వాటర్‌ గన్‌.. వెరైటీగా..!!

పిల్లలూ.. హోలీ వచ్చింది. మనకెంతో ఇష్టమైన పండగ ఇదే కదూ! ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ...

Updated : 29 Mar 2021 05:53 IST

చూడండి.. చెయ్యండి

పిల్లలూ.. హోలీ వచ్చింది. మనకెంతో ఇష్టమైన పండగ ఇదే కదూ! ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. వాటర్‌ గన్‌తో పోటాపోటీగా నీళ్లు పోసుకుంటుంటే భలే సరదాగా ఉంటుంది. కరోనా భయంతో ఈసారి బయటకు వెళ్లి పండగ జరుపుకొనే పరిస్థితి లేదు. అందుకే, ఇంట్లోనే ఉండి వాటర్‌ గన్‌ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం..!!  

ఎలా చేయాలంటే..
ముందుగా 25 నుంచి 30 సెంటీమీటర్ల పొడవైన, చతురస్రాకారంలో ఓ రంగు కాగితాన్ని తీసుకోండి. దానికి ఒకవైపు జిగురు అంతికించి.. గొట్టం మాదిరి గుండ్రంగా చుట్టాలి. అదే రంగుది మరో కాగితం తీసుకొని.. కోన్‌ మాదిరి మలిచి అతికించాలి. దాని చివర డెకరేషన్‌ రిబ్బన్‌ని చుట్టాలి. దీన్ని మొదట తయారు చేసుకున్న గొట్టానికి ముందు భాగంలో ఫొటోలో చూపించినట్లు ఒక గుండ్రని పేపర్‌ సహాయంతో అంటించాలి. ఇప్పుడు మరో కాగితం తీసుకొని, మొదటి గొట్టంలోకి దూరే అంత పరిమాణంలో గుండ్రంగా తయారు చేసుకోవాలి. దానికి ఒకవైపు జిగురు సహాయంతో ఒక గట్టి, పొడవైన పుల్లను అతికించాలి. అంటే.. అది పంప్‌లా పనిచేస్తుందన్నమాట. కావాలంటే.. ఆ పుల్లను కూడా మీకు నచ్చినట్లు డెకరేట్‌ చేసుకోవచ్చు. ఇక మీ బొమ్మ వాటర్‌ గన్‌ సిద్ధమైనట్లే.. అందులో రంగు నీళ్లు పోసి ఆడుకోలేకపోయినా.. ఎంచక్కా మీ అల్మారాలో అలంకరించుకోవచ్చు. స్నేహితులు, బంధువులకు చూపిస్తే.. వాళ్లు వావ్‌ అనాల్సిందే..!!

కావాల్సిన వస్తువులు
1. మందపాటి రంగు కాగితాలు  
2. డెకరేషన్‌ రిబ్బన్లు, పొడవాటి పుల్ల
3. కత్తెర, జిగురు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని