భళా.. తబలా.. బాల!

నిశీత్‌ గంగని తబలా వాయించడంలో దిట్ట. దిల్లీకి చెందిన ఇతడు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన డ్యాన్స్‌ ఫెస్టివల్‌కు వచ్చి ప్రదర్శనలు ఇచ్చి వెళ్లాడు. చాలామందికి ప్రతిభ వారసత్వంగా వస్తుంది. ఈ అబ్బాయి వాళ్ల పూర్వీకులు

Published : 19 Apr 2021 00:14 IST

నిశీత్‌ గంగని తబలా వాయించడంలో దిట్ట. దిల్లీకి చెందిన ఇతడు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన డ్యాన్స్‌ ఫెస్టివల్‌కు వచ్చి ప్రదర్శనలు ఇచ్చి వెళ్లాడు. చాలామందికి ప్రతిభ వారసత్వంగా వస్తుంది. ఈ అబ్బాయి వాళ్ల పూర్వీకులు కూడా రెండు కళల్లో సుప్రసిద్ధులు. ఒకటి కథక్‌ డ్యాన్స్‌, రెండు తబలా వాయించడం. వాటిలో రెండోది ఎంచుకున్నాడు నిశీత్‌. మరి ఈ అన్నయ్య గురించి మరికొన్ని విశేషాలు క్లుప్తంగా తెలుసుకుందామా..!  
మూడేళ్ల వయసు నుంచే..
ప్రస్తుతం పదిహేడు సంవత్సరాల వయసున్న నితీశ్‌ గంగని తనకు మూడేళ్లున్నప్పటి నుంచే తబలా వాయించడం ప్రారంభించాడు. పండిత్‌ ఫతే సింగ్‌ ఇతని గురువు. నిశీత్‌ వాళ్ల పెదనాన్న కూడా తనకు చాలా మెలకువలు నేర్పేవారు. ఇంత చిన్న వయసులోనే చాలామంది ప్రముఖుల ముందు తన ప్రతిభను చాటాడు. ముఖ్యంగా పండిత్‌ బిర్జు మహరాజ్‌, ఉస్తాద్‌ అంజాద్‌ అలీఖాన్‌ ముందు తబలా వాయించి వాళ్ల ప్రశంసలు అందుకున్నాడు. ‘డమ్‌డమ్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌’, ‘లలిత్‌ అర్పన్‌ ఫెస్టివల్‌’లోనూ చక్కటి ప్రదర్శనలు ఇచ్చాడు.

వర్చువల్‌గా..

ఇటీవల కరోనా ప్రభావం వల్ల తన కళను నేరుగా ప్రేక్షకుల ముందు ప్రదర్శించడానికి అవకాశం రాలేదు. కానీ, వర్చువల్‌ ప్రదర్శనల్లో సత్తా చాటుతున్నాడు. తను ప్రదర్శనకు వెళ్లేటప్పుడు ఎలా తయారవ్వాలో, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో వంటి వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతాడు నిశీత్‌. ఎంతో మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నా.. ఏ మాత్రం గర్వం లేకుండా ఒదిగి ఉండే మనస్తత్వం ఈ అబ్బాయి సొంతం. మరో విషయం ఏంటంటే.. ఓ వైపు చదువుపై దృష్టి పెడుతూ.. మరో వైపు తబలాలో నిత్యం మెలకువలు నేర్చుకుంటూనే.. ఖాళీ సమయాల్లో జిమ్‌లో కసరత్తులు చేస్తుంటాడు. భవిష్యత్తులో తన తల్లిదండ్రులు, గురువులు గర్వపడేలా ఎదగాలనుకోవడమే తన ఆశయమని ఎంతో వినయంగా చెబుతున్నాడు నిశీత్‌ గంగని. నిజంగా ఈ అన్నయ్యలో చాలా మంచి లక్షణాలున్నాయి కదూ.. అన్నీ సాధ్యం కాకపోయినా మనమూ కొన్నింటినైనా ఫాలో అయిపోదామా మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని