ఇది మా తప్పు కాదు!

అది నది ప్రవహించే ప్రాంతం. కొండలు, అడవులు, మైదాన ప్రాంతాలకు నెలవు. అక్కడ ఎక్కువ మందికి వ్యవసాయమే ప్రధానం. కష్టానికి తగిన ఫలితం వచ్చినా.. రాకపోయినా నేలతల్లినే నమ్మి బతుకుతున్నారు. అటువంటి శ్రమజీవులకు ఒక ఆపద వచ్చిపడింది. ఏనుగులు గుంపులు గుంపులుగా పొలాల మీద పడి పంటలను పాడు చేస్తున్నాయి. చెరకు తోటల్లో గడలను తిన్నంత తిని మిగతా వాటిని నేలమట్టం చేస్తున్నాయి. దగ్గర్లోని నదిలో చాలా సేపు జలకాలాడి ఆ ఏనుగులెటో వెళ్లిపోతుండేవి.

Published : 10 Mar 2021 00:44 IST

ది నది ప్రవహించే ప్రాంతం. కొండలు, అడవులు, మైదాన ప్రాంతాలకు నెలవు. అక్కడ ఎక్కువ మందికి వ్యవసాయమే ప్రధానం. కష్టానికి తగిన ఫలితం వచ్చినా.. రాకపోయినా నేలతల్లినే నమ్మి బతుకుతున్నారు. అటువంటి శ్రమజీవులకు ఒక ఆపద వచ్చిపడింది. ఏనుగులు గుంపులు గుంపులుగా పొలాల మీద పడి పంటలను పాడు చేస్తున్నాయి. చెరకు తోటల్లో గడలను తిన్నంత తిని మిగతా వాటిని నేలమట్టం చేస్తున్నాయి. దగ్గర్లోని నదిలో చాలా సేపు జలకాలాడి ఆ ఏనుగులెటో వెళ్లిపోతుండేవి.
చేతికి అందబోతున్న పంట నేలమట్టమవుతున్నందుకు రైతులు చాలా బాధపడ్డారు. ఏనుగులు పొరపాటున వచ్చాయని మొదట్లో వాళ్లు అనుకున్నారు. కానీ వాళ్ల ఆలోచన తప్పైంది. రాత్రీ లేదు.. పగలూ లేదు ఏనుగులకు ఊళ్లమీద పడటం అలవాటైంది. అందువల్ల ప్రజలు, రైతులు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. వారు పడిన వేదనంతా ఊరూవాడా తిరిగే చీమలు గమనించాయి. ఒకసారి ఏనుగుల మంద వచ్చినప్పుడు అదే విషయాన్ని నిలదీసి అడిగాయి.
అప్పుడు గజరాజు జోక్యం చేసుకొని ‘మేము కావాలని రాలేదు.. చీమల్లారా! కొన్నాళ్ల కిందటి వరకు మేము అడవులు దాటి బయటకు వచ్చేవారమే కాదు. ఆకులు,  పండ్లూకాయలు తిని సెలయేళ్లలో హాయిగా జలకాలాడుతూ కాలం గడిపేవాళ్లం. ఆహారం, నీటికోసం నిత్యం వెతుకుతూ తిరగడమే మాకిప్పుడు దినచర్య అయింది’ అని నిట్టూర్చింది. గజరాజు మాటలు విన్న ఒక టింగరి చీమ ‘అన్నీ అబద్ధాలే చెబుతున్నావు. అడవిలో చెట్లకు, సెలయేళ్లకు కరవా? నేను నీ మాటలు నమ్మను. తేరగా తినడం అలవాటై ఊళ్లమీద పడుతున్నారు’ అంది.
గజరాజుకు ఒళ్లు మండింది. ఆ చీమ వైపు చూసి ‘మీరంతా కట్టకట్టుకుని ఇలా వరుసలో ఎక్కడకు వెళ్తున్నారు?’ అని అడిగింది. టింగరి చీమ నోటికొచ్చింది చెబుతుందని రాణీచీమ దాన్ని ఆగమని చెప్పి ‘గజరాజా! కష్టపడి మేము కట్టుకున్న పుట్టను పాములు ఆక్రమించాయి. అందుకే మరో పుట్టను కట్టుకోవడానికి బయలుదేరాం’ అంది. గజరాజు రాణీచీమ సమాధానం విని.. ‘మీరు నిత్యం ఎదుర్కొంటున్న పరిస్థితే ఇప్పుడు మాకు ఎదురైంది. మీకు పాములు ఎలాగో మాకు స్వార్థపూరిత మనుషులు అలాగే తయారయ్యారు. ప్రకృతి మాకు అడవులు, సెలయేర్లను ఇచ్చి హాయిగా బతకండని దారి చూపిస్తే మనుషులు అవి మాకు దక్కకుండా చేస్తున్నారు. చెట్లు నరికేస్తున్నారు. వాగులు, వంకలను వాళ్లకు అనుకూలంగా తిప్పుకొంటున్నారు. ఆ అకృత్యాల వల్ల మాకు తిండికీ, నీటికీ కరవొచ్చింది. అందుకే మేం వాటిని వెతుక్కుంటూ జనావాసాల వరకూ వచ్చేస్తున్నాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే క్రూరమృగాలు కూడా ఇక మా దారే పడతాయి. అప్పటికి గానీ మనుషుల ఆగడాలు ఆగవేమో’ ఆవేశంతో అంది. చీమలరాణి గజరాజు ఆవేశాన్ని అర్థం చేసుకుని ‘మీ మాట నిజమే! మా పుట్టలో వేలు పెడితే మేము కుట్టకుండా ఉంటామా? మీరూ అంతే’ అంది. ‘ఔను!’ అని ఆకలితో ఉన్న ఏనుగుల మంద చెరకు తోట వైపు కదిలింది. మనుషులు దూరం నుంచి గోల చేసినా.. ఏనుగులు పట్టించుకోలేదు. అవి చెరకు గడలు తినే పనిలో పడ్డాయి.

- బెలగాం భీమేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని