Updated : 28 Sep 2021 02:57 IST

World Heart Day: గుండెతో  ఆత్మీయ బంధం!

రేపు వరల్డ్‌ హార్ట్‌ డే

గుండె ఉండేది పిడికెడే. అయితేనేం.. నిలువెత్తు మనిషిని నడిపిస్తుంది. మనం తల్లి కడుపులో ఉన్నప్పట్నుంచే క్షణం ఆగకుండా నిరంతరం రక్తాన్ని పంప్‌ చేస్తూనే ఉంటుంది. అవయవాల నుంచి వచ్చే ‘చెడు’ రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి చేరవేసి, అక్కడ ఆక్సిజన్‌ను నింపుకొని వచ్చిన ‘మంచి’ రక్తాన్ని అవయవాలకు పంపిస్తూ ప్రాణాలను నిలబెడుతుంది. అలుపెరగకుండా మనకోసం ఇంతలా పరిశ్రమించే గుండె కోసం మనమేం చేస్తున్నాం? తేలికగా, సమర్థంగా పనిచేసేలా చూసుకుంటున్నామా? మరింత ఎక్కువకాలం మన్నేలా కాపాడుకుంటున్నామా? లేదనే చెప్పుకోవాలి. రోజురోజుకీ పెరిగిపోతున్న గుండె జబ్బులే దీనికి నిదర్శనం. అందుకే గుండెతో ఆత్మీయ బంధం ఏర్పరచుకోండని నినదిస్తోంది ‘వరల్డ్‌ హార్ట్‌ డే’. గుండెజబ్బులపై అవగాహన పెంచుకొని, నివారణ మీద దృష్టి పెట్టమని అన్యాపదేశంగా సూచిస్తోంది.

గుండెజబ్బులు చాలావరకు హఠాత్తుగా వచ్చేవేమీ కావు. వీటికి పునాది ఎప్పుడో పడి ఉంటుంది. ముప్పు కారకాలను మార్చుకోవటం ద్వారా 80% వరకు గుండెజబ్బులను నివారించుకోవచ్చు. అయినా కూడా మన నిర్లక్ష్యమే మన గుండెల మీదికి తెస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్నవి గుండెజబ్బులే. వీటి మూలంగా ఏటా 1.86 కోట్ల మంది మరణిస్తున్నారు. పొగ అలవాటు, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, ఊబకాయం, గాలి కాలుష్యం వంటివెన్నో ఇందుకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల మంది గుండెజబ్బులతో బాధపడుతున్నారని అంచనా. ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ జబ్బు తలెత్తినా వీలైనంత త్వరగా గుర్తించటం, సత్వరం సరైన చికిత్స అందించటం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. కాబట్టి గుండెజబ్బుల తీరుతెన్నులు.. ప్రాథమిక, తదనంతర నివారణ మార్గాల గురించి తెలుసుకొని ఉండటం మంచిది.


నివారణ కీలకం

గుండెజబ్బు ఎంత తీవ్రమైనదైనా నివారించుకునే మార్గాలు లేకపోలేదు. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, పొగ అలవాటుతో రక్తనాళాల్లో పూడికల ముప్పు పెరుగుతుంది. అందువల్ల ముందు నుంచే నివారణ (ప్రైమరీ ప్రివెన్షన్‌) మీద దృష్టి పెట్టటం ముఖ్యం. మంచి ఆహారం తినటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఒత్తిడిని తగ్గించుకోవటం, పొగ అలవాటుకూ దూరంగా ఉండటం ద్వారా చాలావరకు దీని బారినపడకుండా చూసుకోవచ్చు. అలాగే రక్తపోటు, రక్తంలో గ్లూకోజు అదుపులో ఉంచుకోవటం ముఖ్యం. అవసరమైతే స్టాటిన్స్‌, ఆస్ప్రిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. పదేళ్లలో పూడికలు ఏర్పడే ముప్పు 30% ఉన్నవారికి స్టాటిన్స్‌ ఆరంభించాలన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు. పూడికల ముప్పు 10% ఉన్నా స్టాటిన్స్‌ ఇవ్వటం మంచిదని కొన్నిదేశాల మార్గదర్శకాలు చెబుతున్నాయి.

* సాధారణంగా 40 ఏళ్లు పైబడిన మధుమేహులందరికీ స్టాటిన్లు అవసరమవుతాయి. మధుమేహంతో పాటు అధిక రక్తపోటు, పొగ అలవాటు, కుటుంబంలో ఎవరైనా గుండెజబ్బుల బారినపడటం, అధిక కొలెస్ట్రాల్‌ వంటి ముప్పు కారకాల్లో ఏదో ఒకటి కూడా ఉన్నట్టయితే 40 ఏళ్లు దాటకపోయినా స్టాటిన్స్‌ ఆరంభించాల్సి ఉంటుంది. మధుమేహం లేనివారైతే- 50 ఏళ్లు పైబడి, గుండెజబ్బు ముప్పు కారకాల్లో ఏవైనా రెండు ఉన్నట్టయితే (ఉదాహరణకు- అధిక రక్తపోటుతో పాటు అధిక కొలెస్ట్రాల్‌) స్టాటిన్స్‌ అవసరం.

* గుండెజబ్బు ముప్పు కారకాలు ఎక్కువ గలవారికి స్టాటిన్స్‌తో పాటు ఆస్ప్రిన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికే ఒకసారి గుండెపోటు, పక్షవాతం బారినపడ్డవారికి, స్ట్రెస్‌ టెస్ట్‌ పాజిటివ్‌గా తేలినవారికి జీవితాంతం స్టాటిన్స్‌, ఆస్ప్రిన్‌ అవసరమవుతాయి. ఒకవేళ ఆస్ప్రిన్‌ పడకపోతే రక్తాన్ని పలుచగా చేసే మరోరకం మందులు వేసుకోవాల్సి ఉంటుంది.


జబ్బు మొదలైనా..

ఇప్పటికే ఒకసారి గుండె పోటు వచ్చింది. గుండె కండరం కొంత దెబ్బతింది. లక్షణాలేవీ లేవు. కానీ గుండె పంపింగ్‌ సామర్థ్యం కాస్త మందగించింది. ఇలాంటివారు గుండె వైఫల్యంలోకి జారిపోకుండా చూసుకోవటం ముఖ్యం. ఇందుకు బీటా బ్లాకర్‌, ఏసీఈ ఇన్‌హిబిటార్‌ రకం మందులు ఉపయోగపడతాయి.

* ఒకవేళ గుండె వైఫల్యం మొదలైతే బీటా బ్లాకర్లతో పాటు ఆల్డోస్టెనిన్‌ యాంటగోనిస్ట్‌, ఇవాబ్రాడిన్‌, ఎస్‌జీఎల్‌టీ2 బ్లాకర్ల వంటివి అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి గుండె వైఫల్యం మరింత ముదరకుండా కాపాడతాయి.

* మందులతో ఫలితం కనిపించనివారికి పరికరాలు ఉపయోగపడతాయి. గుండె విఫలమైనవారిలో హఠాత్తుగా గుండె ఆగిపోకుండా చూడటానికి ఐసీడీ ఉపయోగపడుతుంది. గుండె వైఫల్యంతో పాటు విద్యుత్‌ వ్యవస్థలో లోపమూ ఉంటే పేస్‌మేకర్‌ మేలు చేస్తుంది. ఇది పంపింగ్‌ సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. సమస్య మరింత ముదరకుండా కాపాడుతుంది.


ప్రధాన లక్షణం ఆయాసం

గుండె వైఫల్యంలో కనిపించే ప్రధాన లక్షణం ఆయాసం. అందుకే దీన్ని కంజెస్టివ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటారు. ఊపిరితిత్తుల నుంచి గుండెలోకి రక్తం చేరుకునేటప్పుడు కొంత పీడనంతో (ఫిల్లింగ్‌ ప్రెజర్‌) నిండుతుంది. గుండె కండరం బలహీనపడినా, గట్టి పడినా, గుండె చుట్టూ ఉండే పొర గట్టిపడినా ఈ పీడనం మరింత ఎక్కువవుతుంది. దీంతో ఊపిరితిత్తుల్లోని సూక్ష్మ రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగి ద్రవం లీకవుతుంది. ఇలా ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. ఊపిరితిత్తులు వ్యాకోచించటం తగ్గుతుంది. ఇది ఆయాసానికి దారితీస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట ఆయాసం ఎక్కువ. కాళ్లలో చేరిన నీరు పడుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లోకి వస్తుంటుంది. దీంతో ఊపిరి ఆడక, దగ్గుతో లేచి కూర్చుంటారు.

* గుండె కుడి భాగం బలహీనపడితే ఊపిరితిత్తుల వెలుపల భాగాల్లో నీరు చేరుతుంది. దీంతో కాళ్లు, మడమలు వాస్తుంటాయి. ముఖం, కడుపు సైతం ఉబ్బరించొచ్చు.

* గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గటం వల్ల కణజాలాలకు తగినంత రక్తం అందదు. దీంతో త్వరగా అలసిపోవటం, బలహీనత, కండరాలు పట్టేయటం వంటి లక్షణాలు మొదలవుతుంటాయి. మూత్రం ఉత్పత్తీ తగ్గుతుంది. చర్మం పాలిపోతుంది, చల్లగా అనిపిస్తుంది. అదే మెదడుకు రక్త సరఫరా తగ్గితే తికమకపడటం, మగత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక గుండెకు రక్త సరఫరా తగ్గితే పనిచేయటం మానేస్తుంది.


నాలుగు దశలు

గుండె వైఫల్యాన్ని నాలుగు దశలుగా చూడొచ్చు. తొలిదశలో గుండె పనితీరు తగ్గినా లక్షణాలేవీ ఉండవు. ఒకమాదిరి దశలో స్వల్పంగా లక్షణాలు కనిపిస్తుంటాయి. మధ్యస్థ దశలో లక్షణాల తీవ్రత పెరుగుతుంది. రోజువారీ పనులకూ ఆటంకం కలిగిస్తుంటాయి. చివరి దశలో ఆసుపత్రిలో చేర్చి ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మంచి విషయం ఏంటంటే- గుండె వైఫల్యం మొదలైనా మందులతో ముదరకుండా చూసుకోవటం. తొలి దశలో ఉన్నవారిని చివరి దశకు చేరకుండా చూడటమే చికిత్సల ఉద్దేశం. కాకపోతే నిర్లక్ష్యం చేయటం వల్ల కొందరిలో చివరి దశలోనే జబ్బు బయట పడుతుంటుంది.


కృత్రిమ గుండె అండ

చివరిదశ గుండె వైఫల్యంలో కొన్నిసార్లు మందులు, పరికరాలు కూడా పనిచేయవు. ఈ దశలో గుండె మార్పిడి తప్ప మరో మార్గం లేదు. అయితే గుండె దానం చేసే జీవన్మృతులు వెంటనే దొరక్కపోవచ్చు. అన్నిరోజులూ ఆసుపత్రిలో ఉండటం క్షేమం కాకపోవచ్చు. ఇలాంటివారికి తాత్కాలికంగా రక్తాన్ని పంప్‌ చేయటానికి కొన్ని పరికరాలు మేలు చేస్తాయి. మార్పిడికి అవసరమైన గుండె దొరికే వరకూ వీటిని కొనసాగించొచ్చు. అయితే కొందరికి గుండె మార్పిడి చేసే వీలుండకపోవచ్చు. వయసు సహకరించకపోవచ్చు. ఇలాంటివారి కోసం ఇప్పుడు కృత్రిమ గుండె కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనదేశంలో కొన్ని ఆసుపత్రుల్లోనూ దీన్ని అమరుస్తున్నారు. ఇది గుండె నుంచి రక్తాన్ని తీసుకొని బృహద్ధమనిలోకి పంప్‌ చేస్తుంది. మూడో తరం కృత్రిమ గుండె దాదాపు గుండె మార్పిడి మాదిరిగానే పనిచేస్తోంది. గుండె మార్పిడి అనంతరం 65% మంది ఐదేళ్ల వరకూ జీవిస్తున్నారు. అధునాతన కృత్రిమ గుండెతోనూ ఇలాంటి ఫలితమే కనిపిస్తోంది. చాలాదేశాల్లో ఇప్పుడు గుండె మార్పిడి కన్నా వీటినే ఎక్కువగా అమరుస్తున్నారు.


అన్నీ ఒకటి కావు

గుండెపోటు, గుండె ఆగిపోవటం, గుండె వైఫల్యం ఒకటేనని చాలామంది భావిస్తుంటారు. నిజానికివన్నీ వేర్వేరు సమస్యలు. కాకపోతే ఒకదాంతో మరోటి ముడిపడే ఉంటాయి.

* గుండె పోటు: దీనికి మూలం గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం. దీంతో తగినంత రక్తం అందక గుండె కండరం దెబ్బతింటుంది. చాలామందిలో ముందస్తు లక్షణాలేవీ ఉండవు. గుండె కండరం దెబ్బతినటాన్ని బట్టి దీని తీవ్రత ఆధారపడి ఉంటుంది. కండరం బాగా దెబ్బతింటే అప్పటికప్పుడే ప్రాణాల మీదికి వస్తుంది. స్వల్పంగా దెబ్బతింటే క్రమంగా ముదురుతూ వస్తుంది. దుష్ప్రభావాలు దీర్ఘకాలం కొనసాగుతుంటాయి.

* గుండె ఆగిపోవటం (సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌): పరుగెత్తుతున్నప్పుడో, ఏదో వేడుకలోనో ఉన్నట్టుండి కుప్పకూలటం, పడుకున్నవారు పడుకున్నట్టు నిద్రలోనే మరణించటం వంటి వాటికిదే కారణం. ఇందులో గుండె రక్తాన్ని పంప్‌ చేయటం హఠాత్తుగా ఆగిపోతుంది. గుండె కొట్టుకునేలా చేసే విద్యుత్‌ వ్యవస్థ స్తంభించటం, పంపింగ్‌ యంత్రాంగం దెబ్బతినటం దీనికి మూలం. ఇది గుండెపోటుతోనూ సంభవించొచ్చు. గుండెపోటు ఆరంభంలో విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. గుండెపోటు వచ్చాక తొలి గంటలో కుప్పకూలటానికి కారణమిదే. దీన్నే చాలామంది తీవ్ర గుండెపోటుగానూ భావిస్తుంటారు. స్వల్ప గుండెపోటులోనూ దెబ్బతిన్న కండరంలో, మిగతా కండరంలో విద్యుత్‌ వ్యవస్థ పనితీరు భిన్నంగా ఉంటుంది. దీంతో అక్కడ షాక్‌ కొట్టినట్టయ్యి గుండె లయ దెబ్బతిని, పంపింగ్‌ వ్యవస్థ అస్తవ్యవస్తమవుతుంది. చివరికి పనిచేయటమూ మానేస్తుంది. మూడు సెకండ్ల కన్నా ఎక్కువసేపు గుండె కొట్టుకోకుండా ఉంటే కుప్పకూలిపోతారు. పుట్టుకతో తలెత్తే గుండె లయ సమస్యలు, గుండె కండరం మందం కావటం, లాంగ్‌ క్యూటీ సిండ్రోమ్‌ వంటివి కూడా హఠాత్తుగా గుండె ఆగిపోయే సమస్యకు దారితీయొచ్చు.

* గుండె వైఫల్యం: ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న సమస్య. ఇది క్రమంగా ముదురుతూ వస్తుంటుంది. దీనికి మూలం గుండె కణజాలం దెబ్బతినటం. దీంతో కణజాలాలకు అవసరమైనంత రక్తాన్ని పంప్‌ చేయలేక గుండె చేతులెత్తేస్తుంది. బలంగా పనిచేయాల్సి రావటం వల్ల క్రమంగా గుండె పెద్దగా అవుతుంది. గుండె వైఫల్యానికి ప్రధాన కారణం గుండెపోటు. కొన్ని బ్యాక్టీరియా, వైరల్‌, పారాసైటిక్‌ ఇన్‌ఫెక్షన్లు.. సార్‌కాయిడోసిస్‌ వంటి ఆటోఇమ్యూన్‌ జబ్బులు, స్త్రీలలో గర్భధారణ సమయంలో గుండె కండరం మందం కావటం, పుట్టుకతో వచ్చే లోపాల వంటివీ దీనికి కారణం కావొచ్చు. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయటం, దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతుండటం వంటివి దీని ముప్పు పెరిగేలా చేస్తాయి. కొందరిలో ఇదమిత్థమైన కారణాలేవీ లేకపోవచ్చు (ఇడియోపతిక్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌).


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని