పల్టీ కొడితే.. రికార్డుల మోతే..!

ఏడేళ్ల బుడత.. చూడ్డానికి చిన్నగానే ఉంటుంది. ఆటలో అడుగుపెట్టిందంటే మాత్రం అలుపు లేకుండా దూసుకుపోతుంది. ఆగకుండా ముందుకు పల్టీలు కొడుతూ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

Updated : 14 Aug 2021 03:11 IST

ఏడేళ్ల బుడత.. చూడ్డానికి చిన్నగానే ఉంటుంది. ఆటలో అడుగుపెట్టిందంటే మాత్రం అలుపు లేకుండా దూసుకుపోతుంది. ఆగకుండా ముందుకు పల్టీలు కొడుతూ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అంతేకాదు తన ప్రతిభతో గిన్నిస్‌ బుక్‌లో తన పేరు ఎక్కించేసుకుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసుకుందాం రండి..

బుడత పేరు దృష్టి జైస్వాల్‌. వయసు ఏడేళ్లు. ఉండేది గుజరాత్‌లో. చిన్నప్పట్నుంచీ చాలా చురుకు. ఖాళీగా ఉన్నప్పుడల్లా సరదాగా ఆడుతూ ముందుకు పల్టీలు కొట్టేది. ఒక్కోసారి ఎక్కువసార్లు ఆగకుండా అలా ఆడేస్తుండేది. అది గమనించిన అమ్మానాన్న తనకు అందులో శిక్షణ ఇప్పిస్తే మరింత మెరుగవుతుంది కదా అనుకున్నారు.

రికార్డు బద్దలు కొట్టింది..

అలా జైస్వాల్‌కు నాలుగేళ్లు వచ్చాక జిమ్నాస్టిక్‌లో చేర్పించి శిక్షణ ఇప్పించారు అమ్మానాన్న. ఇంకేముంది అందులో చక్కటి ప్రావీణ్యం సంపాదించింది. ఎన్నో పోటీల్లో పాల్గొని బహుమతులూ సాధిస్తోంది. ఈ ఏడాది జరిగిన జిమ్మాస్టిక్స్‌ పోటీల్లో పాల్గొని నిమిషంలో 64 పల్టీలు ఆగకుండా కొట్టింది. గతేడాది డిసెంబర్‌లో 13 ఏళ్ల గరీమా పన్సారీ 55 పల్టీలు కొట్టి రికార్డు సాధించింది. ఇప్పుడు జైస్వాల్‌ తన ప్రతిభతో ఆ రికార్డును బద్దలు కొట్టి.. ఔరా అనిపించింది. దాంతో జైస్వాల్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. జైస్వాల్‌ ఇదే కాక డాన్స్‌ షోస్‌లో ప్రదర్శనలిస్తుంది. ఇంకా సర్కస్‌ కూడా నేర్చుకుని, తన విన్యాసాలతో అందరినీ అబ్బుర పరుస్తోంది. ఏడేళ్లకే ఇన్నింటిలో ప్రావీణ్యం అంటే మాటలు కాదు కదా! మరింకెందుకాలస్యం శెభాష్‌ జైస్వాల్‌ అని మీరూ అభినందించండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని