క్యూబ్స్‌ను కలిపి.. చిత్రంగా మలిచి..

పిల్లలూ.. రూబిక్‌ క్యూబ్‌ను చూసే ఉంటారు.. వాటిలోని రంగులను కలిపేందుకు ప్రయత్నించే ఉంటారు. కొందరు చకచకా కలిపేసి ఉంటారు కూడా.. కానీ, ఓ బాలుడు మాత్రం క్యూబ్స్‌ రంగులను

Published : 18 Mar 2021 00:20 IST

పిల్లలూ.. రూబిక్‌ క్యూబ్‌ను చూసే ఉంటారు.. వాటిలోని రంగులను కలిపేందుకు ప్రయత్నించే ఉంటారు. కొందరు చకచకా కలిపేసి ఉంటారు కూడా.. కానీ, ఓ బాలుడు మాత్రం క్యూబ్స్‌ రంగులను కలిపేయడమే కాకుండా వాటితో ఏకంగా చిత్రాలనే రూపొందిస్తున్నాడు. అతడెవరో, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి..!!
కేరళ రాష్ట్రంలోని కొచ్చికి చెందిన అద్వైత్‌ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రూబిక్‌ క్యూబ్‌ల సహాయంతో మొసాయిక్‌ చిత్రాలు వేస్తూ అబ్బురపరుస్తున్నాడు.
సోదరుడు చేసిన పరిచయం
అద్వైత్‌కు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు తన కజిన్‌ సోదరుడు ఒక రూబిక్‌ క్యూబ్‌ను ఇచ్చాడు. దాంతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకరోజు అన్ని రంగులు కలిపేసి శెభాష్‌ అనిపించుకున్నాడు. అలా పెరిగిన ఆసక్తి క్రమక్రమంగా ఆ క్యూబ్స్‌ సహాయంతో ప్రముఖుల బొమ్మలు పెయింటింగ్‌గా వేసే వరకు వెళ్లింది. లాక్‌డౌన్‌లో సమయం వృథా చేయకుండా యూట్యూబ్‌లో వీడియోలు చూసి మెలకువలు నేర్చుకున్నాడు. అలా ఇప్పటివరకు అతడు తన దగ్గరున్న 300 క్యూబ్స్‌తో దాదాపు 12 మంది ప్రముఖుల ముఖాలను చిత్రించాడు. వారిలో ప్రధాని మోదీ, సచిన్‌, మమ్ముట్టి, మోహన్‌లాల్‌, కేరళ సీఎం విజయన్‌ తదితరులు ఉన్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం
మొదట్లో క్యూబ్స్‌ సహాయంతో చిత్రాలు సాధన చేస్తుంటే తల్లిదండ్రులు సరదాగా తీసుకున్నారు. ఒకరోజు వాళ్ల పెళ్లి ఫొటోను క్యూబ్స్‌తో చిత్రించడం చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు తమ కుమారుడిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు.

ఇంటర్నెట్‌ సహాయంతో..
తాను గీయాలనుకున్న వారి చిత్రాన్ని అద్వైత్‌ ముందే ఇంటర్నెట్‌లో ఎంపిక చేసుకుంటాడు. తర్వాత దాన్ని పిక్సెల్స్‌గా విభజిస్తాడు. అది చూస్తూ.. ఆ రంగుల ఆధారంగా క్యూబ్స్‌తో బొమ్మగా మలుస్తాడన్నమాట.
దుబాయ్‌ రాజు బొమ్మకు అవార్డు
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అద్వైత్‌ అతి తక్కువ సమయంలోనే దుబాయ్‌ రాజు బొమ్మ చిత్రించాడు. అక్కడే ఉండి బాలుడి ప్రతిభను ప్రత్యక్షంగా చూసి యూనివర్సల్‌ రికార్డు ఫోరం ప్రతినిధులు అతడికి అవార్డు అందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆయన చిత్రం రూపొందించాలని అద్వైత్‌ ఉవ్విళ్లూరుతున్నాడు. ‘రూబిక్‌ క్యూబ్‌ మొసాయిక్‌ ఆర్ట్‌’లో దేశంలోనే అతిచిన్న వయసు ప్రతిభావంతుడిగా గుర్తింపు సాధించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని