దురాశ

గట్టయ్య.. యాభై సంవత్సరాలున్న సాధారణ రైతు. తనకు రెండెకరాల పొలం ఉంది. ఒకరోజు గట్టయ్య.. పొలం గట్టుపై కూర్చుని ‘చలికాలం వచ్చేసింది.. ఈసారి పొలంలో కూరగాయలు వేయాలి’ అనుకున్నాడు. అనుకున్న వెంటనే పొలాన్ని చక్కగా దున్నాడు. తర్వాత పొలం మొత్తం గొట్టపుబావిలోని నీటితో తడిపాడు. నేలంతా తడిచాక రకరకాల కూరగాయల విత్తనాలు తెచ్చి వేశాడు.

Updated : 24 Jan 2022 02:32 IST

ట్టయ్య.. యాభై సంవత్సరాలున్న సాధారణ రైతు. తనకు రెండెకరాల పొలం ఉంది. ఒకరోజు గట్టయ్య.. పొలం గట్టుపై కూర్చుని ‘చలికాలం వచ్చేసింది.. ఈసారి పొలంలో కూరగాయలు వేయాలి’ అనుకున్నాడు. అనుకున్న వెంటనే పొలాన్ని చక్కగా దున్నాడు. తర్వాత పొలం మొత్తం గొట్టపుబావిలోని నీటితో తడిపాడు. నేలంతా తడిచాక రకరకాల కూరగాయల విత్తనాలు తెచ్చి వేశాడు.

కొద్దిరోజులకే విత్తనాలన్నీ మొలకెత్తాయి. వాటివైపే చూస్తూ ‘రెండు నెలలపాటు వీటిని చంటిపిల్లల్లా చూసుకోవాలి’ అనుకుంటూ మెల్లిగా వాటిని నిమిరాడు. కొద్దిరోజులకు మొక్కలన్నీ బాగా పెరిగాయి. వాటిలోని బీర, సొర, దొండ లాంటి తీగలకు పందిళ్లు వేశాడు. ఆ పక్కనే గుమ్మడి పాదు, మునగ చెట్లు ఉన్నాయి. గట్టయ్య వాటిని కంటికి రెప్పలా కాపాడుతూ, అవసరమైనప్పుడు నీళ్లు, ఎరువూ అందిస్తూ వచ్చాడు. మొక్కలు ఏపుగా పెరగడం చూసి గట్టయ్య సంతోషించాడు.

రోజూ చీకటిపడగానే కూరగాయలు మాట్లాడుకునేవి. ‘మనం ఇక్కడ కొద్ది రోజులపాటే కలిసి ఉంటాం. కాబట్టి గొడవపడకుండా సంతోషంగా ఉందాం’ అంది సొరకాయ. ఆ మాటలకు కాకరకాయ, బీరకాయ, మునగ.. మూడూ ఒకేసారి ‘అవును.. అందరం కలిసిమెలిసి ఉండాలి’ అన్నాయి. గట్టయ్య ఒక్కరోజు పొలంవైపు రాకపోయినా వాటికి బాధ కలిగేది. ‘ఏంటో .. ఈరోజు గట్టయ్య రాలేదు’ అని మునగ అంటే, ‘తన కష్టం చూస్తే జాలేస్తోంది’ అని సొరకాయ అంది. ‘అందుకే మనం బాగా పెరిగి అతనికి లాభం వచ్చేలా చేయాలి’ అని చెప్పింది కాకర. అవునంటూ తలూపాయి మిగిలినవి.

గుమ్మడి పాదులోని ఒక కాయ అన్నింటి కంటేే బలంగా ఉంది.. దానికి దురాశ! భూమిలోని సారమంతా ఆబగా తనొక్కతే పీల్చుకునేది. ‘ఇది పద్ధతి కాదు.. సారమంతా నువ్వే తీసుకుంటే మా పరిస్థితి ఏంటి?’ అని మిగతా కూరగాయలు అన్నాయి. అయితే అది ఎవరి మాటనూ పట్టించుకోలేదు. పైగా ‘మీకు పెరగడం చేతకాక ఇలా మాట్లాడుతున్నారు. గట్టయ్య నన్ను చూస్తే ఎంతో గర్వపడతాడు. అంతేకాదు.. నన్ను పదిమందికీ చూపుతాడు’ అంటూ వాటిని గేలి చేసింది కూడా! 

ఆ గుమ్మడికాయ వల్ల, చుట్టుపక్కల కూరగాయల్లో ఎదుగుదల ఆగిపోయింది. ఒకరోజు గట్టయ్య ఆ గుమ్మడికాయను చూశాడు. దాన్ని పట్టుకుని బరువు చూశాడు. చుట్టూ ఉన్న కూరగాయలను కూడా పరిశీలించి, ‘ఇవి పెరగకపోవడానికి ఇదే కారణం. ఎరువంతా ఇదొక్కటే పీల్చుకున్నట్లుంది’ అనుకుని క్షణం ఆలస్యం చేయకుండా దాన్ని పీకి నెత్తిన పెట్టుకున్నాడు. గుమ్మడికాయ ‘నా దురాశ వలనే నాకు ఈ దుస్థితి కలిగింది’ అని మనసులో అనుకుంటూ కుమిలిపోయింది. గుమ్మడికాయ పరిస్థితి చూసి మిగతా వాటికి జాలేసింది. ‘మనం ఎంత చెప్పినా అది వినలేదు’ అంటూ సొరకాయ మిగతావాటితో గుసగుసలాడింది. ‘అవును.. విని ఉంటే మనతో పాటు ఇంకొంతకాలం ఇక్కడే సంతోషంగా ఉండేది’ అని విచారంగా చెప్పింది బీరకాయ. గట్టయ్య గుమ్మడికాయను ఇంటికి తీసుకుని వెళ్లగానే, ఆయన భార్య దాన్ని నేలకేసి కొట్టి కొంతభాగం కూరచేసింది. మిగిలిన ముక్కలను చుట్టుపక్కలవారికి పంచిపెట్టింది. దాంతో గుమ్మడికాయ జీవితం ముగిసిపోయింది. గుమ్మడికాయ వెళ్లిపోయాక మిగిలిన కూరగాయలు ఏపుగా పెరిగాయి. అయితే అవి రోజుకు ఒక్కసారైన గుమ్మడికాయను తలచుకుంటూ ఉండేవి.

- హర్షిత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని