కోతికి తప్పని తిప్పలు!

అనగనగా ఓ పే..ద్ద అడవి. దానికి సింహం రాజు. ఓ రోజు.. మృగరాజు అడవిలోని జంతువులతో సమావేశమైంది. అప్పుడే అక్కడకు వచ్చిన కోతి.. ‘ఏమిటండీ.. మీ పరిపాలన.. జాతరకు వెళ్లకూడదంటారు. నాట్యం చేయకూడదంటారు. హరికథ వద్దు.

Updated : 11 Dec 2021 06:30 IST

నగనగా ఓ పే..ద్ద అడవి. దానికి సింహం రాజు. ఓ రోజు.. మృగరాజు అడవిలోని జంతువులతో సమావేశమైంది. అప్పుడే అక్కడకు వచ్చిన కోతి.. ‘ఏమిటండీ.. మీ పరిపాలన.. జాతరకు వెళ్లకూడదంటారు. నాట్యం చేయకూడదంటారు. హరికథ వద్దు. బుర్ర కథ వద్దు.. అంటూ నన్ను విసిగిస్తున్నారు. పైగా చెట్ల కొమ్మలు విరగ్గొట్టవద్దు అంటారు. నాకు స్వేచ్ఛ లేనేలేదు. ఇదేం పరిపాలన అస్సలు బాగాలేదు’ అంది.

కోపంతో పళ్లు పటపటలాడిస్తూ గట్టిగా గర్జించింది మృగరాజు. ‘ఈ కోతి పొద్దుపొద్దున్నే ఉమ్మెత్తకాయ తిని వచ్చింది అనుకుంటా. మనసుకు ఏం తోస్తే అది, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతోంది. దీన్ని తీసుకెళ్లి ఆ పాడుబడిన బావిలో వేసి పైన రాతి మూత పెట్టండి. అలా పదిరోజులు ఉంచండి. నీళ్లు, ఆహారం రోజు విడిచి రోజు ఇవ్వండి’ అంది సింహం. మృగరాజు చెప్పినట్లుగానే రెండు చేతులు పట్టుకుని ఎత్తి బావిలో కుదేశారు ఎలుగుబంటి రక్షకభటులు.

పది రోజుల అనంతరం కోతిని బావిలో నుంచి తీసి వదిలిపెట్టారు. బావిలో నుంచి బయటపడిన కోతి.. సింహం మెప్పు పొందాలనుకుంది. ‘సింహం నాయకత్వం వర్థిల్లాలి. పాలన అమోఘం. వారి పరిపాలన ఇలాగే నిండు నూరేళ్లు కొనసాగాలి’ అని పెద్దగా అరుస్తూ.. అడవి అంతా తిరగసాగింది.

మళ్లీ కోతిని ఎలుగుబంటి రక్షకభటులు తీసుకు వచ్చి బావిలో పడేశాయి. ‘ఏమిటిది..! అప్పుడు నేను సింహానికి ఎదురు చెప్పానని శిక్షించారు. ఇప్పుడు నేను మృగరాజును పొగిడానుగా! మరెందుకు మళ్లీ.. నన్ను తీసుకువచ్చి ఈ పాడుబడిన బావిలో పడవేస్తున్నారు?’ అంది ఆశ్చర్యంగా.

‘ఓసి.. తిక్కల కోతి. ఇప్పుడు ఈ అడవికి రాజు సింహం కాదు. దానికి బద్ధశత్రువైన పెద్దపులి ఇప్పుడు పాలిస్తోంది. పులిరాజు శత్రువైన సింహాన్ని నువ్వు పొగిడినందుకు నీకు మళ్లీ అదే శిక్ష అమలు చేస్తున్నాం’ అన్నాయి ఎలుగుబంటి రక్షకభటులు.

‘ఓర్నీ! రాజుగారి బిడ్డను ఎత్తుకున్నా.. తప్పే.. దించినా తప్పులాగే ఉందే నా పరిస్థితి’ అంది కోతి. ‘సమయం, సందర్భం తెలియకుండా ఇతరుల విషయాల్లో వేలు పెడితే ఇలాగే తల బొప్పి కడుతుంది’ అంది రామచిలుక. ‘నిజమే మనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకూడదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. ఇక మీదట జాగ్రత్తగా ఉంటా’ అంది కోతి.

- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని