జిల్‌.. జిల్‌.. జిగేల్‌ షార్క్‌!

కొన్ని రకాల జెల్లీఫిష్‌లు, చేపలు, రొయ్యల్లాంటి సముద్ర జీవులు చీకట్లో ప్రకాశిస్తుంటాయి. ఇవి ఎక్కువగా నీలి రంగులో మెరుస్తూ కనిపిస్తుంటాయి...

Published : 12 Apr 2021 01:06 IST

కొన్ని రకాల జెల్లీఫిష్‌లు, చేపలు, రొయ్యల్లాంటి సముద్ర జీవులు చీకట్లో ప్రకాశిస్తుంటాయి. ఇవి ఎక్కువగా నీలి రంగులో మెరుస్తూ కనిపిస్తుంటాయి. కానీ ఈ మధ్యే జరిపిన పరిశోధనలో కైట్‌ఫిన్‌ అనే ఓ సొరచేప సైతం ఇలాగే వెలుగులు వెదజల్లుతోందని తేలింది. ఆ విశేషాలు క్లుప్తంగా తెలుసుకుందామా!

ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద దాదాపు 540 రకాల షార్క్‌లున్నాయి. అందులో ఓ 57 రకాల వరకు చీకట్లో ప్రకాశిస్తుంటాయి. అయితే ఇంత వరకు తెలియని విషయం ఏంటంటే దాదాపు ఆరు అడుగుల పొడవు పెరిగే కైట్‌ఫిన్‌ షార్క్‌ సైతం ఇలా వెలుగులీనుతుందని! కొంతమంది పరిశోధకులు న్యూజిలాండ్‌ సముద్రజలాల్లో పరిశోధిస్తున్నప్పుడు ఈ వింత బయటపడింది. ప్రస్తుతానికి ఇదే ప్రకాశించే అతిపెద్ద జీవిగా రికార్డులకెక్కింది.
మూడు హార్మోన్ల వల్ల..
మామూలుగా షార్క్‌లు సముద్ర ఉపరితలాలపైన ఎక్కువగా తిరుగుతుంటాయి. కానీ ఈ కైట్‌ఫిన్‌ షార్క్‌ మాత్రం అట్టడుగున చీకటి ప్రాంతాల్లో నివసిస్తుంది. ఓ మూడు హార్మోన్ల వల్లే ఈ జీవి ఇలా వెలుగులు పంచగలుగుతోందని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. మొత్తానికి ఈ ప్రత్యేక లక్షణం ఎందుకు ఉందనేది ఇప్పటికైతే ఒక మిస్టరీగానే ఉంది. శత్రువులను ఏమార్చడానికి, ఆహారం సంపాదించుకునేందుకే ఇవి ఇలా చేస్తూ ఉండొచ్చు అని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఇంకాస్త లోతుగా పరిశోధనలు జరిగితే కానీ మరిన్ని విషయాలు తేలవు. ప్రస్తుతానికి ఇవీ జిల్‌.. జిల్‌.. జిగేల్‌ షార్క్‌ విశేషాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని