‘మందాయ్‌’తో వన్యప్రాణులకు హాయ్‌.. హాయ్‌!

అనగనగా ఓ అడవి.. ఆ అడవి మధ్యలోంచి ఓ రోడ్డు. ఓ జింక పిల్ల రోడ్డు దాటుతోంది.. ఓ పే..ద్ద లారీ చాలా వేగంగా వస్తోంది

Published : 21 Feb 2021 00:23 IST

అనగనగా ఓ అడవి.. ఆ అడవి మధ్యలోంచి ఓ రోడ్డు. ఓ జింక పిల్ల రోడ్డు దాటుతోంది.. ఓ పే..ద్ద లారీ చాలా వేగంగా వస్తోంది. జింక పరుగెడుతోంది.. లారీ వస్తోంది. జింక లారీని చూసింది.. భయంతో గెంతుతోంది.. పి..పి..ప్పీ.. పి..పి..ప్పీ.. అని హారన్‌ మోగుతోంది.. కీచ్‌.. మని లారీ బ్రేకుల శబ్దం.. రోడ్డుపై టైర్లు అరిగిన గుర్తులు. జింకపిల్ల కాస్తలో బయటపడింది. దాని అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది. అయినా ఈ రోజుకు సరే.. మరి రేపటి పరిస్థితి ఏంటి?
ఇలాంటి జీవుల ప్రాణాలు కాపాడటానికే సింగపూర్‌లో ‘మందాయ్‌ వైల్డ్‌లైఫ్‌ బ్రిడ్జి’ని నిర్మించారు. అడవి మధ్యలోంచి వెళుతున్న రోడ్డు వల్ల మౌస్‌ డీర్లు, ఉడతలు, పంగోలియన్లు, అడవి పిల్లులు ఇబ్బంది పడకుండా ఈ వంతెన ఉపయోగపడుతోంది. బ్రిడ్జి అంటే ఏదో మామూలుది అనుకునేరు. ఇది అసలు వారధిలానే ఉండదు. చెట్లు, మొక్కలు, పచ్చదనం అల్లుకుని అచ్చం అడవిలానే ఉంటుంది.

కేవలం జంతువులకే..
మరో విశేషం ఏంటంటే.. ఈ వంతెనపై మనుషులకు ప్రవేశం లేదు. కేవలం జంతువులకే అనుమతి ఉంది. 2019 డిసెంబరులో దీని నిర్మాణం పూర్తైంది. దీన్ని కట్టడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పట్టింది. ఈ వంతెన 140 మీటర్ల పొడవు ఉంది. ఈ బ్రిడ్జి మీద ఓ చిన్నపాటి అడవినే సృష్టించారు. మొత్తానికి సింగపూర్‌ వాళ్లు వన్యప్రాణులకు ఏ ప్రమాదమూ రాకుండా ఇంతటి రక్షణ చర్యలు తీసుకోవడం బాగుంది కదా..! మన దగ్గరా ఇలాంటి ఏర్పాట్లు చేస్తే చక్కగా ఉంటుంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని