నడిచే కాలిక్యులేటర్‌

మనకి ఏదైనా లెక్క ఇచ్చి చేయమంటే పెన్నూ పేపర్‌ పట్టుకుంటాం కదా! కానీ అవేమీ అవసరం లేదంటోంది ఈ నేస్తం. ఎంతపెద్ద లెక్కడిగినా తడుముకోకుండా చెప్పేస్తుంది.

Published : 28 Jul 2021 00:37 IST

మనకి ఏదైనా లెక్క ఇచ్చి చేయమంటే పెన్నూ పేపర్‌ పట్టుకుంటాం కదా! కానీ అవేమీ అవసరం లేదంటోంది ఈ నేస్తం. ఎంతపెద్ద లెక్కడిగినా తడుముకోకుండా చెప్పేస్తుంది. అంతేకాదు లెక్కల్లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు కొట్టి అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ ఎవరీ నేస్తం? పదండి తెలుసుకుందాం..

ఫ్లోరిడాకు చెందిన సనా హిరేమత్‌. వయసు 11 ఏళ్లు. సంగతేంటంటే.. మనలో చాలామందికి లెక్కలంటే భయం కదా.. ఇంతకు ముందు సనాకు కూడా అంతే! లెక్కలు అంటేే ఆమడ దూరం పారిపోయేది. అలాంటి సనా 12 నంబర్లతో గుణకారం ఇస్తే, పెన్నూ, పేపర్‌ వాడకుండా 10 నిమిషాల్లో జవాబు చెప్పేసి, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది.

ఎలా సాధ్యం?

సనాకు రెండేళ్లప్పటినుంచి ఆటిజం సమస్య ఉంది. దాంతో ఈ చిన్నారి రెండో తరగతిలో ఉన్నప్పుడు లెక్కల సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యింది. అప్పుడు అమ్మానాన్న ప్రియా, ఉదయ్‌లు తన సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నారు. తనకు లెక్కలు వచ్చా? రావా? అని పరీక్షించాలనుకున్నారు. అందుకోసం తనకు పెన్సిల్‌, పేపర్‌ ఇచ్చి 1 నుంచి 20 నంబర్లు రాయమన్నారు. కానీ సనాకు ఆటిజం ఉండటంతో పెన్సిల్‌ను పట్టుకోలేక పోయింది. సరే అని నోటితో చిన్న గుణకారం అడిగారు. వెంటనే బదులిచ్చింది. తనకు లెక్కల్లో ప్రతిభ ఉంది కానీ, రాయడం కుదరక తనకు మార్కులు రావట్లేదని తెలుసుకున్నారు. ఇక అప్పట్నుంచి ఇంట్లోనే తనకు పాఠాలు చెప్పారు. అయితే లెక్కల్లో తన ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎలాంటి పెద్ద గుణకారం ఇచ్చినా సరే టక్కున జవాబు చెప్పేసేది. అది తెలుసుకున్న తర్వాత ఆ దిశగా తనతో సాధన చేయించారు. అలా సనా ఈరోజు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని