పెద్దలు చెబితే వినాలి!

నిత్యహరితం అనే అడవికి ఓ కష్టమొచ్చింది. సంవత్సరకాలంగా వర్షాలు పడకపోవడంతో నీటికి కటకట మొదలైంది. అడవిలోని చెరువులు, కుంటలు క్రమంగా ఎండిపోయాయి. తాగటానికి నీరు దొరకకపోవడంతో జంతువులన్నీ అల్లాడుతున్నాయి.

Published : 19 Oct 2021 00:27 IST

నిత్యహరితం అనే అడవికి ఓ కష్టమొచ్చింది. సంవత్సరకాలంగా వర్షాలు పడకపోవడంతో నీటికి కటకట మొదలైంది. అడవిలోని చెరువులు, కుంటలు క్రమంగా ఎండిపోయాయి. తాగటానికి నీరు దొరకకపోవడంతో జంతువులన్నీ అల్లాడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే జంతువులన్నీ మరణించడం ఖాయంగా కనిపించడంతో మృగరాజుకు దిగులు పట్టుకుంది. ఏం చేయాలో తెలియక గుహలో దిగాలుగా కూర్చుంది.

కోతి మృగరాజుకు మంత్రిగా ఉంది. అది సింహంతో ఇలా అంది. ‘మహారాజా! ఇలా దిగులుగా కూర్చుంటే కాలహరణం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. వెంటనే మనం ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. మన అడవికి సుదూరంగా తూర్పు దిక్కున జలగిరులు అనే కొండలున్నాయి. అక్కడ నీళ్లు దొరికే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ విషయం మా పెద్దల ద్వారా విన్నాను’ అంది.

‘సరే.. అయితే ఈ రోజే మనం జంతువులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేద్దాం. రేపు మన ప్రయాణానికి సిద్ధం చేయండి’ అంది సింహం. చాటింపు వేయడంతో జంతువులన్నీ సమావేశమయ్యాయి.

‘సహచరులారా! నీటి కొరత తీవ్రంగా ఉండటం వల్ల మనం అడవిని తాత్కాలికంగా వదిలి వెళ్తున్నాం. జలగిరులు అనే పర్వత ప్రాంతానికి రేపే మనందరం కలిసి బయలుదేరదాం. వర్షాలు సమృద్ధిగా పడిన తర్వాత ఇక్కడికి తిరిగి వద్దాం’ అంది.

జంతువులన్నీ ఒప్పుకొన్నాయి. మరునాడు సూర్యోదయానికి ముందే వలస ప్రారంభమైంది. మంత్రి కోతి దారి చూపిస్తూ ఉంటే.. మిగతా జంతువులు అనుసరించడం మొదలు పెట్టాయి. ఆ జంతువుల గుంపుల్లో కుందేలు కుటుంబం కూడా ఉంది. పిల్ల కుందేలుకు అల్లరి ఎక్కువ. దాని గురించి తెలుసు కాబట్టే. ‘మనం కొత్త ప్రదేశానికి వలస వెళ్తున్నాం. ఆ ప్రదేశం గురించి ఎవరికీ తెలియదు. నువ్వు జాగ్రత్తగా మమ్మల్ని అనుసరించాలి. తప్పిపోతే తిరిగి పట్టుకోవడం కష్టం’ అని తల్లి కుందేలు జాగ్రత్తలు చెప్పింది.

అలా వెళ్తుండగా పిల్ల కుందేలుకు పూల మొక్కలున్న పొద కనిపించింది. ఎంతో సంతోషం వేసి అటువైపు వెళ్లిపోయింది. పిల్ల కుందేలును గమనించకుండా తల్లి కుందేలు చాలా దూరం ముందుకెళ్లింది. కాసేపటికి పిల్లకుందేలు ఈ లోకంలోకి వచ్చి చూస్తే దరిదాపుల్లో ఎవరూ లేరు. పిల్ల కుందేలుకు ఏడుపు ముంచుకొచ్చింది. అక్కడ తల్లి కుందేలు కూడా తన పిల్ల తప్పిపోయిందన్న విషయం గమనించి కంగారు పడింది. విషయం తెలుసుకున్న సింహం కొన్ని జంతువులను తోడుగా ఇచ్చి పిల్ల కుందేలును వెతకడానికి పంపింది.

అదృష్టం కొద్దీ... వాటికి కాసేపటికే పిల్ల కుందేలు కనిపించింది. తల్లి కుందేలు ఏడుస్తున్న దాన్ని అక్కున చేర్చుకుని ఓదార్చింది. తల్లిమాట వినకపోవడం వల్లే ఇదంతా జరిగిందని పిల్లకుందేలు గ్రహించింది. ఇంకెప్పుడూ ఇలాంటివి చేయొద్దు అని నిర్ణయించుకుంది. కాసేపటి తర్వాత ఇవి మిగతా జంతువుల సమూహంలో కలిశాయి. మంత్రి కోతి చెప్పినట్లుగానే జలగిరుల్లో నీళ్లున్నాయి. వర్షాలు పడేంత వరకు అవి అక్కడే నివాసం ఉండి.. తర్వాత అవి తమ అడవైన నిత్యహరితానికి తిరిగి వచ్చేశాయి.  

- వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు