గారెలు.. బూరెలు.. పాయసం.. పరమాన్నం!

ఓ అడవికి రాజు సింహం. అది మాంసాహారం తప్ప, శాకాహారం అస్సలు ముట్టేది కాదు. ఆ అడవిలో రకరకాల పండ్లు, ఆకు కూరలు ఉండేవి. కానీ వాటి వైపు అస్సలు చూసేది కాదు. తింటే మాంసమే తినాలనుకునేది. శాకాహారం తినే జీవుల్ని చిన్న చూపు చూసేది.

Updated : 23 Dec 2021 05:33 IST

ఓ అడవికి రాజు సింహం. అది మాంసాహారం తప్ప, శాకాహారం అస్సలు ముట్టేది కాదు. ఆ అడవిలో రకరకాల పండ్లు, ఆకు కూరలు ఉండేవి. కానీ వాటి వైపు అస్సలు చూసేది కాదు. తింటే మాంసమే తినాలనుకునేది. శాకాహారం తినే జీవుల్ని చిన్న చూపు చూసేది.
ఆ అడవిలో ఓ కోతి కొత్తగా భోజనశాల ఏర్పాటు చేసింది. దాన్ని మృగరాజు సింహంతోటి ప్రారంభం చేయించాలనుకుంది. సింహం గుహకు వెళ్లి ‘మృగరాజా! నేను కొత్తగా భోజనశాల ఏర్పాటు చేశాను. రేపు మీ చేతులతో ప్రారంభించి, నన్ను దీవించండి’ అంది. ‘అలాగే తప్పకుండా మంచి విందు ఇవ్వాలి. నాతో పాటు పులి, నక్క కూడా వస్తాయి’ అంది సింహం. ‘తప్పకుండా మృగరాజా’ అంది కోతి.
మరుసటిరోజు మృగరాజు.. పులి, నక్కలతో కలిసి భోజనశాలకు వెళ్లింది. కోతి కొత్తగా ఏర్పాటు చేసిన భోజనశాల ప్రారంభించింది. కోతి చాలా సంతోషించింది. ‘మృగరాజా! మీ పరివారంతో మా విందు స్వీకరించి వెళ్లండి’ అంది కోతి. పులి, నక్కలతో విందుకు కూర్చుంది సింహం. కానీ సింహానికి ఎక్కడా మాంసం వాసన కానీ, మసాలా వాసన కానీ రాలేదు. కోతి కళ్లలోకి చూస్తూ ‘మిత్రమా! ఈరోజు ప్రత్యేక వంటలేమిటి?’ అని అడిగింది సింహం. అరిటాకులు పరుస్తూ.. ‘గారెలు, బూరెలు, పాయసం, పరమాన్నం..’ అంది కోతి. ఆ మాటకు సింహం అదిరిపడింది. మాంసాహారం తిందామని ఆశతో వచ్చిన సింహానికి నిరాశే ఎదురయ్యింది. చేసేది ఏమీ లేక ‘నేను ఈరోజు పూజలో ఉన్నాను. రెండు పళ్లు తిని, కొద్దిగా పాలు మాత్రమే తాగుతాను’ అంది. కానీ పులి, నక్క లొట్టలేసుకుని విందారగించాయి. ఆ రెండూ ‘గారెలు, బూరెలు, పాయసం, పరమాన్నం.. అద్భుతంగా ఉన్నాయ’ని కోతిని మెచ్చుకున్నాయి. కానీ కోతికి సింహం తినలేదని బాధేసింది. అందుకే ‘మృగరాజా! వీలు చూసుకుని మరోసారి భోజనానికి తప్పక రావాలి. మీ రాక కోసం ఎదురుచూస్తుంటాను’ అంది కోతి. ‘తప్పకుండా వస్తాను’ అని చెప్పి ఆకలితోనే వెనుదిరిగింది సింహం.
కొద్దిరోజులకు సింహం ఆరోగ్యం క్షీణించింది. తన శరీరం మీది అందమైన జూలు రాలసాగింది. కళ్లు మసకబారాయి. కొద్దిదూరం పరిగెత్తేసరికి ఆయాసం రాసాగింది. దంతాలు కూడా కదలసాగాయి. వైద్యుడు ఎలుగుబంటి.. మృగరాజును అన్ని కోణాల్లో పరీక్షించింది. ‘రాజా! విటమిన్ల లోపం వల్ల మీకీ సమస్య వచ్చింది. మాంసాహారంతో పాటుగా శాకాహారం కూడా తినాలి. మాంసం, గుడ్లు, చేపలతో పాటు పాలు, పండ్లు, పప్పుధాన్యాలు కూడా తినండి. త్వరలోనే కోలుకుంటారు’ అంది ఎలుగుబంటి. ఇన్నాళ్లూ తను శాకాహారాన్ని పక్కన పెట్టడం వల్లనే తనకీ అవస్థ వచ్చిందని తెలుసుకుంది సింహం. అప్పుడే కోతి భోజనశాల గుర్తొచ్చింది. వెంటనే తన పరివారంతో గారెలు, బూరెలు, పాయసం, పరమాన్నం తినడానికి వస్తున్నామని కోతికి కబురు పెట్టింది సింహం. ఆరోజు నుంచీ సింహం ఇంకెప్పుడూ శాకాహార జీవులను చిన్న చూపు చూడలేదు.

- పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని