మలం కథ

అది వ్యర్థమే కావొచ్చు గానీ విలువైన సమాచారాన్ని దాచుకుంటుంది! అవును. మలం మన ఆరోగ్యం గురించి ఎన్నో రహస్యాలను చెబుతుంది. ఆకారం, రంగు, వాసన వంటివన్నీ శరీరంలో జరిగే రకరకాల ప్రక్రియలతో ముడిపడిన సూచనలే.

Updated : 21 Mar 2023 02:52 IST

అది వ్యర్థమే కావొచ్చు గానీ విలువైన సమాచారాన్ని దాచుకుంటుంది! అవును. మలం మన ఆరోగ్యం గురించి ఎన్నో రహస్యాలను చెబుతుంది. ఆకారం, రంగు, వాసన వంటివన్నీ శరీరంలో జరిగే రకరకాల ప్రక్రియలతో ముడిపడిన సూచనలే. గట్టిగా, ముద్దగా రావటం ఒంట్లో నీటిశాతం తగ్గిందనటానికి సంకేతం. ఎర్రగా కనిపిస్తే మలద్వారం నుంచి రక్తం పడుతుందనటానికి గుర్తు. దుర్వాసన వస్తుంటే ఇన్‌ఫెక్షన్‌, ఇతరత్రా సమస్యలు కారణం కావొచ్చు. ఇలా మొత్తమ్మీద మలం బోలెడన్ని విషయాలను తెలియజేస్తుంది. వీటి గురించి తెలుసుకుంటే.. ఏవైనా మార్పులను గమనిస్తే.. సమస్యలు ముదరకముందే జాగ్రత్త పడొచ్చు.  

కాలకృత్యాలు తీర్చేకునేటప్పుడు రోజూ చూస్తూనే ఉన్నా మలం ఆకారాన్ని పెద్దగా పట్టించుకోం. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండొచ్చు. కొందరికి లావుగా రావొచ్చు, కొందరికి సన్నగా రావొచ్చు. గట్టిగా లేదా మృదువుగా ఉండొచ్చు. నీళ్ల మాదిరి పలుచగానూ ఉండొచ్చు. వీటిల్లో ఏది మంచిది? అసలు మలం ఎలా ఉండాలి? దీనికి కొలమానం లేకపోలేదు. బ్రిస్టల్‌ స్టూల్‌ ఛార్ట్‌ ప్రకారం ఆకారం, తీరుతెన్నులను బట్టి మలాన్ని ఏడు రకాలుగా విభజించారు.

- వీటన్నింటినీ పరిశీలిస్తే.. టైప్‌ 1, టైప్‌ 2 రకాలు మలబద్ధకానికి సంకేతం. విసర్జన కష్టం కావొచ్చు, నొప్పి కలగొచ్చు. వీటికి ప్రధాన కారణం నీరు, ద్రవాలు తగినంత తీసుకోకపోవటం. మంచి జీవనశైలి పాటిస్తున్నామని, సరైన ఆహారం తీసుకుంటున్నామనటానికి టైప్‌ 3, టైప్‌ 4 రకాలు చిహ్నాలు. ఆహారంలో పీచు పదార్థం తగినంతగా లేకపోతే మలం ఒకచోటుకి చేరదు. తేలికగా విసర్జన కాదు. దీనికి టైప్‌ 5 రకం ఉదాహరణ. తరచూ ఇలాగే విసర్జన అవుతుంటే పేగుల్లో ఏదో సమస్య ఉందనీ అర్థం. ఇక టైప్‌ 6, టైప్‌ 7 రకాలు విరేచనాలకు గుర్తులు. కలుషిత ఆహారం, జీర్ణ కోశ సమస్యలు వీటికి మూలం. ఒత్తిడితోనూ ఇలాగే విసర్జన కావొచ్చు. తరచూ విరేచనాలు వేధిస్తుంటే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.

రంగు మాటేమిటి?

జీర్ణకోశ వ్యవస్థలో రకరకాల అంశాలన్నీ మలం రంగును నిర్దేశిస్తాయి. కొవ్వును విడగొట్టే పైత్యరసం పేగుల ద్వారా మలంలోంచి బయటకు రావొచ్చు. ఎర్ర రక్తకణాల జీవనకాలం ముగిశాక పుట్టుకొచ్చే బిల్‌రుబిన్‌ వ్యర్థంగా మారొచ్చు. తిన్న ఆహారం జీర్ణమయ్యాక మిగిలినదీ మలంగా ఏర్పడుతుంది. మొత్తమ్మీద తిన్న ఆహారం.. పండ్లు, కూరగాయల వంటివన్నీ రంగును నిర్దేశిస్తాయి. ఆహారంతో ముడిపడిన రంగు రెండు, మూడు రోజుల తర్వాత మారిపోతుంది. ఒకవేళ ఇతర రంగులు కనిపిస్తున్నట్టయితే ఏదైనా సమస్య ఉండొచ్చని అనుమానించాలి. ఉదాహరణకు- బ్యాక్టీరియా, వైరల్‌, పరాన్నజీవి ఇన్‌ఫెక్షన్లు.. ఇన్‌ఫ్లమేటర్‌ బవెల్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలతో మలం ఆకుపచ్చ రంగులో రావొచ్చు. కొత్తగా మందులు వేసుకుంటున్నా ఇలా కనిపించొచ్చు. మొలలు, మలద్వారం వద్ద చీలికలు, పేగుపూత, జీర్ణకోశంలో పుండ్ల వంటి సమస్యల్లో మలం ఎర్రగా ఉండొచ్చు. మలద్వార క్యాన్సర్‌లోనూ ఇలాగే ఉండొచ్చు. జీర్ణాశయం వంటి పైభాగంలో ఏర్పడిన పుండ్ల కారణంగా మలం నల్లగా పడొచ్చు. ఐరన్‌ మాత్రలు వేసుకుంటున్నా నల్లగా కనిపించొచ్చు. ఇక పసుపు పచ్చగా వస్తున్నట్టయితే కాలేయం, పిత్తాశయం, పాంక్రియాస్‌ సమస్యలు కారణం కావొచ్చు. కాబట్టి నాలుగైదు రోజుల కన్నా ఎక్కువగా మలం రంగు భిన్నంగా వస్తున్నట్టయితే జాగ్రత్త తప్పనిసరి.

దుర్వాసన మామూలే గానీ..

మలం దుర్వాసనతో ఉండటం మామూలే. కానీ మరీ అతిగా దుర్వాసన వస్తుంటే కాస్త జాగ్రత్త అవసరం. పేగుల్లో మనకు అవసరం లేని బ్యాక్టీరియా తిష్ఠ వేసుకోవటం, జీర్ణకోశ వ్యవస్థలో సమస్యల వంటివి అతి దుర్వాసనకు కారణం కావొచ్చు. ఇది చాలాసార్లు విరేచనాలతోనూ ముడిపడి ఉంటుంది. ఆహారంతో ముడిపడిన వాసనైతే త్వరగానే తగ్గిపోతుంది. ఒకవేళ విడవకుండా అదేపనిగా ఎక్కువ దుర్వాసన వస్తుంటే ఏవైనా సమస్యలు కారణమవుతున్నాయేమో చూసుకోవటం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు