ఆమె ఇల్లు.. శిలాజాల ఖజానా!

రాళ్లు మాట్లాడతాయి.. కానీ ఆ మాటలు చెవులకు వినిపించవు! కళ్లకు కనిపిస్తాయి! ‘రాళ్లేంటి? మాట్లాడటం ఏంటి? ఆ మాటలు చెవులకు వినిపించకుండా.. కళ్లకు కనిపించడం ఏంటి? ఏంటో.. అంతా అయోమయంగా ఉంది’...

Published : 31 Jan 2021 00:44 IST

రాళ్లు మాట్లాడతాయి.. కానీ ఆ మాటలు చెవులకు వినిపించవు! కళ్లకు కనిపిస్తాయి! ‘రాళ్లేంటి? మాట్లాడటం ఏంటి? ఆ మాటలు చెవులకు వినిపించకుండా.. కళ్లకు కనిపించడం ఏంటి? ఏంటో.. అంతా అయోమయంగా ఉంది’ అని అనుకుంటున్నారా?! రాళ్లు.. చరిత్రకు సజీవ సాక్ష్యాలు. కొన్ని వందల ఏళ్లనాటి జీవుల గురించి అవి మనకు మౌనంగా చెబుతాయి... ఏంటి అలా వింతగా చూస్తున్నారు! ఇంకా పూర్తిగా అర్థమవడం లేదు కదూ! అయితే ఈ కథనం చదివేయండి!!

మిళనాడుకు చెందిన అస్వతా బిజు... ఓ విద్యార్థి. ఆమె వయసు 13 సంవత్సరాలు. ఆమె హాబీ శిలాజాల సేకరణ. చెన్నైలోని ఎగ్మూర్‌ మ్యూజియం అంటే అస్వతాకు ఎంతో ఇష్టం. దాన్ని మొట్టమొదటిసారిగా తనకు అయిదేళ్లు ఉన్నప్పుడు అమ్మానాన్నతో కలిసి సందర్శించింది. వాళ్ల నాన్న తనకు ఓ చిత్రాన్ని బహుమతిగా ఇచ్చారు. అది ఓ శిలాజానికి సంబంధించింది. అది తనలో అదేంటో తెలుసుకోవాలన్న ఉత్సుకతను ప్రేరేపించింది.

శిలాజం అంటే..
‘అసలు ఈ శిలాజం అంటే ఏంటి?’ అనే అనుమానం మీకు వచ్చింది కదా! మీకే కాదు.. అయిదేళ్ల వయసులో అస్వతాకూ వచ్చింది. అప్పుడు వాళ్ల అమ్మ తన సందేహాన్ని తీర్చింది... కొన్ని వందల ఏళ్ల క్రితంనాటి జీవులు మరణించి కాలక్రమేణా రాయిగా మారిపోతాయి. వీటినే శిలాజాలు అంటారు. ఇలా మారడానికి ప్రకృతి సిద్ధంగా కొన్ని చర్యలు కారణమవుతాయి. ఎక్కువగా జలచరాలు ఇలా మారతాయి. మొక్కలు, వృక్షాలు కూడా శిలాజాలుగా తయారవుతాయి. ఇలా ఏర్పడిన వాటిని అధ్యయనం చేయడాన్నే పాలియోంటాలజీ అంటారు.

అభిరుచిగా మారిన ఆసక్తి
శిలాజాల గురించి తెలుసుకున్న అస్వతాకు క్రమంగా వాటిమీద విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. అదే చాలాసార్లు మ్యూజియాన్ని సందర్శించేలా చేసింది. శిలాజాలు ఎక్కువగా దొరికే తిరుచ్చికి సమీపంలోని అరియలూరు, గుండుపెరుంబేడు, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచాకు కూడా వెళ్లింది. అక్కడ దాదాపు 130 శిలాజాలను సేకరించింది. వాటిని చెన్నెలోని తన నివాసంలో భద్రపరిచింది. అంటే ఓ రకంగా ఆమె ఇల్లే చిన్న మ్యూజియం అన్నమాట! ఇప్పటి వరకు పలు ప్రదర్శనలు ఏర్పాటు చేసి దాదాపు 6,700 మంది విద్యార్థులకు శిలాజాలపై అవగాహన కల్పించింది. ఇలా దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన పాలియోంటాలజిస్టుగా గుర్తింపు పొందింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు