కరోనా వేళ సంతానం.. ఆ భయాలు వద్దు!

కరోనా ఎప్పుడెలా ముంచుకొస్తుందో? ఇంకెంత కాలముంటుందో? అందరిలోనూ ఇదే ఆందోళన. ఇలాంటి భయాలను కాస్త తగ్గించుకోండి.

Updated : 09 May 2021 17:24 IST

రోనా ఎప్పుడెలా ముంచుకొస్తుందో? ఇంకెంత కాలముంటుందో? అందరిలోనూ ఇదే ఆందోళన. ఇలాంటి భయాలను కాస్త తగ్గించుకోండి. సంతానం కోసం ప్రయత్నించే పురుషులకు ఇది ఇంకా ముఖ్యం. ఎందుకంటే చాలాకాలం పాటు వెంటాడే ఇలాంటి భయాలు, ఆందోళన మానసిక ఆరోగ్యాన్నే కాదు వీర్యం నాణ్యతనూ దెబ్బతీస్తాయి. దీని ప్రభావం పుట్టబోయే పిల్లల మీదా పడుతుంది. మేరీలాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం ఈ విషయాన్నే నొక్కి చెబుతోంది. మన కణాల వెలుపల ద్రవంతో కూడిన సూక్ష్మమైన తిత్తులుంటాయి. ఇవి కణాల మధ్య ప్రోటీన్లు, కొవ్వులు, న్యూక్లిక్‌ ఆమ్లాల వంటి వాటిని చేరవేస్తుంటాయి. పునరుత్పత్తి వ్యవస్థలో పెద్దఎత్తున ఉత్పత్తి అయ్యే ఇవి వీర్యం నాణత్యలో కీలకపాత్ర పోషిస్తాయి. సంతానం కోసం ప్రయత్నించే మగవారు దీర్ఘకాలం ఒత్తిడికి గురైతే దాని దుష్ఫలితాలు ఈ కణబాహ్య తిత్తుల్లో తలెత్తే మార్పుల గుండా పిండానికి చేరుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇవి పిండం మెదడు ఎదుగుదల మీద విపరీత ప్రభావం చూపుతున్నట్టు కనుగొన్నారు. ఒత్తిడికి గురయ్యాక కనీసం నెల తర్వాత పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలో మార్పులు మొదలవుతుండటం గమనార్హం. అందువల్ల వీలైనంతవరకు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవటం మంచిది. ఆందోళన, భయాలు అదేపనిగా వెంటాడుతుంటే ఆలస్యం చేయకుండా నిపుణుల సలహా తీసుకోవటం మేలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని