకు వెళ్లాడు శంకరయ్య. రాజు సభలో కొలువుదీరి ఉన్నాడు. రాజు, శంకరయ్యతో ‘నీ కూతురు వివాహం ఎలా జరిగింది? ఇంకా ఏమైనా నాణేలు కావాలా?’ అని అడిగాడు.

‘మహారాజా! మీ దయ వల్ల నా కూతురు వివాహం చక్కగా జరిగింది. మీరు ఇచ్చిన అయిదు నాణేల్లో రెండు మిగిలాయి. వాటిని తిరిగి ఇవ్వడానికి వచ్చాను’ అన్నాడు శంకరయ్య. ‘మిగిలిన నాణేలు ఎందుకు ఇస్తున్నావు?’ అన్నాడు రాజు. ‘మహారాజా! మీరు అయిదు నాణేలు ఇస్తూ.. సరిపోక పోతే ఇంకా ఇస్తాను అని చెప్పారు. అలాంటప్పుడు మిగిలినవి కూడా ఇవ్వాలి అనే అర్థం కూడా ఉంది. అందుకే తిరిగి ఇస్తున్నా’ అన్నాడు శంకరయ్య.

‘అవును ప్రభూ! అతను చెప్పింది సబబుగానే ఉంది’ అన్నాడు మంత్రి. ‘నిజాయతీగా ఖర్చు గురించి చెప్పావు. మిగిలిన ఆ రెండు బంగారు నాణేలనూ నువ్వే ఉంచుకో’ అన్నాడు రాజు. ‘మహారాజా! ఆడపిల్లల పెళ్లిళ్లు కన్నతండ్రి చేయాలి. అది అతని బాధ్యత. మీరు ప్రజలను కన్నబిడ్డలుగా భావించి సహాయం చేస్తున్నారు. మేము కాదనలేక తీసుకుంటున్నాం. నాకు అవసరం తీరిపోయింది. వీటిని మన ఖజానాలో జమ చేస్తే మరొకరికి ఉపయోగపడతాయి’ అన్నాడు శంకరయ్య.

‘శంకరయ్యా! మంచి సలహాలు ఇచ్చినందుకు నిన్ను ఎంతో అభినందిస్తున్నాను. మంత్రిగారూ..! ఆ రెండు నాణేలు తీసుకుని ఖజానాలో జమ చేయించండి’ అన్నాడు రాజు. శంకరయ్య బాటలో చాలా మంది నడిచారు. ఒకప్పుడు ఎలాగూ అది రాజుగారి సొమ్మని అతిగా ఆడంబరాలకు పోయి పెళ్లిలో విపరీతంగా ఖర్చు చేసేవారు. ఇప్పుడు అవన్నీ తగ్గించుకుని తక్కువ ఖర్చుతోనే పెళ్లి చేస్తున్నారు. ఇలా ఆడపిల్లల వివాహం జరిగిన తర్వాత మిగిలిన నాణేలను రాజుగారికి దృష్టికి తీసుకెళ్లి ఖజానాలో జమ చేస్తున్నారు. దీంతో మరింతమంది పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆ నాణేలు ఉపయోగపడ్డాయి.  

- యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని