రెక్కల రెస్టారెంట్‌లో విందు.. భలే పసందు!

పిల్లలూ.. మనం ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్లి భోజనం చేయాలనుకుంటే హోటల్‌కో, రెస్టారెంట్‌కో వెళ్తాం కదా! కానీ, జపాన్‌ వాళ్లు మాత్రం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నారట! మరి, ఆ విశేషాలేంటో

Published : 08 Apr 2021 00:08 IST

పిల్లలూ.. మనం ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్లి భోజనం చేయాలనుకుంటే హోటల్‌కో, రెస్టారెంట్‌కో వెళ్తాం కదా! కానీ, జపాన్‌ వాళ్లు మాత్రం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నారట! మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!!
కరోనా సెకండ్‌ వేవ్‌తో మళ్లీ లాక్‌డౌన్‌ వాతావరణం కనిపిస్తోంది. దాదాపు అన్ని దేశాలు ప్రజా రవాణా తదితర అంశాల్లో పలు ఆంక్షలు విధించాయి. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు దాదాపుగా నిలిచిపోయాయి. అనేక దేశాల్లో విమానాలు ఎయిర్‌పోర్ట్‌కే పరిమితమయ్యాయి. ఈ పరిస్థితిని జపాన్‌లోని ఓ ఎయిర్‌లైన్స్‌ సంస్థ తమకు అనుకూలంగా మార్చుకుంది.

భోజనం రూ.40వేలు
టోక్యోలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో ఖాళీగా ఉన్న విమానాల్లో ఒకదాన్ని తాత్కాలిక రెస్టారెంట్‌గా మార్చేసింది. అంటే, రన్‌వేపై ఆగి ఉన్న ఆ విమానంలో ఆహార పదార్థాలు వడ్డిస్తారన్నమాట. ఇటీవల ప్రారంభించిన ఈ రెక్కల రెస్టారెంట్‌లో భోజనం ఖరీదు రూ.40వేలు. ‘వామ్మో.. అంతనా?’ అని నోరెళ్లబెట్టకండి. అంత ధర ఉన్నా.. జపాన్‌ ప్రజలు విమానంలో కూర్చొని తినేందుకు వరుస కడుతున్నారట. అందుకే నిర్వాహకులు ఆన్‌లైన్‌ బుకింగ్‌ను తీసుకువచ్చారు. డిమాండ్‌ను బట్టి అదనపు స్లాట్లు కూడా కేటాయిస్తున్నారట. అంతేకాదండోయ్‌.. ఫస్ట్‌ క్లాస్‌ సీటింగ్‌ ధర భరించలేని వారికి.. కొంచెం తక్కువకు అంటే రూ.20వేలకు బిజినెస్‌ క్లాస్‌లో భోజనం చేసే అవకాశం కల్పిస్తున్నారు. జపాన్‌ కంటే ముందు గత అక్టోబర్‌లో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌బస్‌ విమానంలో లంచ్‌ చేసే అవకాశం కల్పించింది. ఇవండీ విమానంలో విందు విశేషాలు..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని