తల తెగినా.. హాయిగా బతకగలదు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ప్రపంచంలో ఎన్నో రకాల జీవులు.. ఎన్నెన్నో వింతలున్నాయి కదా! జీవుల్లో కొన్ని అరుదైనవి ఉంటాయి..

Published : 24 Mar 2021 00:13 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ప్రపంచంలో ఎన్నో రకాల జీవులు.. ఎన్నెన్నో వింతలున్నాయి కదా! జీవుల్లో కొన్ని అరుదైనవి ఉంటాయి.. ఇంకొన్నింటికి ప్రత్యేకతలు ఉంటాయి. నీటిలో నివసించే అలాంటి ఓ ప్రత్యేక జీవి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..!!

సాధారణంగా బల్లులు వాటి తోక తెగినా.. తిరిగి నిర్మించుకోగలవని తెలిసే ఉంటుంది. అలాగే కొన్ని చేపలు, చిన్న చిన్న జంతువులు కాళ్లు, తోకలాంటి అవయవాలు కోల్పోతే మళ్లీ పెంచుకుంటాయి. కానీ,  సాకోగ్లోస్సాన్‌ అనే జాతికి చెందిన నత్తలు ఏకంగా తల తెగినా.. మళ్లీ శరీరాన్ని సృష్టించుకొని బతకగలవట.
ఆత్మరక్షణ కోసం..
బల్లులు తదితర చిన్న జీవులు ఆత్మరక్షణ కోసం వాటి శరీరంలోని చిన్న చిన్న భాగాలను తెంచేసుకుంటాయి. ఈ సాకోగ్లోస్సాన్‌ జాతి నత్తలను పెద్ద చేపలు, పీతలు, పాములు ఆహారంగా తింటాయట. వేరే జీవులు తమను వేటాడే సమయంలో వాటి నుంచి తప్పించుకునేందుకు ఈ నత్తలు ఆత్మరక్షణగా మెడ నుంచి కింది శరీర భాగాన్ని వదిలేస్తాయట.
రెండు వారాల్లోనే..
ఏదైనా కారణంతో శరీర భాగాన్ని వదిలేస్తే నత్తకు తల మాత్రమే మిగులుతుంది. ఆ మెడలోని కణాలకు పూర్తి శరీరాన్ని తిరిగి నిర్మించుకునే శక్తి ఉంటుందని జపాన్‌లోని ఓ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల తమ పరిశోధనల్లో ఈ విషయం తెలిసిందట. అంతేకాదు.. కేవలం రెండు వారాల నుంచి నెల రోజుల్లోపే శరీరం మొత్తం తయారైపోతుందట. మనకు చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోతాం.. అలాంటిది తల ఒక్కటే మిగిలినా, మళ్లీ పూర్తి శరీరాన్ని నిర్మించుకోగలిగిన ఈ నత్త విశేషాలు భలే ఉన్నాయి కదూ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని