జ్ఞాపకానికి ఆహారం

మంచి జీవనశైలితో.. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారంతో మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతున్నట్టు చైనా అధ్యయనంలో బయటపడింది.

Updated : 28 Mar 2023 02:41 IST

మంచి జీవనశైలితో.. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారంతో మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతున్నట్టు చైనా అధ్యయనంలో బయటపడింది. అల్జీమర్స్‌, దీంతో ముడిపడిన డిమెన్షియాలకు బలమైన సూచికైన అపోలిపోప్రొటీన్‌ ఇ (అపోఈ) ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలితో జ్ఞాపకశక్తి క్షీణించే వేగం నెమ్మదిస్తుండటం గమనార్హం. సాధారణంగా వయసు మీద పడుతున్నకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతూ వస్తుంటుంది. అయితే వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి మీద ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రభావం గురించి అధ్యయనాల్లో తగినంత సమాచారం లభించటం లేదు. పూర్తిస్థాయి ప్రభావాన్ని అంచనా వేయటానికి దీన్ని మంచి అలవాట్లతోనూ మేళవించి చూడాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే విషయగ్రహణ సామర్థ్యం నార్మల్‌గా ఉన్న 29,000 మంది వివరాలను పరిశోధకులు పరిశీలించారు. సగటు వయసు కనీసం 60 ఏళ్లు గలవారిని ఇందుకు ఎంచుకున్నారు. వీరిని మొత్తం పదేళ్ల పాటు పర్యవేక్షించారు. ఆరోగ్యకరమైన ఆహారం తినటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, చురుకైన సామాజిక సంబంధాలు కలిగుండటం, విషయగ్రహణ సామర్థ్యంతో ముడిపడిన పనులు (రాయటం, చదవటం వంటివి) చేయటం, పొగ తాగకపోవటం, మద్యం అసలే ముట్టుకోకపోవటం ఆధారంగా మంచి జీవనశైలి స్కోరును లెక్కించి అంచనా వేశారు. మంచి ప్రవర్తన, అలవాట్లు గలవారిలో జ్ఞాపకశక్తి తక్కువగా క్షీణిస్తున్నట్టు గుర్తించారు. వీటిల్లో ఆరోగ్యకరమైన ఆహారం అన్నింటికన్నా ముందు వరుసలో నిలిచింది. విషయగ్రహణ సామర్థ్యాన్ని పెంచే పనులు, శారీరక వ్యాయామం తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అపోఈ జన్యువు గలవారిలోనూ- మంచి జీవనశైలిని అసలే పాటించనివారితో పోలిస్తే కనీసం 2-4 మంచి అలవాట్లు పాటించినవారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండటం విశేషం. వీరికి డిమెన్షియా ముప్పు 90%, ఒక మాదిరి విషయగ్రహణ సామర్థ్య లోపం 30% తక్కువగా ఉంటున్నట్టు తేలింది. ఎక్కువ మందిపై, ఎక్కువ రోజుల పాటు చేసిన అధ్యయనం కావటం వల్ల దీని ఫలితాలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి. అల్జీమర్స్‌కు, దీంతో ముడిపడిన మతిమరుపు సమస్యలకు సమర్థ చికిత్సలు అందుబాటులో లేకపోవటం వల్ల నివారణే ముఖ్యమనే సంగతిని గుర్తించాలని పరిశోధకులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని