బుడత... సైక్లింగ్‌లో చిరుత!

పిల్లలూ.. అమ్మానాన్నలను బతిమాలో, గొడవ చేసో ఎలాగోలా సైకిల్‌ కొనిపించుకుంటాం. ఉదయమో, సాయంత్రమో కాసేపు దానిపై అలా అలా తిరిగి వస్తాం. అమ్మ ఏదైనా తీసుకురమ్మని చెబితే దగ్గరే అయినా సైకిల్‌పైనే దుకాణానికి వెళ్లి వస్తాం. కానీ,

Updated : 09 Mar 2021 01:49 IST

పిల్లలూ.. అమ్మానాన్నలను బతిమాలో, గొడవ చేసో ఎలాగోలా సైకిల్‌ కొనిపించుకుంటాం. ఉదయమో, సాయంత్రమో కాసేపు దానిపై అలా అలా తిరిగి వస్తాం. అమ్మ ఏదైనా తీసుకురమ్మని చెబితే దగ్గరే అయినా సైకిల్‌పైనే దుకాణానికి వెళ్లి వస్తాం. కానీ, ఓ బుడత మాత్రం సైక్లింగ్‌ ఛాలెంజ్‌లో పాల్గొని అందరితో శెభాష్‌ అని అనిపించుకుంటున్నాడు. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!!

హారాష్ట్రలోని పుణెకు చెందిన ఆనంద్‌ భన్సాలి ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతడు ఇటీవల ఓ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లింగ్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. కేవలం అయిదు రోజుల్లో 580 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశించిన లక్ష్యమైన గోవా చేరుకున్నాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. పోటీల్లో పాల్గొన్న మొత్తం 20 మందిలో ఆనందే చిన్నవాడు.

కష్టమైన మార్గాన్ని ఎంచుకొని..
పుణెలో సైకిల్‌ తొక్కడం ప్రారంభించిన ఆనంద్‌ తన గమ్యాన్ని చేరుకునేందుకు జాతీయ రహదారి కాకుండా పశ్చిమ కనుమల మీదుగా సాగే ఘాట్‌ రోడ్డును ఎంపిక చేసుకున్నాడు. ప్రతి రోజూ 120 నుంచి 130 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడు. మార్గం మొత్తం ఇతర కార్లు, ద్విచక్రవాహనాలు, ఒక అంబులెన్స్‌ అతడి వెంట సహాయకంగా ఉన్నాయట. ఏదైనా రిపేర్‌ వచ్చినా ఇబ్బంది కాకుండా అదనంగా సైకిళ్లను అందుబాటులో ఉంచారు. మార్గాన్ని బట్టి ఆనంద్‌ తెలివిగా తన సైకిల్‌ వేగాన్ని నియంత్రించేవాడు. యాత్రలో నాలుగో రోజు ఉదయాన్నే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి విపరీతమైన వర్షం కురిసిందట. ఆ బలమైన గాలులను ఎదుర్కొంటూనే తన పయనం సాగించాడు ఆనంద్‌.

బహుమతిగా సైకిల్‌..
‘మా నాన్న, సోదరికి సైక్లింగ్‌ అంటే ఇష్టం. చిన్నతనం నుంచి వారిని చూస్తూ పెరిగిన నాకు కూడా ఆసక్తి ఏర్పడింది. 2018లో మా నాన్న నాకు ఖరీదైన సైకిల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇక అప్పటి నుంచి సైక్లింగ్‌పై ఇష్టం మరింత పెరిగింది’ అని ఆనంద్‌ వివరించాడు. భవిష్యత్తులో మరింత గుర్తింపు సాధిస్తానని చెబుతున్న అతడికి.. మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని