పట్టు పడితే పతకమే!

అదో మారుమూల ప్రాంతం.. అక్కడో పేద కుటుంబం.. చదువుకోవడానికీ చాలినన్ని డబ్బులు లేని స్థితి.. నాన్న ఓ చిన్న రైతు.. అమ్మ సాధారణ గృహిణి.. ఇంకా లెక్కలేనన్ని కష్టాలు..

Updated : 27 Jun 2021 05:31 IST

అదో మారుమూల ప్రాంతం.. అక్కడో పేద కుటుంబం.. చదువుకోవడానికీ చాలినన్ని డబ్బులు లేని స్థితి.. నాన్న ఓ చిన్న రైతు.. అమ్మ సాధారణ గృహిణి.. ఇంకా లెక్కలేనన్ని కష్టాలు.. ఆర్థిక ఇబ్బందులు.. ఇవేమీ ఈ చిన్నారి ప్రతిభకు అడ్డంకి కాలేదు.. ఇన్ని వెతల నుంచీ ఒక విజయగాథ పుట్టుకొచ్చింది

చంచల కుమారి... వయసు 14 సంవత్సరాలు. జార్ఖండ్‌కు చెందిన గిరిజన బాలిక. త్వరలో హంగేరీలో జరగనున్న ప్రపంచ స్థాయి కుస్తీ పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొననుంది. ఈ ఘనత సాధించడం వెనక ఎన్నో కష్టాలు.. మరెన్నో కన్నీళ్లున్నాయి. నిజానికి ఆమెకు ఇంకా చదువుకోవాలని ఉంది. కానీ వాళ్ల కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు. నాన్న నరేంద్రనాథ్‌ పాహాన్‌ ఒక చిన్న రైతు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం సరిపోక ఆయన ప్లంబర్‌గానూ పని చేస్తున్నారు. అయినా కుటుంబ అవసరాలకు సరిపోయేలా సంపాదించలేకపోతున్నారు.

ప్రతిభ చాటి..
అందుకే వాళ్ల నాన్న తన కూతుర్ని జేెఎస్‌ఎస్‌పీఎస్‌ (జార్ఖండ్‌ స్టేట్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ సొసైటీ)లో చేర్పించారు. దీనికి సంబంధించిన ఎంపిక పోటీలు కొంత కాలం క్రితం దిల్లీలో జరిగాయి. తర్వాత కుస్తీ విభాగంలో చంచల ప్రతిభ చాటి ఎంపికైంది. ఈ చిన్నారి ఇప్పటికే పలు జాతీయ స్థాయి పోటీల్లో తన సత్తా చాటింది. 2017లో రజతం, 2018, 2019లలో రెండు స్వర్ణ పతకాలూ తన ఖాతాలో వేసుకుంది.                                           

సాయ్‌ దృష్టిలో పడి..
ఈ విధంగా చంచల పలు అత్యుత్తమ ప్రదర్శనలతో సాయ్‌ (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) దృష్టిలో పడింది. వారి ఆధ్వర్యంలో దాదాపు సంవత్సరం వరకు శిక్షణ పొందింది. హంగేరీలో జులై 19 నుంచి జరగనున్న సబ్‌ జూనియర్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌నకు ఎంపికైంది. ఇలా జార్ఖండ్‌ నుంచి అంతర్జాతీయ కుస్తీ పోటీలకు ఎంపికైన ఏకైక క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

నమ్మలేకపోతున్నా..
‘నా కూతురు తన తోబుట్టువులతో పాటు కలిసి పొలంలో వ్యవసాయం చేయడానికి వచ్చేది. అలాంటి చంచల ఈ రోజు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందంటే నమ్మలేకపోతున్నా. నాకు చాలా గర్వంగా ఉంది’ అని చంచల తల్లి మైనో దేవి సంతోషపడుతోంది. ‘చంచలకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. తను నాతో ఎప్పుడూ..! నాన్నా.. నేను ఏదో ఒక రోజు దేశం తరఫున తప్పకుండా ఆడతాను అని చెప్పేది. కానీ ఇంత తొందరగా సాధిస్తుందనుకోలేదు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది’ అని తండ్రి నరేంద్రనాథ్‌ ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న పోటీల్లో మన చంచల సత్తా చాటి పతకంతో తిరిగి రావాలని కోరుకుందామా..! అయితే ఇంకెందుకాలస్యం ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేయండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని