రైతన్నే అసలైన రాజు!

చిత్రావతి రాజ్యాన్ని మహానందుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు...

Published : 22 Sep 2020 00:52 IST

చిత్రావతి రాజ్యాన్ని మహానందుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. రాజ్యంలోని వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటూ మంచిపేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు మహారాజు.. రాజదర్బారులో ప్రజా సమస్యలు పరిష్కరించి ఆలస్యంగా భోజనశాలకు వెళ్లాడు. పనివాళ్లు అప్పటికే భోజనం బల్ల మీద పంచభక్ష్య పరమాన్నాలు సిద్ధం చేసి ఉంచారు. అసలే రాజు ఆకలి మీద ఉండటంతో వండిన పదార్థాలన్నీ చాలా రుచికరంగా అనిపించాయి. అంత బాగా వంట చేసిన వాళ్లను పిలిచి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నాడు.

మహామంత్రికి విషయం తెలపడంతో వెంటనే వంట సిబ్బందిని రాజు ముందు హాజరు పరిచాడు. ‘ఇంత అద్భుతమైన భోజనం పెట్టిన మిమ్మల్ని అభినందిస్తున్నా’ అని అన్నాడు రాజు. వంటవాళ్లు వినయంగా ‘మహారాజా! క్షమించండి. ఈ గొప్పతనం మాది కాదు! నాణ్యమైన సరకులు, తాజా కూరగాయలు అందించిన వ్యాపారిదే’ అన్నారు. ఓహో.. అలాగా.. అయితే ఆ వ్యాపారినే పిలిపించండి అని రాజు ఆజ్ఞ జారీ చేశాడు. వ్యాపారి రాగానే విషయం అంతా చెప్ఫి. ‘ఈ గొప్పతనమంతా నీదే.. అందుకో బహుమతి’ అన్నాడు రాజు. ‘అయ్యా! మీరు ధర్మప్రభువులు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. రేయింబవళ్లు కష్టపడి సేంద్రియ ఎరువులతో కంటికి రెప్పలా కాపాడుతూ పంట పండించిన రైతుదే’ అని బదులిచ్చాడు.

అవునా.. అయితే ఆ రైతునే పిలిపించండని ఆదేశించాడు రాజు. సిబ్బంది రైతును ప్రవేశపెట్టారు. ‘మహారాజా! ఇందులో ప్రత్యేకంగా నేను చేసింది ఏమీ లేదు. నా పని నేను చేశా. భూమినే నమ్ముకొని బతుకుతున్నాం. మట్టి లేకపోతే మొక్క మొలవదు.. పంట పండదు కదా!’ అని అన్నాడు. భూమిని ప్రశ్నించగా.. పైనున్న ఆకాశానిదే గొప్పతనం అని చెప్పింది. ఆకాశాన్ని అడగ్గా.. ‘రాజా! నాదేం లేదు. నానుంచి ఉదయించే సూర్యుడు, వర్షించే వరుణుడిదే ఆ గొప్పతనమంతా’ అంది. సూర్యుడు, వరుణుడిని అడగ్గా ‘భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఉదయించలేం, అస్తమించలేం.. వర్షం కురిపించలేము కదా’ అన్నారు. ఆ సమాధానంతో రాజుతో పాటు మిగతావాళ్లంతా భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు.

మనం తినే అన్నం వెనుక ఇంత మంది కృషి దాగి ఉందా అని అనుకున్నాడు మహారాజు. ఆ సత్యాన్ని రాజ్యంలోని ప్రజలకు తెలియజేసి ఆహారాన్ని వృథా చేయవద్దని చాటింపు వేయించాడు. అందరి ఆకలి తీర్చేందుకు శ్రమిస్తున్న అన్నదాతల కష్టాన్ని గుర్తించిన రాజు రైతులందరికీ భూమిని పంపిణీ చేశాడు. అన్నదాతలు రాజుకు పన్నులు కట్టాల్సిన అవసరం లేదన్నాడు. అప్పటి నుంచి రైతే అసలైన రాజు అని ప్రకటించాడు.

- గెడ్డం సుశీలరావు, విశాఖపట్నం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని