ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్‌ఐజేకే జుజు!

ఏంటిది ఆంగ్ల అక్షరాలన్నీ ఇలా రాశారు. చివర్లో ఆ జుజు ఏంటి? అనుకుంటున్నారా? అవి అక్షరాలు కాదు ఫ్రెండ్స్‌.. ఓ బుడతడి పేరు. ఏంటీ... నమ్మట్లేదా? అయితే  ఈ కథనం చదవాల్సిందే!

Updated : 21 Dec 2021 06:16 IST


ఏంటిది ఆంగ్ల అక్షరాలన్నీ ఇలా రాశారు. చివర్లో ఆ జుజు ఏంటి? అనుకుంటున్నారా? అవి అక్షరాలు కాదు ఫ్రెండ్స్‌.. ఓ బుడతడి పేరు. ఏంటీ... నమ్మట్లేదా? అయితే  ఈ కథనం చదవాల్సిందే!

సాధారణంగా ఎవరికయినా అక్షరాలతో పేరు పెడతారు. కానీ ఈ పిల్లాడి పేరే అక్షరాలు. వివరాల్లోకి వెళితే ఇండోనేషియాలోని దక్షిణ సుమత్రకు చెందిన ఓ పన్నేండేళ్ల బుడతడి పేరు  ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్‌ఐజేకే జుజు. అక్షరాల తర్వాత రాసిన జుజు అనేది తన ఇంటిపేరు.

మళ్లీ మళ్లీ అడిగారు!

ఈ 12 ఏళ్ల చిన్నారి పేరు ఇప్పటివరకూ ఆ ఊళ్లో ఎవరికీ తెలీదట. ముద్దు పేర్లతో పిలవడం వల్ల తన పేరు గురించి అంతగా చర్చలోకి రాలేదు. అయితే మొన్నీ మధ్య కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని వాళ్ల ఊళ్లో క్యాంపు నిర్వహించారట. అక్కడకు ఈ పిల్లాడు వాళ్ల నాన్నతో కలిసి వెళ్లాడు. వ్యాక్సిన్‌ వేసేముందు అక్కడున్న సిబ్బంది ‘నీ పేరేంటి’ అని అడిగితే ‘ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్‌ఐజేకే జుజు’ అన్నాడట. అక్కడున్న వాళ్లకేమీ అర్థం కాలేదు. మళ్లీ అడిగారు.. మళ్లీ అదే పేరు చెప్పాడు. అంతా అవాక్కయ్యారు!

ఆ బుడ్డోడు జోక్‌ చేస్తున్నాడనుకుని వాళ్ల నాన్నను పిలిచి ‘మీ అబ్బాయి పేరేంటి’ అని అడిగారు. ఆయన కూడా అదే పేరు చెప్పారు. అక్కడున్న సిబ్బంది, వచ్చిన జనం ఆశ్చర్యంగా చూశారు. అయినా వాళ్లు నమ్మకపోవడంతో ఆ పిల్లాడి గుర్తింపు కార్డు చూపించారు వాళ్ల నాన్న. అది చూసిన వారంతా అవాక్కయ్యారు. ‘అయినా విడ్డూరం కాకపోతే ఇలా కూడా పేర్లు పెడతారా?’ అని అక్కడికి వచ్చిన వారంతా ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారట. ఆ తర్వాత అక్కడ సిబ్బంది ఒకరు అక్కడ జరిగిందంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. పేరు ఇలా ఎందుకు పెట్టారో తెలియదుగానీ, ఆ పేరు చూసిన వారంతా ఆశ్చర్యపోతూ ఆ వీడియోని తెగ షేర్‌ చేసుకుంటున్నారు. అలా మనదాకా వచ్చిందన్నమాట. అదీ సంగతి. మరి మీకు తెలియకుండా మీ చుట్టుపక్కల కూడా ఇలా విభిన్నంగా పేరు పెట్టుకున్నవారు ఉన్నారేమో కదా! ఓసారి అడిగి చూడండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని