Updated : 27/11/2020 17:00 IST

మరణంలోనూ.. 8మందికి జీవనం!

నేడు ఇండియన్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ డే

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరణంలోనూ జీవనం! అవయవ దానం ఉద్దేశం ఇదే. ప్రమాదాల మూలంగానో, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలతోనో మృత్యువు అంచుకు చేరుకున్నప్పుడు.. ఇక తిరిగి కోలుకోలేరని, ప్రాణాలతో తిరగాడటం అసాధ్యమని తేలినప్పుడు తాము మరణించినా ఇతరులకు కొత్త జీవితాన్ని ఇవ్వటమంటే మాటలా? అవయవ దానం ఇలాంటి సదవకాశాన్నే కల్పిస్తుంది. మరణించిన తర్వాతా మరొకరి జీవితాన్ని నిలబెడుతుంది!

అవయవదానం అంటే?

రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది తీవ్రంగా గాయపడటం చూస్తూనే ఉంటాం. వీరిలో కొందరు మెదడు బాగా దెబ్బతిని, పూర్తిగా స్పృహ కోల్పోయి, తిరిగి కోలుకోలేని స్థితిలోకీ వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారిలో గుండె, కాలేయం, కిడ్నీల వంటి అవయవాలు పనిచేస్తుంటాయి గానీ వీటన్నింటినీ నడిపించే కీలక అవయవమైన మెదడు మాత్రం పనిచేయదు. వీరినే బ్రెయిన్‌ డెడ్‌ (జీవన్మృతుడు) అంటారు. పక్షవాతం వంటి మెదడు సమస్యల బారినపడ్డవారిలోనూ ఇలాంటి స్థితి తలెత్తొచ్చు. ఈ దశలో ఉన్నవారి అవయవాలను సేకరించి, అవసరమైనవారికి అమర్చటమే అవయవ దానం.

ఒకరి నుంచి 8 మందికి జీవనం

బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, క్లోమం, కంటి కార్నియా, పేగులు.. ఇలా 8 అవయవాలను సేకరించే అవకాశముంది. అంటే ఒక జీవన్మృతుడు 8 మందికి ప్రాణం పోయొచ్చన్నమాట. అంతేకాదు, కండర బంధనాలు, చర్మం, ఎముకల వంటి కణజాలాలనూ దానం చేయొచ్చు. వీటితో 75 మందికి కొత్త జీవితం లభిస్తుంది. సేకరించిన అవయవాలను నిజంగా అవసరమైనవారికి.. అదీ 10, 15 ఏళ్ల పాటు జీవించే అవకాశం గలవారికే అమరుస్తారు.

బ్రెయిన్‌ డెడ్‌ అని ఎలా నిర్ధారిస్తారు?

ఎవరైనా బ్రెయిన్‌ డెడ్‌ అయ్యారని నిర్ధారించటానికి వైద్యపరంగా, చట్టపరంగా కట్టుదిట్టమైన విధానాలున్నాయి. ఏదో ఒక ఆసుపత్రి వైద్యులే దీన్ని నిర్ధారించరు. ఇతర ఆసుపత్రుల వైద్యులు, జీవన్‌దాన్‌ సంస్థ తరఫున వచ్చే నిపుణులు.. అంతా కలిసి బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తిని క్షుణ్నంగా పరిశీలిస్తారు. తిరిగి 6 గంటల తర్వాతా మరో బృందం ఇంకోసారి పరీక్షిస్తుంది. అప్పుడే బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు నిర్ధారిస్తారు. ఇందుకు వైద్యపరంగా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

* తమకు తాముగా శ్వాస తీసుకునే పరిస్థితి లేకపోవటం. కృత్రిమశ్వాసను (వెంటిలేటర్‌) తొలగిస్తే 5 నిమిషాల్లోనే చనిపోయే స్థితిలో ఉండటం.

* కనుపాపల్లో వెలుతురు పడినా ఎలాంటి స్పందనలూ లేకపోవటం.

* కాళ్లు, చేతులు, తల ఏమాత్రం కదపలేకపోవటం.

* ఈఈజీ పరీక్ష చేసినప్పుడు మెదడులో చలనం ఏమాత్రం లేదని స్పష్టం కావటం. మెదడుకు ఏమాత్రం రక్తప్రసరణ జరగటం లేదని నిర్ధారణ కావటం.

* కొన్నిరకాల మందులు ఇచ్చి చూసినా ఎలాంటి స్పందనలు లేకపోవటం.

- ఇలాంటివన్నీ పరీక్షించాక చికిత్స చేసిన డాక్టర్‌తో పాటు వివిధ రకాల విభాగాలకు చెందిన వైద్యులు, బయటి ఆసుపత్రుల వైద్యులు అంతా కలిసి బ్రెయిన్‌ డెడ్‌ అయ్యినట్టు నిర్ధారిస్తారు. ఈ వైద్యులంతా జీవన్‌దాన్‌ సంస్థలో తమ పేర్లను నమోదు చేసుకొని ఉండాలి. అటు చనిపోయినవారికి గానీ ఇటు అవయవాలు అవసరమైనవారికి గానీ బంధువులు అయ్యి ఉండకూడదు. అవయవాలను సేకరించటంలో ఇలాంటి నిబంధనలన్నీ కచ్చితంగా పాటిస్తారు.

అంగీకరించిన తర్వాతే..

బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించిన తర్వాతే అవయవాలను సేకరిస్తారు. వాటిని అవసరమైనవారికి అందజేస్తారు. అవయవ మార్పిడి కోసం నిరీక్షిస్తున్నవారు ముందుగా జీవన్‌దాన్‌ సంస్థలో తమ పేర్లను నమోదు చేసుకొని ఉండాలి. వీరిలో అత్యవసరంగా మార్పిడి ఎవరికి అవసరం? ఎవరికి కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదన్నది విభజిస్తారు. అవయవదాత దొరికినట్టు సమాచారం అందగానే ముందు వచ్చినవారికి ముందు పద్ధతిలో ఆరోగ్యస్థితిని బట్టి అవయవ మార్పిడికి ఏర్పాట్లు చేస్తారు

త్వరగా మార్పిడి చేస్తే మంచి ఫలితం

సేకరించిన అవయవాలను వీలైనంత త్వరగా అమర్చటం ముఖ్యం. ఎంత త్వరగా మార్పిడి చేస్తే అంత మంచి ఫలితం కనిపిస్తుంది. గుండెను బయటకు తీశాక 4 గంటల్లోపు మార్పిడి చేస్తే ఫలితాలు 90% మెరుగ్గా ఉంటాయి. అదే 4-6 గంటల్లో అమర్చితే 50 శాతమే ఫలితం కనిపిస్తుంది. ఇక 6 గంటలు దాటితే మార్పిడికి పనికిరాదు. ఊపిరితిత్తులను 7-8 గంటల్లోపు, కాలేయాన్ని 16-18 గంటల్లోపు, కిడ్నీలను 24 గంటల్లోపు అమర్చాల్సి ఉంటుంది.


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని