నడిచే లైబ్రరీ.. ఈ చిన్నారి!

కనిపిస్తే.. చదివేస్తుంది.. ఔను.. కనిపిస్తే చాలు.. చదివేస్తుంది.. అది ఎంత పెద్ద పుస్తకం కానీ... దాని పని పట్టేస్తుంది.. క్షణం తీరిక దొరికినా చాలు.. చేతిలో పుస్తకం ఉండాల్సిందే! ఆఖరుకు నడుస్తూ కూడా బుక్‌ తిరగేసేస్తుంది ఈ బుడత!! ఈ నడిచే లైబ్రరీ ఇటీవల ఓ ప్రపంచ రికార్డునూ సృష్టించింది

Published : 17 Apr 2021 01:01 IST

కనిపిస్తే.. చదివేస్తుంది.. ఔను.. కనిపిస్తే చాలు.. చదివేస్తుంది.. అది ఎంత పెద్ద పుస్తకం కానీ... దాని పని పట్టేస్తుంది.. క్షణం తీరిక దొరికినా చాలు.. చేతిలో పుస్తకం ఉండాల్సిందే! ఆఖరుకు నడుస్తూ కూడా బుక్‌ తిరగేసేస్తుంది ఈ బుడత!! ఈ నడిచే లైబ్రరీ ఇటీవల ఓ ప్రపంచ రికార్డునూ సృష్టించింది.. ఈ పుస్తకాల పురుగు ఎవరో.. ఆ రికార్డు ఏంటో తెలుసుకుందామా!
కియారా కౌర్‌.. చెన్నై మూలాలున్న ఈ చిట్టితల్లికి ఇంకా అయిదేళ్లు కూడా పూర్తిగా నిండలేదు. కానీ ఫిబ్రవరి 13న కేవలం 106 నిముషాల్లో 36 పుస్తకాలు చదివేసింది. అప్పటికి ఆమె వయసు నాలుగేళ్లే! ఈ ఘనత సాధించినందుకు ప్రస్తుతం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉంటున్న చిన్నారి కియారా ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇన్‌ లండన్‌’, ‘ఏసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం పొందింది.
నర్సరీలోనే..
కియారాకు పుస్తకాలపై ఇంత మోజు ఉందని అబుదాబీలో నర్సరీ చదువుతుండగానే క్లాస్‌టీచర్‌ గుర్తించారు. కరోనా లాక్‌డౌన్‌కు ముందు కియారా స్కూల్‌ లైబ్రరీలో పుస్తకాలు చాలా ఆసక్తిగా చదివేది. ఈ చిన్నారి ఏకాగ్రతకు టీచర్లే ఆశ్చర్యపోయేవారంట.
చదువుతూనే ఉంటుంది..
‘రోజులో గంటలు గంటలు.. మా కియారా చదువుతూనే ఉంటుంది. ఆమె ఇప్పటి వరకు ఓ 200 పుస్తకాలు చదివేసింది. మరో విశేషం ఏంటంటే.. సమయానికి ఆమెకు కొత్త పుస్తకం దొరకకుంటే.. ఇప్పటికే చదివేసిన పుస్తకమైనా సరే.. మరోసారి చదివేస్తుంది’ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ‘కార్‌లో, రెస్ట్‌రూంలో, పడకగదిలో, ఆఖరుకు షాపింగ్‌ చేస్తున్నప్పుడు, నడుస్తూ కూడా మా చిట్టి పుస్తకాలు చదివేస్తుంది’ అని చిన్నారి తల్లి సంతోషంగా చెబుతున్నారు. ‘ఇంత చిన్న వయసులోనే అంత పఠనాసక్తి ఉన్న మా పాపను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది’ అని కియారా తండ్రి గొప్పగా చెబుతున్నారు.

పుస్తకాల్లోనే మజా!
ఇప్పటి పిల్లలు సమయం దొరికితే చాలు స్మార్ట్‌ఫోన్‌కో, టీవీకో అతుక్కుపోతారు. కానీ కియారాకు మాత్రం పుస్తకమే ప్రపంచం. ఇలా ఎందుకని ఇదే విషయాన్ని ఈ చిన్నారినే అడిగితే... ‘నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం. చదువుతుంటే నాకు ఆనందంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీల కన్నా పుస్తకం చదవడంలోనే ఎక్కువ సంతోషం దొరుకుతోంది. నాకు ఆలిస్‌ ఇన్‌ వండర్‌ ల్యాండ్‌, సిండ్రెల్లా, లిటిల్‌ రెడ్‌ రైడింగ్‌ హుడ్‌, షూటింగ్‌ స్టార్‌’ అనే పుస్తకాలంటే మరింత ఇష్టమని చెబుతోంది. ఇంకా తనకు నడక, ఈత అంటే ఆసక్తంట. అన్నట్లు మరో విషయం భవిష్యత్తులో డాక్టరు కావాలని తన కోరికట. మరి చిట్టి కియారా ఆశయం నెరవేరాలని మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు