అమ్మ ఒడి

శీతాకాలం.. ఎముకలు కొరికే  అంతలా చలి వీరవిహారం చేస్తోంది. మొదట కాస్త తట్టుకున్నా.. రాను రాను పెరుగుతున్న ఆ చలికి భయపడి.. అడవిలోని పక్షులన్నీ సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లిపోయాయి. తల్లి లేని ఓ పక్షి పిల్ల మాత్రం.. ఎవరి తోడూ లేకపోవడం, ఎవరూ దాన్ని పట్టించుకోకపోవడం, తనంత తానుగా వెళ్లే శక్తి లేకపోవడంతో అడవిలోనే ఉండిపోయింది. దానికి ధైర్యం ఎక్కువ. అందుకే ధీమాగా ఉంటోంది. 

Updated : 12 Jan 2022 01:33 IST

శీతాకాలం.. ఎముకలు కొరికే  అంతలా చలి వీరవిహారం చేస్తోంది. మొదట కాస్త తట్టుకున్నా.. రాను రాను పెరుగుతున్న ఆ చలికి భయపడి.. అడవిలోని పక్షులన్నీ సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లిపోయాయి. తల్లి లేని ఓ పక్షి పిల్ల మాత్రం.. ఎవరి తోడూ లేకపోవడం, ఎవరూ దాన్ని పట్టించుకోకపోవడం, తనంత తానుగా వెళ్లే శక్తి లేకపోవడంతో అడవిలోనే ఉండిపోయింది. దానికి ధైర్యం ఎక్కువ. అందుకే ధీమాగా ఉంటోంది. 

అరణ్యాన్ని చుట్టి వస్తున్న చలిగాలి.. ఆ పక్షి పిల్లను చూసి ఆశ్చర్యపోతూ ‘నీకు నేను తెలుసా’ అంది. ‘తెలియదు’ అంది పక్షి పిల్ల. ‘నువ్వు చలి పేరు ఎప్పుడైనా విన్నావా? అది నేనే’ అంది. ఆ మాటకు పక్షి పిల్ల.. ‘ఓహోఁ..’ అని ఊరుకుంది. తనంటే అందరూ గజగజ వణుకుతారు. అలాంటిది పక్షి పిల్ల అలా అనేసరికి పౌరుషం వచ్చింది చలిగాలికి. అందుకే తన ఉనికిని గురించి కాస్త ఎక్కువ చేసి చెప్పాలనుకుని ఇలా అంది. ‘నా పేరు హిమం.. అంటే మంచు. నేను తాకితే ఎవరైనా వణికిపోవాల్సిందే! మనుషులైతే తెల్లవారి బారెడు పొద్దెక్కినా దుప్పటి ముసుగులో నుంచి లేవరు. సాయంత్రం అయితే చాలు బయటకు రావడానికి జంకుతారు. అంతలా భయపడతారన్నమాట నేనంటే’ అంది గర్వంగా.
ఆ మాటకు పక్షి పిల్ల ‘నువ్వంటే ఎందుకంత భయం..’ అని ఎదురు ప్రశ్న వేసింది. ‘నేను సూర్యకిరణాలను అడ్డగిస్తూ దారి కనపడకుండా చేయగలను. నేను తాకితే రకరకాల అనారోగ్యాలు కూడా కలుగుతాయి. అంతేకాదు నేను తలచుకుంటే శరీరం గడ్డ కట్టించగలను తెలుసా?’ అంది గర్వంగా. ‘అంటే నువ్వు మంచిదానివి కాదన్న మాట’ అంది పక్షి పిల్ల.

తనంతగా చెబుతున్నా సరే భయపడకపోగా.. తిరిగి ఇలా అడుగుతుండేసరికి కాస్త గట్టిగానే జవాబు చెప్పాలనుకుంది చలి. ‘నా పేరుతో ఒక రుతువు కూడా ఉంది. అది  హేమంత రుతువు. ఇప్పుడు అర్థమైందా నేనేమిటో’ అంది. వెంటనే పక్షి పిల్ల ‘సరేలే.. అయినా ఇదంతా నాకెందుకు చెబుతున్నావు?’ అని ప్రశ్నించింది.

ఈ పక్షి పిల్ల భయపడకుండా ఇంత ధైర్యంగా ఉందేంటి అని చలికి సందేహం కలిగింది. అందుకు ఏదో కారణం ఉండే ఉంటుంది అనుకుని అదేంటో తెలుసుకోవాలనుకుంది చలి. ‘నీకు చలివేయడం లేదా’ అని అడిగింది. ‘అంటే ఏంటి?’ అని ఎదురు ప్రశ్న వేసింది పక్షి పిల్ల. అయితే పక్షి పిల్ల దగ్గర ఏదో విశేషం ఉందనిపించి ‘సరే.. నిన్న రాత్రి నువ్వు ఎక్కడ పడుకున్నావు’ అని అడిగింది చలి. ‘నేను రోజూ రాత్రి పూట ఆ గడ్డివాములో నిద్రపోతాను. అక్కడ హాయిగా ఉంటుంది’ అంది పక్షి పిల్ల. ఆ మాట విన్న చలిగాలి ఆ పక్షి పిల్లకు తన సత్తా చూపించాలనుకుంది.

మర్నాడు గడ్డి వామును చెదరగొట్టి పక్షి పిల్లకు ఆసరా లేకుండా చేసింది. కానీ ఆ మరుసటి రోజు పక్షి పిల్ల ఉల్లాసంగా తిరుగుతోంది. అది చూసిన చలిగాలి ఆశ్చర్యపోయింది. బయట పడకుండా.. ‘నిన్న రాత్రి నువ్వు ఎక్కడ పడుకున్నావు’ అని అడిగింది చలి. ‘పొలంలో ఇటుకలు కాలుస్తుంటే ఆ బట్టీ దగ్గర నిద్రపోయాను. అక్కడ చాలా వెచ్చగా ఉంది’ అంది పక్షి పిల్ల. ‘అదీ సంగతి’ అనుకుని.. ఆ రాత్రి, చలిగాలి పొలంలో ఇటుక బట్టీలన్నింటిని తన శక్తితో చల్లబరిచేసింది. పైగా ఎక్కువగా వీచింది.

అయినా సరే మరుసటి రోజు కూడా పక్షి పిల్ల అడవిలో యథా ప్రకారం తిరుగుతోంది. చలిగాలికి ఇంకా కోపం వచ్చేసింది. అసలు విషయం ఏంటో తెలుసుకునేందుకు ‘నువ్వు ఇంకా నా శక్తిని తట్టుకుని నిలదొక్కుకున్నావే. చాలా ధైర్య వంతురాలివి. ఇంతకీ రాత్రి ఎక్కడ ఉన్నావు’ అని సౌమ్యంగా అడిగింది చలిగాలి.

‘ఓ తల్లి తన బిడ్డలను పక్కలో పడుకో బెట్టుకుని నిద్రిస్తుంటే.. నేను కూడా వాళ్లతో పాటు ఆమె పక్కలో ఒదిగి పడుకున్నాను. అక్కడ ఎంత వెచ్చగా ఉందనుకున్నావు. అమ్మ ఒడిలో పడుకుంటే ఎంత బాగుందో. మా అమ్మ దూరమయ్యాక ఆ హాయిని మళ్లీ ఇన్నాళ్లకు పొందగలిగాను. అదంతా నీ వల్లనే! అందుకు నీకు ధన్యవాదాలు’ అంది పక్షి పిల్ల.

ఆ మాటలు విన్న చలిగాలి ‘లోకంలో ఎక్కడయినా ప్రతాపం చూపించగలిగే నేను.. అమ్మ ఒడిలోకి చొరబడి నా ప్రతాపం చూపలేను. ఆ వెచ్చదనాన్ని చల్లబరిచే శక్తి నాకు లేనే లేదు..’ అనుకుని నిట్టూర్పు విడిచింది. సృష్టిలో హద్దులు లేనిది. ఏ దుష్టశక్తులూ నాశనం చేయలేనిది. అమ్మ ప్రేమ మాత్రమే. కాబట్టి అమ్మ ఒడిలోని వెచ్చదనం సృష్టిలో మరి దేనికీ రాదు.

- ఆదిత్య కార్తికేయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు