వింటే సుహైమా పాఠమే వినాలి!

ఆన్‌లైన్‌ పాఠాలు వినడానికే విసుగు చెందుతారు చాలామంది. అలాంటిది ఓ నేస్తం.. తన ఆన్‌లైన్‌ పాఠాలు వింటూనే, ఇటు ఖాళీ సమయంలో యూట్యూబ్‌ ద్వారా ఉచితంగా పాఠాలు చెబుతోంది. ఆ సంగతులన్నీ మీకోసం..

Updated : 04 Jul 2021 00:38 IST

ఆన్‌లైన్‌ పాఠాలు వినడానికే విసుగు చెందుతారు చాలామంది. అలాంటిది ఓ నేస్తం.. తన ఆన్‌లైన్‌ పాఠాలు వింటూనే, ఇటు ఖాళీ సమయంలో యూట్యూబ్‌ ద్వారా ఉచితంగా పాఠాలు చెబుతోంది. ఆ సంగతులన్నీ మీకోసం..

న్నేండేళ్ల సుహైమా బంగారా, ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. అమ్మ రుక్సానా, గృహిణి. నాన్న సలీమ్‌, చిరు వ్యాపారి. వీళ్ల స్వస్థలం కేరళలోని కసర్‌ గోడ్‌. అయితే సుహైమా చిన్నప్పుడే తన కుటుంబమంతా అలీబాగ్‌ వచ్చి స్థిరపడింది.

చదువే లోకం..
సుహైమాకు చదువంటే చాలా ఇష్టం. అంతకన్నా పాఠాలు చెప్పడం అంటే మరీ ఇష్టం. ఆ ఇష్టంతోనే ఊళ్లో పిల్లలను పిలిచి పాఠాలు చెప్పేది. తన చదువును అశ్రద్ధ చేయకుండా మిగిలిన పిల్లలకు ఉచితంగా చదువు చెప్పేది. అంతలో లాక్‌డౌన్‌ వల్ల పిల్లలు పాఠాలు వినడానికి రావడం తగ్గించారు. కానీ తనకు ఎంతో ఇష్టమైన టీచింగ్‌ను వదిలిపెట్టబుద్ది కాలేదు సుహైమాకి. అప్పుడే తనకో ఆలోచన వచ్చింది. యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా పాఠాలు బోధించాలని. వెంటనే తన ఆలోచనను అమ్మానాన్నలతో పంచుకుంది. వాళ్లూ సరేననడంతో తన తోబుట్టువులతో కలిసి ఛానల్‌ను ప్రారంభించింది. ‘ఇంతకీ ఎందుకు ఇలా ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పడం, అందరికీ ఎలాగూ క్లాసులు చెబుతారు కదా!’ అని ఎవరైనా అడిగితే.. ఇదిగో ఇలా చెబుతోంది.

‘చాలామంది పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులను సరిగా వినరు. దాంతో చదువులో వెనకబడుతుంటారు. అదే ఒక స్టూడెంట్‌ పాఠాలు చెబుతుంటే.. ఎలా చెబుతుందోనని గమనించడానికి అయినా సరే వీడియోలు చూస్తారు. దాంతో అనుకోకుండానే వాళ్లకు ఆసక్తి పెరుగుతుంది. దాంతో పాఠాలు శ్రద్దగా వింటారు. దీనివల్ల అటు నాకు ఇష్టమైన టీచింగ్‌ కోరిక నెరవేరుతుంది. ఇటు వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది’ అని సంతోషంగా చెప్పుకొస్తుంది.

తోబుట్టువులు తోడుగా..
ఇక తను పాఠాలు చెబుతుంటే, తన చెల్లెళ్లు స్వియా, రెహానా వీడియో తీస్తారు. అన్నయ్య రజీన్‌ దాన్ని ఎడిట్‌ చేసి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తాడు. అన్నట్టు పాఠశాలలో సెలవు ఇచ్చినట్టుగా శని, ఆదివారాలు వీడియోలు పెట్టదు. ఇలా తమ పిల్లలు చదువుమీద ఇంత శ్రద్ధ చూపుతూ నలుగురికీ విద్యనందిస్తుంటే వాళ్ల అమ్మానాన్న ఆనందానికి అవధులు లేవు. ఎంతయినా ఇలాంటి ఆలోచన రావడమే గ్రేట్‌ కదూ! అయితే ఈ నేస్తాన్ని అభినందించేయండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని