పదేళ్లకే సీఈఓ!

తనీష్‌ మిట్టల్‌.. వయసు పదిహేనేళ్లు.. తనకు పదేళ్ల వయసున్నప్పుడే సొంతంగా ఓ కంపెనీ స్థాపించాడు. దానికి సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. ఇంతకీ ఏంటా కంపెనీ? తనీష్‌ సాధించిన ఘనతలు ఏంటో తెలుసుకుందామా!

Published : 19 Oct 2021 00:27 IST

తనీష్‌ మిట్టల్‌.. వయసు పదిహేనేళ్లు.. తనకు పదేళ్ల వయసున్నప్పుడే సొంతంగా ఓ కంపెనీ స్థాపించాడు. దానికి సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. ఇంతకీ ఏంటా కంపెనీ? తనీష్‌ సాధించిన ఘనతలు ఏంటో తెలుసుకుందామా!

లంధర్‌కు చెందిన తనీష్‌ అయిదేళ్ల క్రితం ఇన్నోవెబ్స్‌ టెక్‌ అనే కంపెనీని స్థాపించాడు. నిజానికి చిన్నప్పటి నుంచే తనీష్‌ దారి వేరు. అప్పటి నుంచే కంప్యూటర్‌ అంటే చాలా ఆసక్తి. వాళ్ల నాన్న నితిన్‌ కంప్యూటర్‌ మీద పని చేసుకుంటుంటే చాలా విషయాలు అడిగి తెలుసుకునేవాడు. అప్పుడే తనీష్‌కు టెక్నాలజీ మీద ఉన్న ఇష్టం వాళ్ల నాన్న నితిన్‌కు తెలిసింది. దీంతో కంప్యూటర్‌కు సంబంధించిన బేసిక్స్‌ గురించి నేర్పించాడు. అప్పుడు తనీష్‌ వయసు కేవలం ఆరేళ్లు. చాలామంది చిన్నారులు బొమ్మలతో ఆడుకునే వయసులోనే మన బుడుగు చేతివేళ్లు కంప్యూటర్‌ కీ బోర్డు మీద కదిలేవి.

సొంతంగా నేర్చుకుంటూ..

ఇలా తనీష్‌ తనకు తొమ్మిదేళ్లు వచ్చేసరికి ఇంర్నెట్‌లో సెర్చ్‌ చేస్తూ.. యానిమేషన్‌, ఆడియో, వీడియో ఎడిటింగ్‌, ఫొటోషాప్‌, వెబ్‌ డిజైనింగ్‌లాంటివన్నీ నేర్చేసుకున్నాడు. వాళ్ల నాన్న అయితే తన కొడుకు ప్రతిభను చూసి ఏకంగా అవాక్కయ్యాడు. తనీష్‌ ఎనిమిదో తరగతిలోనే బడికి గుడ్‌బై చెప్పేశాడు. తన కొడుకు మీద ఉన్న నమ్మకంతో వాళ్ల నాన్న అంగీకారం తెలిపాడు. నాన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తర్వాత సొంతంగా కంపెనీ పెట్టాడు.  

సేవలు అందిస్తూ..

తనీష్‌ ప్రారంభించిన ఇన్నోవెబ్స్‌ టెక్‌ కంపెనీకి ప్రస్తుతం 500 మంది వరకు క్లయింట్లు ఉన్నారు. వీళ్లందరికీ ఈ బుడుగు వెబ్‌ డెవలప్‌మెంట్‌, క్లౌడ్‌ బేస్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, సైబర్‌ సెక్యూరిటీలో సేవలు అందిస్తున్నాడు. ‘యంగెస్ట్‌ ఎంటర్‌ప్రెన్యూయర్‌’, ‘పేజ్‌-3 ఎక్సలెన్స్‌ అవార్డ్‌’లను సొంతం చేసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అన్నట్లు ఈ చిన్నారి, మంచి వక్త కూడా... ఇప్పటికే చాలా కాలేజీలు, స్కూళ్లలో మోటివేషనల్‌ స్పీచ్‌లు కూడా ఇచ్చాడు. మరి మన తనీష్‌ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని మనసారా కోరుకుంటూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని