ఫలించిన ప్రయత్నం!

అప్పుడే అకస్మాత్తుగా మెలకువ వచ్చిన సింహం చుట్టూ చూసింది. అలా చూస్తుంటే కళ్లు భారంగా ఉన్నాయనిపించింది. ‘నేను ఎప్పుడూ నా గుహలోనే కదా నిద్రిస్తాను. ఇక్కడ బయట రాతిబండ మీదకెలా వచ్చాను?’ మనసులో అనుకుంది. తన కాలుకు ఎవరో మందు రాస్తున్నారనిపించి, ఓపిక తెచ్చుకుని చూసింది. అలా మందు రాస్తున్నది కొంగ అని తెలుసుకుంది. పైకి లేవబోయింది. ఒళ్లంతా నొప్పిగా ఉండటంతో ఓపిక లేక, పడుకునే.. ‘నాకేమైంది? రాతిబండ మీదకెలా వచ్చాను’ అని కొంగను అడిగింది. మృగరాజు మాట్లాడడంతో ఒక్కసారిగా కొంగ ఉలిక్కిపడింది.

Published : 13 Oct 2021 00:48 IST

ప్పుడే అకస్మాత్తుగా మెలకువ వచ్చిన సింహం చుట్టూ చూసింది. అలా చూస్తుంటే కళ్లు భారంగా ఉన్నాయనిపించింది. ‘నేను ఎప్పుడూ నా గుహలోనే కదా నిద్రిస్తాను. ఇక్కడ బయట రాతిబండ మీదకెలా వచ్చాను?’ మనసులో అనుకుంది. తన కాలుకు ఎవరో మందు రాస్తున్నారనిపించి, ఓపిక తెచ్చుకుని చూసింది. అలా మందు రాస్తున్నది కొంగ అని తెలుసుకుంది. పైకి లేవబోయింది. ఒళ్లంతా నొప్పిగా ఉండటంతో ఓపిక లేక, పడుకునే.. ‘నాకేమైంది? రాతిబండ మీదకెలా వచ్చాను’ అని కొంగను అడిగింది. మృగరాజు మాట్లాడడంతో ఒక్కసారిగా కొంగ ఉలిక్కిపడింది. భయంతో సింహానికి దూరంగా జరిగింది. ‘మృగరాజుకు మెలకువ వచ్చి మాట్లాడుతోంది. అందరూ రండి’ ధైర్యం కోసం అక్కడే ఉన్న జంతువులను పిలిచింది కొంగ. వనమూలికలను నూరుతున్న కుందేలు, ఆకులను సేకరిస్తున్న జింక, వాటికి సాయం చేస్తున్న జిరాఫీ, ఏనుగు మొదలైన జంతువులన్నీ సింహానికి దగ్గరగా వచ్చాయి. సింహం తన దగ్గరకు వచ్చిన జంతువులన్నింటినీ పరిశీలనగా చూడసాగింది.

‘మృగరాజా! మీరు కోలుకున్నందుకు సంతోషంగా ఉంది’ అంది ఏనుగు. ‘అసలు నాకేమైంది?’ ఓపిక కూడదీసుకుంటూ అడిగింది సింహం. ‘మీరు ఎక్కువగా మాట్లాడకూడదు. విశ్రాంతి తీసుకోండి’ అంది కొంగ.. సింహం కాలికి పసరు మందు రాస్తూ..

‘అవును మహారాజా! వైద్యుడు కొంగ చెప్పినట్లు మీకు విశ్రాంతి బాగా అవసరం’ కొంగ మాటలను బలపరుస్తూ అంది కుందేలు. సింహం అన్ని జంతువులను చూస్తూ.. ‘మీ అందరినీ చూస్తుంటే నా ఆరోగ్యం కోసం మీ శక్తికి మించి కష్టపడుతున్నారనిపిస్తోంది. మీకళ్లలో నా మీద మీరు కురిపిస్తున్న అభిమానం కనబడుతోంది. కానీ నా గాయాలు నన్ను బాధపెడుతున్నాయి. ఓపిక లేకపోయినా అడుగుతున్నాను. నాకు దెబ్బలెలా తగిలాయి. దయచేసి మీలో ఒకరైనా చెప్పండి’ ప్రాధేయపడుతున్నట్లు అడిగింది.

‘మృగరాజా! రెండు రోజుల క్రితం వేట కోసం గుహ నుంచి మీరు బయటకు వచ్చారు. వేటగాళ్లు తవ్విన పెద్ద గోతిలో పడ్డారు. స్పృహ కోల్పోయిన మిమ్మల్ని ఏనుగు తన తొండంతో గోతిలో నుంచి పైకి బలంగా లాగింది. నేను, జిరాఫీ, జింక, కొంగ.. ఇలా అన్ని జీవులమూ కలిసి ఏనుగుకు సాయం చేశాం. కొంగ చేసిన వైద్యానికి రెండు రోజులకు కోలుకుని మాట్లాడగలుగుతున్నారు’ అని కుందేలు చెప్పింది.

‘కుందేలు చెబుతుంటే.. జరిగిన సంగతి గుర్తొస్తోంది. గోతిలో పడటం వరకు మాత్రమే నాకు గుర్తుంది. ఆ పైన మీ అందరి సాయంతో చావును తప్పించుకొని బతికి బయటపడ్డాననిపిస్తోంది. ప్రాణం విలువ తెలిసి వస్తోంది. కానీ నేను మీ అందరి తోబుట్టువులు, బంధువులను పొట్టన పెట్టుకున్నాను. అవసరానికి మించి వేటాడాను. అవి ప్రాణభయంతో గిలగిలా కొట్టుకుంటూ హాహాకారాలు చేస్తుంటే.. నేను రాక్షసంగా ఆనందించేదాన్ని. ఆ విషయాలన్నీ మరిచి, తోటి జంతువన్న మమకారంతో మీరందరూ చేసిన సహకారం నేను మరిచిపోలేను. ఇకపై అవసరానికి మించి వేటాడను. చిరుజీవుల ప్రాణాలు తీయను’ అని జంతువులన్నింటినీ ఆప్యాయంగా చూస్తూ అంది సింహం.

‘మీరు ఈ అడవికి రాజు. మిమ్మల్ని కాపాడుకోవడం మా బాధ్యత. ఎక్కువగా మాట్లాడితే పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుంది. దయచేసి విశ్రాంతి తీసుకోండి’ అంది ఏనుగు. ఏనుగు మాటలు విన్న సింహం మెల్లగా నిద్రలోకి జారుకుంది.
జంతువులన్నీ సింహానికి కొంచెం దూరంగా జరిగి సమావేశమయ్యాయి. ఏనుగు మిగిలిన జంతువులతో ‘మృగరాజు ఆగడాలకు ముందు  భయపడ్డాం. అందరం కలిసి సింహాన్ని ఎలాగైనా చంపాలనుకున్నాం. జీవించే హక్కు అందరికీ సమానంగా ఉందని కుందేలు చెప్పి అడ్డుకుంది. సింహంలో మార్పు తేవడం కోసం వేటగాడు తవ్వినట్లుగా గొయ్యి తీసి మృగరాజును అందులో పడేలా చేయమంది. ప్రాణం విలువ సింహానికి తెలిసొచ్చేలా చేసి మార్పు తెచ్చింది. బుద్ధిబలంతో విజయం తెచ్చి పెట్టిన మన కుందేలును గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి’ అంది ఏనుగు. ఈ మాటలు విన్న మిగిలిన జంతువులన్నీ కుందేలుకు కృతజ్ఞతలు చెప్పాయి.

- కె.వి.లక్ష్మణ రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని