చిట్టి చేతులు చేసిన గట్టి మేలు!

మనసుంటే మార్గం ఉంటుంది.. మరి మంచి మనసుంటే.. అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యమవుతుంది.. దీనికి ఈ ఇద్దరే

Published : 02 May 2021 01:27 IST

మనసుంటే మార్గం ఉంటుంది.. మరి మంచి మనసుంటే.. అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యమవుతుంది.. దీనికి ఈ ఇద్దరే నిదర్శనం. మనదేశంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రజలు భయపడిపోతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ఓ ఇద్దరు ముందుకు వచ్చారు. వాళ్లే బెంగళూరుకు చెందిన పదో తరగతి విద్యార్థినులు. నిజానికి వీళ్లు చేసింది కేవలం సాయం కాదు. అంతకు మించి..

స్నేహ రాఘవన్‌, శ్లోకా అశోక్‌ అనే ఇద్దరమ్మాయిలు పదో తరగతి విద్యార్థులు. ప్రస్తుతం కరోనా బారిన పడిన వారిలో కొంతమంది ఆక్సిజన్‌ లేక అల్లాడుతున్నారని తెలిసి వారి మనసులు స్పందించాయి.  ఆక్సీమీటర్లు ఉంటే కాస్త ముందుగానే ప్రమాదాన్ని గుర్తించడానికి వీలవుతుందని తెలుసుకున్నారు. చేయి చేయి కలిపి సాయం చేయడానికి ముందుకొచ్చారు. 24 గంటల్లో రెండు లక్షల పద్నాలుగువేల రూపాయల విరాళాలు పోగు చేశారు. వాటితో 300 ఆక్సీమీటర్లు కొన్నారు. వాటి అవసరమున్న నిరుపేదలకు వితరణగా అందించారు.
ఎలా చేయగలిగారు..
కేవలం ఇరవైనాలుగ్గంటల్లో ఇదంతా చేయడం సాధ్యం కాదు అన్పిస్తోంది. మరి వాళ్లెలా చేశారంటే.. ఇద్దరూ కలిసి విరాళాలు సేకరించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం పోస్టర్లు డిజైన్‌ చేశారు. ఆక్సీమీటర్లు తయారుచేసేవాళ్లను సంప్రదించారు. కొంత మొత్తానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా వాళ్లు ఒక అయిదుగురిని కలిశారు. అయితే ఒకరు స్టాక్‌ లేదన్నారు. మరొకరు చాలా ఎక్కువ రేటు చెప్పారు. అప్పుడు వాళ్లు బాగా ఆలోచించి రెండు లక్షలు పోగు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ దానికంటే రూ.14000 ఎక్కువే పోగయ్యాయి. ఇంకేముందీ.. వచ్చిన డబ్బుతో 300 ఆక్సీమీటర్లను కొనేశారు. అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చాయి. అందువల్లే అన్ని కొనగలిగాం అంటోంది శ్లోకా.
ఇద్దరూ.. ఇద్దరే!
‘మాకు విరాళం అందించి, ప్రోత్సహించిన వాళ్లందరికీ కృతజ్ఞతలు. అడగ్గానే సాయం చేయడానికి ముందుకొచ్చిన దాతల మనసు గొప్పది’ అంది స్నేహ. ‘ఇద్దరూ ఇద్దరే.. ఓ మంచి పని చేశారు. అవసరానికి ఆదుకోవడం గొప్ప విషయం. అందులోనూ ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద మనసు చాటారు. వీళ్లు అమ్మాయిలు కాదు.. అసామాన్యులు!’ అంటూ అందరూ వీళ్ల మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీళ్లను చూసి వాళ్ల స్నేహితులు కూడా సాయం చేయడానికి సిద్ధమవుతున్నారట. ఇదండీ సంగతి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు