కూ.. చుక్‌.. చుక్‌... డ్రైవర్‌ లేడోచ్‌!

కూ.. చుక్‌.. చుక్‌... పరుగేమో చకాచక్‌..! అంతా బాగానే ఉంది కానీ.. ఈ రైలు బండిలో అసలు డ్రైవరే లేడోచ్‌! ‘అమ్మో.. డ్రైవర్‌ లేడా.. అయితే ఇంకేమైనా ఉందా?’ అని మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్‌ రైలు. ఇంతకీ ఇది ఎక్కడుందంటే..

Published : 22 Nov 2021 00:28 IST

కూ.. చుక్‌.. చుక్‌... పరుగేమో చకాచక్‌..! అంతా బాగానే ఉంది కానీ.. ఈ రైలు బండిలో అసలు డ్రైవరే లేడోచ్‌! ‘అమ్మో.. డ్రైవర్‌ లేడా.. అయితే ఇంకేమైనా ఉందా?’ అని మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్‌ రైలు. ఇంతకీ ఇది ఎక్కడుందంటే..

ర్మనీలోని హాంబర్గ్‌ నగరంలో ఓ రైలు తెగ పరుగులు పెడుతోంది, అదీ డ్రైవర్‌ లేకుండా..! ప్రస్తుతానికి ఇది ప్రయోగాత్మకంగా నడుస్తోంది. డిసెంబËర్‌ నుంచి మాత్రం ప్రయాణికులకూ సేవలు అందించనుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమేటిక్‌, డ్రైవర్‌ రహిత రైలని అక్కడి అధికారులు చెబుతున్నారు.  

సేవల్లో తగ్గేదేలే...

ఇప్పటికే వాడుకలో ఉన్న పట్టాలమీదే ఈ రైలు పరుగులు పెడుతోంది. పైగా ఇప్పుడున్న రైళ్ల కన్నా సమర్థంగా... తక్కువ శక్తిని వాడుకునే కూ..చుక్‌.. చుక్‌.. అంటూ దూసుకుపోతోంది. ఇలాంటి రైళ్లు మరిన్ని అందుబాటులోకి వస్తే... ప్రయాణికులకు 30 శాతం వరకు మరింత మెరుగైన సేవలు అందుతాయట.

అంతా ఆటోమేటిక్కే!

ఈ రైలును పరుగులు పెట్టించడంలో టెక్నాలజీనే ప్రధాన పాత్ర పోషిస్తోంది. వందకు వందశాతం ఆటోమేటిక్‌గా ఇది పనిచేయనుంది. కానీ రైల్లో ఈ వ్యవస్థను పర్యవేక్షించడానికి ఒక సూపర్‌వైజర్‌ ఉంటారు. ఏమైనా సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే అతని సేవలు అవసరం అవుతాయి. అప్పటి వరకు ఆ ఉద్యోగి ప్రేక్షక పాత్ర పోషిస్తూ.. రైలు ప్రయాణాన్ని చూస్తూ ఉంటాడు.. అంతే!

ఇప్పటికే ఉన్నప్పటికీ..

ప్యారిస్‌లో ఇప్పటికే డ్రైవర్‌ లేని మెట్రో, మరి కొన్ని నగరాల్లో మోనో రైళ్లున్నాయి. అయితే ఇవి సింగిల్‌ ట్రాక్‌ మీదే నడుస్తున్నాయి. అంటే వీటి దారిలో ఇంకేమీ ఇతర రైళ్లు నడవవు. కానీ జర్మనీలో నడవనున్న రైలు, మిగతా సంప్రదాయ రైళ్లతోపాటే పట్టాలను పంచుకోనుంది. మొత్తానికి ఇవీ నేస్తాలూ.. డ్రైవర్‌ లేని రైలు గురించిన సంగతులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని