పొత్తికడుపు యాతన!

ఎండోమెట్రియోసిస్‌ ఎందుకు వస్తుందనేది కచ్చితంగా తెలియదు. దీనికి రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అండనాళాల ద్వారా కొంత రుతుస్రావం వెనక్కు వెళ్లి, పొత్తి కడుపులోకి చేరొచ్చు.

Updated : 28 Mar 2023 06:55 IST

ఇది ఎండో మెట్రియోసిస్‌ అవగాహన మాసం

నెల నెలా నొప్పి. నెలసరికి ముందూ, తర్వాతా నొప్పి. సంభోగ సమయంలోనూ వీడదు. మూత్ర, మల విసర్జన చేస్తున్నప్పుడూ అదే బాధ. ముట్లుడిగిన అనంతరమూ తప్పని వేదన. పొత్తికడుపంతా పచ్చిపుండుగా మారినట్టు బతుకంతా నరక యాతన! కొందరు మహిళలను ఎండోమెట్రియోసిస్‌ ఇలాగే వేధిస్తుంది. గర్భసంచిలో పిండం కుదురుకోవటానికి తోడ్పడే పొరే వీరి పాలిట శాపంగా పరిణమిస్తుంది. గర్భసంచిలో ఉండాల్సినది వెలుపలకూ విస్తరించి చిక్కులు తెచ్చి పెడుతుంది. సంతాన భాగ్యానికీ దూరం చేస్తుంది. ఇది ప్రతి 10 మంది మహిళల్లో ఒకరిని బాధిస్తున్నా దీని నిర్ధారణ సగటున ఏడున్నరేళ్లు ఆలస్యమవుతుండటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం అవగాహన లేకపోవటమే. త్వరగా గుర్తిస్తే తాత్కాలికంగానైనా బాధలు, ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందొచ్చు. అందుకే ఎండోమెట్రియోసిస్‌ అవగాహన మాసం సందర్భంగా సమగ్ర కథనం మీకోసం.

స్త్రీపునరుత్పత్తి వ్యవస్థలో ఎండోమెట్రియం అద్భుతమైన నిర్మాణం. గర్భసంచి లోపలి గోడ మీద పొరలా ఏర్పడే ఇది సెలసరి సమయంలోనూ, గర్భధారణ సమయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి నెలా స్త్రీ హార్మోన్లకు స్పందిస్తూ.. గర్భధారణ జరగొచ్చనే అంచనాతో మందంగా పెరుగుతూ వస్తుంది. గర్భం ధరించినట్టయితే పిండం కుదురుకోవటానికి పాన్పులా ఉపయోగ పడుతుంది. ఒకవేళ గర్భధారణ జరగకపోతే విచ్ఛిన్నమై, రుతుస్రావం రూపంలో బయటకు వచ్చేస్తుంది. అనంతరం మళ్లీ పెరగటం ఆరంభిస్తుంది. ఇదంతా నెల నెలా సాగిపోయే సహజ ప్రక్రియ. సాధారణంగా ఎండోమెట్రియం గర్భాశయం లోపలే ఉంటుంది. కానీ కొందరిలో దీని కణజాలం గర్భసంచి వెలుపలా ఉండొచ్చు. పొత్తి కడుపులో, పొట్ట గోడకు ఆనుకునే పెరిటోనియంలో, అండాశయాల మీద, అండనాళాల మీద, గర్భాశయం.. మలద్వారం మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. అరుదుగా ఊపిరితిత్తుల్లోనూ ఉండొచ్చు. దీన్నే ఎండోమైట్రియోసిస్‌ అంటారు. కొందరికి ఎండోమెట్రియం గర్భసంచి గోడల్లోకీ వెళ్లిపోవచ్చు (అడినోమయోసిస్‌). ఇది ఇంకాస్త ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఇందులో నిరంతరం నొప్పి వేధిస్తుంది. దీన్ని భరించలేక చాలామంది గర్భాశయమే వద్దని భావిస్తుంటారు. వీరికి కృత్రిమ గర్భధారణ పద్ధతులతో సంతానం కలగటమూ కష్టమే.


ఎందుకొస్తుంది?

ఎండోమెట్రియోసిస్‌ ఎందుకు వస్తుందనేది కచ్చితంగా తెలియదు. దీనికి రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అండనాళాల ద్వారా కొంత రుతుస్రావం వెనక్కు వెళ్లి, పొత్తి కడుపులోకి చేరొచ్చు. దీనిలోని ఎండోమెట్రియం కణజాలం ఆయా అవయవాలకు అంటుకొని, అక్కడే పెరుగుతుండొచ్చనేది ఒక సిద్ధాంతం. గర్భసంచి ఏర్పడేటప్పుడు అక్కడి పొరల్లో తలెత్తే లోపాలూ దీనికి కారణం కావొచ్చనేది మరో సిద్ధాంతం. రక్త నాళాలు, లింఫ్‌ నాళాల ద్వారా ఎండోమెట్రియం కణాలు ఇతర భాగాలకు విస్తరించటం.. నెలసరి సమయంలో ఎండోమెట్రియం పొర బయటకు వచ్చి చుట్టుపక్కల భాగాలకు అంటుకోవటం.. కొన్నిరకాల సూక్ష్మక్రిముల వంటివీ ఎండోమెట్రియోసిస్‌కు కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ప్రస్తుతం మూలకణాలు ప్రధాన కారణమని గట్టిగా నమ్ముతున్నారు. గర్భాశయం తయారయ్యేటప్పుడు అండనాళాల్లోంచి సీలోమిక్‌ ఎపిథీలియం చొచ్చుకొని పోతుంది. ఇది గర్భసంచి లోపలి పైపొరగా ఏర్పడుతుంది. సిలోమిక్‌ ఎపిథీలియం మూలకణాల్లో కొన్ని వెలుపల ఉండిపోతే ఆ భాగమూ ఎండోమెట్రియమ్‌ పొరలా మారుతుంది. దానిలాగే ప్రవర్తిసుంది. కారణం ఏదైనా, ఎక్కడున్నా ఎండోమెట్రియం నెలనెలా స్త్రీ హార్మోన్లతో ప్రేరేపితమవుతుంది. అక్కడే రక్తస్రావం అవుతుంది. గర్భాశయంలో జరిగే రుతుస్రావం జననాంగం ద్వారా నెలసరి రూపంలో బయటకు వస్తుంది. కానీ వేరే చోట్ల పెరిగే పొర నుంచి వెలువడే రక్తం బయటకు రాలేదు. అక్కడే గూడు కడుతుంది. ఎండోమెట్రియోసిస్‌ బాధలకు కారణమిదే. కొందరికిది వంశపారంపర్యంగానూ.. అంటే తల్లికి ఉంటే పిల్లలకు రావొచ్చు.

లక్షణాలు-ఇబ్బందులు

ఎండోమెట్రియోసిస్‌ ప్రధాన లక్షణం తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి. రక్తానికి అంటుకునే గుణముంటుంది. ఇది గూడు కడుతూ వస్తుంటే చుట్టుపక్కల భాగాలకు అతుక్కుపోతుంది. రక్తం ముద్దగా మారితే పేగులు అతుక్కుపోవచ్చు. మూత్రనాళం లోపలి భాగం అంటుకుపోవచ్చు. గర్భాశయమూ అక్కడక్కడ అతుక్కుపోవచ్చు. అండాశయాల్లో తిత్తులు (సిస్ట్‌) ఏర్పడొచ్చు. ఆయా అవయవాల వద్ద మచ్చ (స్కార్‌) ఏర్పడొచ్చు. రక్తం గూడు కట్టినప్పుడు అక్కడ నాడులు కూడా పుట్టుకొస్తాయి. వీటికి రక్త ప్రసరణ కూడా పుట్టుకొస్తుంది. దీంతో ఎక్కువ రక్తస్రావం అవుతుంది. నాడుల ప్రతిస్పందనతో ఇంకాస్త ఎక్కువ నొప్పి పుడుతుంది.

* నెల నెలా నొప్పి: నెలసరి తొలిరోజున చాలామందిలో ఎంతో కొంత నొప్పి ఉంటుంది. కాసేపయ్యాక తగ్గిపోతుంది. కానీ ఎండోమెట్రియోసిస్‌లో నెలసరికి రెండు, మూడు రోజలు ముందే నొప్పి ఆరంభమవుతుంది. అదీ తీవ్రంగా ఉంటుంది. రుతుస్రావం ఆగిపోయిన తర్వాతా రెండు మూడు రోజులు నొప్పి వేధిస్తుంది. రుతుస్రావమూ ఎక్కువగానే అవ్వచ్చు. నెల మధ్యలోనూ కొద్దిగా రక్తం పడొచ్చు. సమస్య ముదురుతున్నకొద్దీ నొప్పి తీవ్రమవుతూ వస్తుంది. కొందరికి నెలంతా.. నిరంతరం నొప్పి కలగొచ్చు (క్రానిక్‌ పెల్విక్‌ పెయిన్‌). దీంతో జీవితం దుర్భరంగా మారుతుంది. ముఖ్యంగా అడినోమయోసిస్‌ ఉంటే చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది. రుతుస్రావమూ పెద్దమొత్తంలో అవుతుంది. దీన్ని భరించలేక కొందరు ఆత్మహత్యలకూ ప్రయత్నిస్తుంటారు.

* సంభోగంలో నొప్పి: యోని వెనకాల ఎండోమెట్రియోసిస్‌ ఏర్పడితే సంభోగ సమయంలో తీవ్రమైన నొప్పి రావొచ్చు. జననాంగం, మలద్వారం మధ్య రక్తం గూడు కట్టి అంటుకుపోవటంతోనూ సంభోగ సమయంలో నొప్పి కలగొచ్చు. అండాశయాల్లో ఏర్పడిన తిత్తులు కిందికి జారినప్పుడూ సంభోగం చేస్తున్నప్పుడు నొప్పి రావొచ్చు. దీంతో సంభోగం మీద విరక్తి, భయం కలుగుతాయి.

* సంతానం కలగకపోవటం: ఎండోమెట్రియోసిస్‌తో తలెత్తే మరో సమస్య గర్భధారణ జరగకపోవటం. సంతానం కలగనివారిలో 25% మందిలో ఈ సమస్యను చూస్తుంటాం. వీరిలో అండనాళాలు బాగున్నప్పటికీ అండాల నాణ్యత తగ్గుతుంది. గర్భాశయంలో తిత్తులను తీసేసినప్పుడు అండాలూ తగ్గిపోతాయి. మరోవైపు సంభోగంలో పాల్గొనటానికీ ఇబ్బంది పడుతుంటారు. ఇవన్నీ సంతాన రాహిత్యానికి దారితీస్తాయి. వీరికి కృత్రిమ గర్భధారణ పద్ధతులతోనూ పిల్లలు పుట్టే అవకాశం తక్కువగానే ఉంటుంది.

* విసర్జనలో నొప్పి: మూత్రాశయం, మూత్రనాళం సమీపంలో ఎండోమెట్రియోసిస్‌ ఉంటే మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి కలగొచ్చు. గర్భసంచి, మలద్వారం మధ్య రక్తం గూడు కట్టి అంటుకుపోతే మల విసర్జన చేస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పి పుడుతుంది. దీంతో కొందరు బాత్రూమ్‌కు వెళ్లాలంటేనే భయపడి పోతుంటారు కూడా.

* నెలసరి నిలిచినా: రుతుస్రావంతో ముడిపడిన ఎండోమెట్రియోసిస్‌ బాధలు నెలసరి నిలిచాక తగ్గిపోవాలి. కానీ ఆ తర్వాతా కొనసాగుతూ వస్తాయి. కొన్నిసార్లు ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌గానూ పరిణమించొచ్చు. రక్తం గూడు కట్టటం త్వరత్వరగా పెరుగుతుంటే క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది.

చికిత్స ఏమిటి?

గర్భ నిరోధక మాత్రలు: ఎండోమెట్రియోసిస్‌కు చికిత్స నెలసరిని ఆపటం. ఇందుకు గర్భనిరోధక మాత్రలు ఉపయోగపడతాయి. వీటిని క్రమం తప్పకుండా వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అండం విడుదల కాదు, నెలసరి రాదు. ఫలితంగా నొప్పి పుట్టదు. అయితే గర్భనిరోధక మాత్రలను ఆపగానే తిరిగి వెంటనే సమస్య మొదలవుతుంది.

హార్మోన్లు: గొనడోట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్లు (జీఎన్‌ఆర్‌హెచ్‌) కూడా ఉపయోగపడతాయి. వీటిని ఇంజెక్షన్ల రూపంలో తీసుకోవాలి. ఇవి తాత్కాలికంగా నెలసరి నిలిచిపోయేలా (మెనోపాజ్‌) చేస్తాయి. ఫలితంగా ఎండోమెట్రియం బాగా సంకోచిస్తుంది. అయితే వీటితో మెనోపాజ్‌లో మాదిరి వేడి ఆవిర్లు, గుండెదడ, చెమటలు పట్టటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. హార్మోన్లు లోపించటం వల్ల యోని పొడిబారి, సంభోగం కష్టం కావొచ్చు. కొందరికి ఎముకలు బలహీనపడే ప్రమాదముంది. దీన్ని సరిదిద్దటానికి చికిత్స అవసరమవుతుంది.  
ఇప్పుడు సెలెక్టివ్‌ ప్రొజెస్టిరాన్‌ రిసెప్టర్‌ మాడిఫయర్‌ (ఎస్‌పీఆర్‌ఎం) రకానికి చెందిన డైనోజెస్ట్‌ అనే కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. ఇదొక ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌. ఎండోమెట్రియం ఎక్కువగా వృద్ధి కావటానికి తోడ్పడే ఈస్ట్రడియోల్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తిని అణచి వేస్తుంది. ఇలా రుతుస్రావాన్ని ఆపుతుంది. దీంతో నొప్పి తగ్గుముఖం పడుతుంది.  

మిరీనా: అడినోమయోసిస్‌కు మిరీనా అనే చికిత్స అందుబాటులో ఉంది. ఇది కాపర్‌ టీ మాదిరిగా గర్భాశయం లోపల అమర్చే సాధనం. ఇందులో హార్మోన్‌ ఉంటుంది. ఇది కొద్దికొద్దిగా విడుదల అవుతూ గర్భాశయం పొర మీద పనిచేస్తుంది. దీంతో రుతుస్రావం నిలుస్తుంది. ఫలితంగా నొప్పి తగ్గుతుంది. ఐదేళ్ల తర్వాత దీన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. పొట్టలో వేరే చోట ఎండో మెట్రియోసిస్‌ ఉన్నట్టయితే డైనోజెస్ట్‌ మందునూ కొన సాగించాల్సి ఉంటుంది.

ప్రత్యామ్నాయ పద్ధతులు: వీరికి ధ్యానం, యోగా వంటి ప్రత్యామ్నాయ చికిత్సలూ కొంతవరకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్‌ క్లబ్బులూ వెలుస్తున్నాయి. ఒకరితో ఒకరు చర్చించుకొని సమస్యలను, ఇబ్బందులను ఎలా అధిగమిస్తున్నారో తెలుసుకోవటానికి, ఒకరికి ఒకరు తోడుగా ఉండటానికి ఇవి ఉపయోగపడుతున్నాయి.

నిర్ధారణ ఎలా?

ఎండోమెట్రియోసిస్‌ను అల్ట్రాసౌండ్‌, ఎంఆర్‌ఐ పరీక్షలతో గుర్తించొచ్చు. కానీ దీనికి ప్రామాణిక నిర్ధారణ పద్ధతి ల్యాప్రోస్కోపీ విధానమే. పొట్టలోకి కెమెరా గొట్టాన్ని పంపించి, అవయవాలను నేరుగా పరిశీలించి చూస్తేనే కచ్చితంగా నిర్ధారించటం సాధ్యమవుతుంది. ల్యాప్రోస్కోపీతో పరీక్షిస్తున్నప్పుడు అవసరమైతే చికిత్స కూడా చేయటానికి వీలుంటుంది.

సర్జరీ కచ్చితంగా..

రక్తం గూడు కట్టి, పేగుల వంటి అవయవాలు అతుక్కుంటే ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఇందులో ల్యాప్రోస్కోప్‌ ద్వారా చూస్తూ పొత్తి కడుపులో అతుక్కున్న భాగాలను విడగొట్టి, గూడు కట్టిన రక్తాని తొలగిస్తారు. ఆ భాగాన్ని మాడ్చేస్తారు (అబ్లేషన్‌). అయితే సర్జరీని చాలా కచ్చితంగా, స్పష్టంగా చేయాల్సి ఉంటుంది. లేకపోతే మళ్లీ మళ్లీ సర్జరీ చేయాల్సి వస్తుంది. అవయవాలను విడదీసే క్రమంలో రంధ్రాలు పడే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే దీన్ని బాగా నైపుణ్యం గలవారే చేయగలరు. ఇందులో గైనకాలజిస్టు మాత్రమే కాదు, కొలోరెక్టల్‌ సర్జన్‌, యూరాలజిస్ట్‌.. అంతా కలిసి బృందంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రోబోటిక్‌ శస్త్రచికిత్స పద్ధతీ అందుబాటులో ఉంది. సర్జరీ చేసినా వెంటనే మందులు ఆరంభించాల్సి ఉంటుంది. ఎందుకంటే లోపల ఎక్కడైనా ఎండ్రోమెట్రియోసిస్‌ అలాగే ఉండిపోతే మళ్లీ సమస్య తలెత్తొచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే- మందులు, సర్జరీ ఏదైనా గానీ అన్నీ తాత్కాలిక చికిత్సలే. ఎండోమెట్రియోసిస్‌కు శాశ్వత పరిష్కారం లేదు.

* నొప్పిని తట్టుకోలేక చాలామంది గర్భసంచి తొలగించుకోవాలని భావిస్తుంటారు. అయితే ఇది అందరికీ ఉపయోగపడకపోవచ్చు. చిన్నవయసులో అండాశయాలు తొలగిస్తే హార్మోన్లు లోపించొచ్చు. బయటి నుంచి హార్మోన్లు ఇస్తే లోపల ఎక్కడన్నా మిగిలిపోయిన ఎండోమెట్రియం పొర మళ్లీ పెరిగే ప్రమాదముంది. ఇప్పటికే సంతానం కలిగి, మధ్యవయసులో ఉన్న మహిళలకు గర్భసంచిని తొలగించే అవకాశాన్ని పరిశీలించొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు