యాపిల్‌ మెచ్చిన అభినయ యాప్‌!

ఓ అక్క అద్భుతం చేసింది.. ఒక యాప్‌ను తయారు చేసింది. దాంతో ఏకంగా యాపిల్‌ కంపెనీనే మెప్పించింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది పాల్గొన్న పోటీలో విజేతగా నిలిచింది. మనలాంటి తమ్ముళ్లు, చెల్లెళ్లకు ఆదర్శంగా నిలిచి.. స్ఫూర్తిని రగిలిస్తోంది.

Published : 06 Jun 2021 00:58 IST

ఓ అక్క అద్భుతం చేసింది.. ఒక యాప్‌ను తయారు చేసింది. దాంతో ఏకంగా యాపిల్‌ కంపెనీనే మెప్పించింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది పాల్గొన్న పోటీలో విజేతగా నిలిచింది. మనలాంటి తమ్ముళ్లు, చెల్లెళ్లకు ఆదర్శంగా నిలిచి.. స్ఫూర్తిని రగిలిస్తోంది.
అభినయ దినేష్‌.. ఈ అక్కకు 15 సంవత్సరాలు. ఈమె ఇండో అమెరికన్‌. ఇటీవల యాపిల్‌ నిర్వహించిన
‘‌WWDC‘21 స్విఫ్ట్‌ స్టూడెంట్‌ ఛాలెంజ్‌’ పోటీలో విజేతగా నిలిచింది. ప్రపంచం నలుమూలల నుంచి కొన్ని వేల మంది ఇందులో పాల్గొనగా 350 మంది విజేతలుగా నిలిచారు. అందులో అభినయ కూడా ఒక్కరు. ప్రస్తుతం ఈమె న్యూజెర్సీలో నివసిస్తోంది. ఈ అక్క ‘గ్రాస్టో ఎట్‌ హోమ్‌’ అనే యాప్‌ను తయారు చేసింది. జీర్ణాశయ సమస్యలతో బాధపడేవారికి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ యాప్‌ను రూపొందించింది. కొన్ని ఆరోగ్య సమస్యల గురించి నేరుగా ఇతరులతో చర్చించలేం. ఇలాంటి ఇబ్బందులకు ఇది చక్కని పరిష్కారమంటోంది అభినయ. ఈ యాప్‌ త్వరలో ప్లే స్టోర్‌లోనూ స్థానం పొందనుంది.

ఏఐలో విద్యార్థులకు శిక్షణ..
ఇంతే కాకుండా ‘ఇంపాక్ట్‌ ఏఐ’ అనే లాభాపేక్షలేని సంస్థను కూడా అభినయ నిర్వహిస్తోంది. దీని ఆధ్వర్యంలో ‘గర్ల్స్‌ ఇన్‌ ఏఐ’ అనే ఎనిమిది వారాల హైస్కూల్‌ కార్యక్రమాన్నీ చేపట్టింది. దీని ద్వారా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో విద్యార్థులకు శిక్షణ అందిస్తోంది. ఇంత చిన్న వయసులోనే చక్కని ప్రతిభ కనబరుస్తున్న మన అభినయ అక్క చాలా గ్రేట్‌ కదూ! ఆమె భవిష్యత్తులోనూ మరిన్ని ఘనతలు సాధించాలని మనమూ కోరుకుందామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని