Glaucoma: గ్లకోమాను గుర్తించే స్మార్ట్‌లెన్స్‌

నీటికాసుల (గ్లకోమా) సమస్య లోలోపలే చూపును కొల్లగొడుతుంది. అందుకే దీన్ని తొలిదశలోనే గుర్తించి, చికిత్స చేయటం ముఖ్యం. కానీ తొలిదశలో చాలామందికి ఈ సమస్య ఉన్నట్టయినా తెలియదు

Published : 04 Jun 2024 00:19 IST

నీటికాసుల (గ్లకోమా) సమస్య లోలోపలే చూపును కొల్లగొడుతుంది. అందుకే దీన్ని తొలిదశలోనే గుర్తించి, చికిత్స చేయటం ముఖ్యం. కానీ తొలిదశలో చాలామందికి ఈ సమస్య ఉన్నట్టయినా తెలియదు. కంట్లో పెరిగే పీడనం సాయంతో డాక్టర్లు గ్లకోమాను నిర్ధరిస్తుంటారు. కాకపోతే ఉష్ణోగ్రతల వ్యత్యాసాల మూలంగా పీడనాన్ని నిరంతరం పర్యవేక్షించటం కష్టమైన పని. ఇలాంటి ఇబ్బందిని తప్పించటానికి శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ‘స్మార్ట్‌’ కాంటాక్ట్‌ లెన్సును రూపొందించారు. ఇది ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా కంట్లో పీడనాన్ని లెక్కిస్తుంది. మనదేశంలో 1.19 కోట్ల మంది నీటికాసులతో, 89 లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారని అంచనా. ఈ అంధత్వానికి 12.8% వరకూ నీటికాసుల సమస్యే కారణమవుతోంది. మనదేశంలో 40 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గలవారిలో 2.7 నుంచి 4.3 శాతం మంది గ్లకోమాతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. కంటి నిపుణులు టోనోమెట్రీ పరికరం (ఎయిర్‌ పఫ్‌ టెస్ట్‌) ద్వారా కంట్లో పీడనాన్ని గుర్తిస్తారు. ఇది కంట్లో స్వల్పంగా గాలిని ఊదటం ద్వారా పీడనాన్ని లెక్కిస్తుంది. దీన్ని నిరంతరం, మరింత కచ్చితంగా గుర్తించటానికి చైనా పరిశోధకులు రిసెప్టర్‌ గ్లాసెస్‌కు సంకేతాలను పంపించే వినూత్న కాంటాక్ట్‌ లెన్స్‌లను రూపొందించారు. కాంటాక్టు లెన్సుల తయారీకి వాడే పాలీడైమిథైల్‌సైలోక్జేన్‌ పొరల మధ్య చిన్న సర్క్యూట్లను అమర్చటం వీటిల్లోని ప్రత్యేకత. గుండ్రంగా ఉండే ఈ సర్క్యూట్లు ప్రత్యేకమైన పద్ధతిలో కంపిస్తాయి. కంట్లో పీడనం వంటి స్వల్ప మార్పులకూ ప్రతిస్పందిస్తాయి. కంప్యూటర్‌కు అమర్చిన తీగను లెన్స్‌ దగ్గరకు తీసుకొస్తే చాలు. వైర్‌లెస్‌గా కంపనాల తీరును కంప్యూటర్‌కు చేరవేస్తాయి. కళ్లు కదిలినా, తేమ తగిలినా ఇబ్బందేమీ ఉండదు. వీటి ద్వారా అందే సంకేతాలు గ్లకోమాను చాలావరకూ గుర్తిస్తుండటం విశేషం. ఇవి గ్లకోమాను తొలిదశలో.. అదీ వేర్వేరు ఉష్ణోగ్రతల్లోనూ నిర్ధరించటానికి ఉపయోగపడగలవని ఆశిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని