శిష్యోత్సాహం!

అలకాపురి ప్రభుత్వ పాఠశాలలో రాజేంద్ర, రమేష్‌ పదో తరగతి చదువుతున్నారు. ఇద్దరూ చక్కగా చదువుకోవడమేగాక, ఎవరికన్నా అవసరం వస్తే సహాయం చేయడంలోనూ ముందుండేవారు.

Updated : 14 Oct 2021 02:06 IST

అలకాపురి ప్రభుత్వ పాఠశాలలో రాజేంద్ర, రమేష్‌ పదో తరగతి చదువుతున్నారు. ఇద్దరూ చక్కగా చదువుకోవడమేగాక, ఎవరికన్నా అవసరం వస్తే సహాయం చేయడంలోనూ ముందుండేవారు. వాళ్లంటే ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. పదో తరగతి పరీక్షల్లో ఇద్దరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.

రాజేంద్ర, రమేష్‌లు పాఠశాలను విడిచి వెళ్లేముందు వీడ్కోలు సమావేశం జరిగింది. అందులో ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ ‘ఇలాంటి క్రమశిక్షణ, ఉన్నత వ్యక్తిత్వం గల పిల్లలు మన పాఠశాలలో చదవడం మనందరికి గర్వకారణం. ఈరోజు వాళ్లు పాఠశాలను వీడిపోతున్నందుకు బాధగా ఉన్నా, జీవితంలో మరింతగా ఎదగడానికే కాబట్టి సంతోషంగానూ ఉంది. అందరి ప్రశంసలు అందుకుంటూ పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ముగించారు. ఉపాధ్యాయులందరు కూడా వాళ్లను ఎంతో మెచ్చుకుని జీవితంలో ఉన్నత స్థానాలు పొందాలని దీవించారు.

ఇద్దరూ కళాశాలలో చేరి ఒకరు డాక్టరుగా, మరొకరు ఇంజినీరుగా పట్టభద్రులై ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. సమాజంలో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నారు. కొంతకాలానికి పాఠశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల కలయికకు హాజరయ్యారు.

కార్యక్రమానికి వీళ్లకు చదువు చెప్పిన ఒకప్పటి ఉపాధ్యాయులు కూడా వచ్చారు. రాజేంద్ర మాట్లాడుతూ ‘మా జీవితానికి మంచి విద్యా విత్తనం పడిందిక్కడే. ఇంతమంది తోటమాలుల సంరక్షణలో ఎదిగి, పుష్పించి, ఫలించాము. గురుదక్షిణగా మేమందరం కొంత డబ్బును బ్యాంకులో వేసి, జీవితాన్ని భారంగా గడుపుతున్న ఉపాధ్యాయులకు పింఛనులా అందించాలని అనుకుంటున్నాం’ అన్నాడు.

రమేష్‌ లేచి.. ‘మొక్కగా ఉన్నప్పుడే మమ్మల్ని చదువుతో వంచి పదిమందికి ఉపయోగపడే మానుగా తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయుల దినోత్సవం రోజు మీ అందర్నీ మనసులో తలచుకుని దణ్నం పెట్టుకుంటాం. మేమందరం అప్పుడప్పుడు కలుసుకుని మన పాఠశాల గురించి, ఉపాధ్యాయుల గురించి మాట్లాడుకుంటూ గత స్మృతులను నెమరేసుకుంటాం. రాజేంద్ర అన్నట్టు ఉపాధ్యాయులకు ఆర్థిక ఆసరా ఇవ్వడంతోపాటు, పాఠశాలకు మరమ్మతులు చేసి, కనీస అవసరాలు కల్పించి ఇప్పటి విద్యార్థులకు మరింత సౌకర్యవంతంగా ఉండేట్టు చూస్తాం’ అన్నాడు.

‘ఇవాళ ఇక్కడకు వచ్చిన పూర్వ విద్యార్థులను చూసి ఎంతో ఆనందం కలిగింది. చదివిన పాఠశాలను, చదువు చెప్పిన గురువులను మరవనివారు ఉత్తమ విద్యార్థులు. పదిమంది మెచ్చుకునే కొడుకు వల్ల తండ్రికి పుత్రోత్సాహమెలా కలుగుతుందో, సమాజంలో ఉన్నత స్థాయికి చేరిన శిష్యులను చూస్తే గురువులకు కూడా శిష్యోత్సాహం కలుగుతుంది. రాజేంద్ర, రమేష్‌లు తీసుకున్న నిర్ణయానికి హర్షిస్తున్నాను’ అని ప్రధానోపాధ్యాయుడు అన్నారు. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని