ఎంతెంత దయనీది దియా!

హాయ్‌ నేస్తాలూ! మనందరికీ పెంపుడు కుక్కలన్నా, పిల్లులన్నా భలే ఇష్టం కదూ! కానీ వాటిని మనతో పాటు ఎటైనా బయటకు తీసుకెళ్లినప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా వాటికి నీటిని తాగించాలన్నా, ఆహారాన్ని అందించాలన్నా..

Published : 18 Jul 2021 02:13 IST

హాయ్‌ నేస్తాలూ! మనందరికీ పెంపుడు కుక్కలన్నా, పిల్లులన్నా భలే ఇష్టం కదూ! కానీ వాటిని మనతో పాటు ఎటైనా బయటకు తీసుకెళ్లినప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా వాటికి నీటిని తాగించాలన్నా, ఆహారాన్ని అందించాలన్నా.. చాలా కష్టం. కానీ ఓ అక్కయ్య దీనికో పరిష్కారాన్ని కనిపెట్టింది. వాటి కోసం ప్రత్యేకంగా సీసాలని తయారు చేసింది. కానీ దీని కోసం చాలా కష్టపడింది. చివరికి తాను అనుకున్నది సాధించింది. మరి అదెలాగో తెలుసుకుందామా!

దియా షెత్‌కు 14 సంవత్సరాలు. ప్రస్తుతం ముంబైలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రెండేళ్ల కిందట ఒకరోజు దియా తను పెంచుకునే కుక్క పిల్లతో వాకింగ్‌కు వెళ్లిందట. అప్పుడు ఆ కుక్కపిల్ల నడవలేక నడవలేక ఆయాసపడింది. వెంటనే దానికి నీళ్లసీసాతో కొన్ని నీళ్లు తాగిద్దామని చూసింది. కానీ దానికి తాగడం కుదరలేదు. అన్నీ కిందనే పారబోసింది. ప్రయాణాల్లో కూడా దానికి మంచినీళ్లు తాగించడం చాలా కష్టమయ్యేది. ఇదంతా గమనించిన దియాకు పెంపుడు జంతువుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది.

సర్వే చేసి మరీ..

ముందుగా పెంపుడు జంతువుల్ని పెంచుకునే 120 మందిని ఈ అక్కయ్య సర్వే చేసింది. వాళ్లు తమ పెట్‌ కోసం ఏం చేస్తున్నారని ఆరా తీసింది. అయితే వాళ్లలో 97శాతం మంది తమతో ప్రయాణాలప్పుడు అసలు తీసుకు వెళ్లమని, ఇంట్లోనే ఉంచుతున్నామన్నారు. వాటికి ఆహారం, నీళ్లు  ఇవ్వాలంటే మళ్లీ వేరే సామగ్రి తీసుకు వెళ్లాలి. అదంతా కష్టమని చెప్పుకొచ్చారు. ఈ సమస్యలకు పరిష్కారంగా కొన్ని ఫారెన్‌ బ్రాండ్‌ వస్తువులున్నాయి. కానీ అవి చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవని చెప్పారు. అదంతా విన్న దియాకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అదే... ట్రావెల్‌ ఫ్రెండ్లీ అండ్‌ లీక్‌ ప్రూఫ్‌ వాటర్‌ బాటిల్‌. తానే దాన్ని తయారు చేయాలనుకుంది.

ఆచరణ దిశగా..

అందుకోసం ముందుగా ఒక పేపర్‌ మీద నమూనాను గీసింది. వాళ్ల నాన్న ఇంజినీర్‌ అవడంతో ఆయన సలహా సూచనలను కూడా తీసుకుని సీసా నమూనాలు సిద్ధం చేసింది. అందులో ఒకటి పెద్దగా అయిపోవడం. మరొకటి చిన్నగా అవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇలా రకరకాలుగా మార్చి మార్చి నమూనాలు గీసింది. ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన వాళ్లమ్మ సలహా కూడా తీసుకుని చివరకు రెండు రకాల సీసాల నమూనాలను సిద్ధం చేసింది. వీటి సాయంతో అచ్చం అలాంటి సీసాలనే తయారు చేయించింది. ఇందులో ఒకటి నీటి కోసం. మరోటేమో ఆహారం కోసం అన్నమాట. బాటిల్‌కున్న మూతనే గిన్నెలా ఉపయోగపడేలా ఈ సీసాలను తయారు చేసింది. దీంతో కుక్కపిల్లలకు వాటిలో నీరు తాగడం, ఆహారం తీసుకోవడం తేలికవుతుంది. ఇంత చిన్న వయసులోనే పెంపుడు జంతువుల మీద అంత ప్రేమ ఉండటం ఒక ఎత్తైతే.. వాటి కోసం ఏకంగా ఆవిష్కరణలు చేయడం మరో ఎత్తు. ఏది ఏమైనా మన దియా చాలా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని