Updated : 08 Dec 2022 21:14 IST

ఆయుర్వేదం నీడలో...

వేసవికి అందరం మానసికంగా.. మెల్లమెల్లగా సిద్ధమవుతున్నాం. ఆటవిడుపు సెలవులే కాదు.. మండుటెండలు, వడగాడ్పులు, ఉష్ణతాపాలు మన కోసం కాసుకుని ఉన్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఎండలకు తాళలేక, వేడికి తట్టుకోలేక ఆరోగ్యం దెబ్బతినటం తథ్యం. ఆరోగ్యపరిరక్షణే ధ్యేయంగా ఆవిర్భవించిన సనాతన ఆయుర్వేదం.. గ్రీష్మాన్ని అధిగమించేదెలాగో విస్పష్టంగా వివరించింది. ఈ వేసవిలో ఆయుర్వేదం పంచన సేదదీరేందుకు సవివరంగా మీ ముందుకు...ఆరు రుతువులు.. రెండు అయనాలు!

మనకు ఏడాదికి రెండు అయనాలు. ఉత్తరాయణం.. దక్షిణాయనం! వీటిలో వర్ష, శరత్‌, హేమంత రుతువులతో ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుండే దక్షిణాయనాన్ని విసర్గకాలం అంటారు. ఈ కాలంలో మన శరీరం బాగా బలం పుంజుకుంటూ ధాతుపుష్టితో అలరారుతుంటుంది. ఇక ఉత్తరాయణాన్ని ‘ఆగ్నేయం’, ‘ఆదానకాలం’ అంటారు. ఇది చాలా వేడిగా ఉండే కాలం. ఆయుర్వేద దృక్పధం ప్రకారం ఈ ఆదాన కాలంలో మన శరీరం నుంచి బలం బయటకు వెళ్లిపోతుంటుంది. శరీరం కొంత ధాతు క్షీణతకు, బలహీనతకు గురవుతుంటుంది. అందుకే శిశిర, వసంత, గ్రీష్మరుతువుల్లో మన శరీరానికి మంచి పోషణ, రక్షణ చాలా అసవరం.

గ్రీష్మం
ఆదానకాలమైన గ్రీష్మరుతువులో ప్రకృతిసహజంగానే ఒంట్లోంచి బలం బయటకు పోతుంటుంది కాబట్టి మనం బలవర్ధనానికి, ఆరోగ్యపరిరక్షణకు తప్పనిసరిగా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. తీక్షణ ఉష్ణం కారణంగా వాయువు భూమి నుంచి సౌమ్యగుణాన్ని తీసుకుని వాతావరణాన్ని వేడిగా తయారుచేస్తుంది. ఈ ఎండ వేడిమికి శరీరంలో కఫం ప్రకోపించి ‘జఠరాగ్ని’ మందగిస్తుంది. ఇదే ప్రధానమైన సమస్య. దీనివల్ల ఆకలి తగ్గిపోయి అగ్నిమాంద్యం తలెత్తుతుంది. అందుకే మనకు వేసవిలో విపరీతమైన దాహం ఉంటుందిగానీ ఆకలి తక్కువ. ఈ అగ్నిమాంద్యమే శరీరంలో అన్ని వ్యాధులకూ మూలమని ఆయుర్వేదం విస్పష్టంగా వివరిస్తోంది. ‘హత్వా అగ్నిం కురుతే సర్వాన్‌ రోగాన్‌’ అంటూనే దాన్ని సత్వరమే జయించటం అవసరం, ‘హతః తం త్వరః జయేత్‌’ అని హెచ్చరిస్తోంది కూడా. ఎండ వేడిమితో ఒంట్లో ఓజస్సు కూడా తగ్గుతుంది కాబట్టి ముందు నుంచే వ్యాధులు దరిజేరకుండా జాగ్రత్తలు తీసుకోవటం, మన ఆహారవిహారాల్లో తగు మార్పులు చేసుకోవటం అవసరమని గుర్తించాలి.

  ఏమిటి ఆహారం? : వేసవికాలంలో తీసుకోవాల్సిన ఆహారానికి... ‘లఘు, స్నిగ్ధ, మధుర, హిమ, ద్రవ’ స్వభావం ఉండాలన్నది ఆయుర్వేద సూత్రం. అంటే మనం తిన్నది మందంగా కాకుండా తేలికగా అరిగేలా (లఘు) ఉండాలి. కొద్దిగా జిడ్డుగా (స్నిగ్ధం) ఉండాలి. బడలిక లేకుండా సత్తువ నిచ్చేందుకు తీపి (మధురం) పదార్ధాలైతే మంచిది. బయటి వేడికి విరుగుడుగా చల్లటి (హిమం) పదార్ధాలు ఉపశమనాన్నిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా వేడికి ఒంట్లో ద్రవనష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ద్రవ పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇదీ ప్రాథమిక సూత్రం!

వేసవిలో సహజంగానే ఆకలి తక్కువ, అగ్నిమాంద్యం ఉంటుంది కాబట్టి మనం బరువుగా ఉండే (గురు) ఆహారం తీసుకుని, అగ్నిమాంద్యాన్ని మరింత పెంచకుండా ఉండటం చాలా అవసరం. తేలికగా జీర్ణమయ్యే పదార్ధాలు తీసుకోవటం మంచిది. అలాగే జిడ్డుగా ఉండే ఆహారం అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది.. దీంతో జఠరాగ్ని, ఆకలి పెరుగుతుంది.

ఏది ఉత్తమం?
*కొద్దిగా జిడ్డు, తీపి, తేలికగా జీర్ణమవ్వటం వంటి లక్షణాలన్నీ చక్కగా ఉండేది గేదెపాలలో! ఈ కాలంలో అగ్నిమాంద్యాన్ని జయించేందుకు పంచదార వేసుకున్న గేదెపాలు చక్కటి ఆహారం, ఔషధం!
*రెండోది పానకం. ఈ పానకం ఎలా ఉండాలన్నదానికీ సూత్రం ఉంది. ‘పంచసారాఖ్యం పానకం’. ఈ పంచసారాలు ఏమేమంటే- 1. నెయ్యి. 2. పిప్పలి 3. పచ్చకర్పూరం 4. తేనె 5. చక్కెర. ఈ ఐదూ కలిసిన పానకం వేసవికి అమృత ప్రాయమని చెప్పుకోవచ్చు. వేసవిలో తలెత్తే నీరసం, బడలిక వంటివన్నీ తగ్గిపోతాయి. ఇది శరీరంలో మంట, దప్పికలను తీర్చే ‘దాహ నివర్తకం’గా కూడా అక్కరకొస్తుంది.
*పానకం: నీరు, పంచదార, యాలకులు, లవంగం, పచ్చకర్పూరం, మిరియాలు.. ఇవన్నీ కలిపిన ‘శర్కరోదకం’ ఎండాకాలంలో తాగితే చలవ చేస్తుంది, ఒంటికి బలం పడుతుంది. బయటకు పోయే బలం ఎప్పటికప్పుడు పూడుతుంటుంది.
*నవమిపానకం: నడివేసవిలో వచ్చే శ్రీరామనవమికి సంప్రదాయంగా బెల్లం పానకం పంచిపెడుతుండటం వెనక ఉద్దేశం కూడా ఇదే. నీరు, బెల్లం, మిరియాలు, యాలకులతో చేసే ఈ పానకం శరీరంలో ఆకలి పుట్టిస్తుంది, అగ్నిదీపనంతో పాటే చలవ చేస్తుంది. ముఖ్యంగా దాహాన్ని తగ్గిస్తుంది.
*ధాన్యకం: గ్రీష్మరుతువులో ఒక చిన్నకుండలో రాత్రంతా ధనియాలు నానబెట్టి.. ఉదయాన్నే ధనియాలు తీసేసిన ఆ నీటిలో చక్కెర, పచ్చకర్పూరం వేసుకుని తాగితే చక్కటి మేలు జరుగుతుందని చెబుతోంది ఆయుర్వేదం.

మరి తినకూడనివి?
ఎండలు మెండుగా ఉండే వేసవిలో ఉప్పు, కారం, పులుపు ఎక్కువగా తీసుకోకూడదు. గ్రీష్మరుతువులో అతిగా, అధికంగా వ్యాయామం చెయ్యకూడదు. ఎందుకంటే ‘శరీరం ఆయాసజనం వ్యాయామం’ అంటారు. మన శరీరానికి శ్రమనిచ్చే వ్యాయామంతో చెమట ఎక్కువగా పడుతుంది. చెమట రూపంలో నీరు మరీ ఎక్కువగా బయటకు పోయినప్పుడు.. శుష్కత్వం, నీరసం వస్తాయి. కాబట్టి అతిగా వ్యాయామం చెయ్యకూడదు.

*‘మద్యం నపేయం’ అంటూ ఎండాకాలంలో మద్యాన్ని కచ్చితంగా నిషేధిస్తోంది ఆయుర్వేదం. మద్యం వల్ల శరీంలో అంగ శైధిల్యం వచ్చి.. పటుత్వం తగ్గుతుంది. ఒళ్లంతా మంట (సర్వాంగతాపం) వస్తుంది. ముఖ్యంగా మోహం, అంటే కళ్లు చీకట్లు కమ్ముతాయి. గ్రీష్మరుతువులో మద్యం ఎక్కువగా తీసుకుంటే ఇన్ని సమస్యలు. కాబట్టి మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గుర్తించాలి.

విహారం
ఆయుర్వేదంలో ఆహారానికి ఎంత ప్రాముఖ్యం ఉందో మన అలవాట్లు, జీవన శైలి, జీవన విధానానికి కూడా అంతే ప్రాధాన్యం. అందుకే వేసవిలో మనం ఎలాంటి దుస్తులు ధరించాలి, ఇంటిని ఎలా తీర్చిదిద్దుకోవాలన్నది కూడా సుస్పష్టం.

*సువాసన, శుగంధ ద్రవ్యాలతో కూడిన పల్చటి దుస్తులు ధరించటం వేసవి తాపానికి పెద్ద విరుగుడు. దీనికోసం మనం ఓ బకెట్‌ నీటిలో వట్టివేళ్లు, చందనం వేసి కొంత సమయం నానిన తర్వాత దాంట్లో తెల్లటి బట్టలను జాడించి ధరిస్తే రోజంతా ఉల్లాసంగా మంచి సుగంధం పరిమళిస్తుంటుంది. అలాగే ఈ కాలంలో విరివిగా పూచే మల్లె మాలల ధారణం కూడా ఆహ్లాదాన్నిస్తుంది.

*ధారాగృహాల్లో ఉండటం మంచిది. అంటే కిటీలకు లతలు, తీగలు, పువ్వుల వంటివి పాకించి.. వాటిని తరచూ నీటితో తడుపుతుంటే ఇంటి లోపలికి వేడిమి ప్రభావం ఉండదు. ఒకరకంగా నేటి ‘ఎయిర్‌ కండిషనర్ల’కు దీన్ని సహజసిద్ధమైన ప్రత్యామ్నాయంగా భావించవచ్చు.

*వీటన్నింటినీ మించి... ‘అర్కపరాం చరేత్‌’ అన్న హెచ్చరిక స్పష్టంగా ఉంది. కాబట్టి అంకుశంలా గుచ్చుతుండే తీక్షణమైన సూర్యకాంతికి సాధ్యమైనంత దూరంగా ఉండాలన్న సూత్రం మరువరాదు!

ఏం తాగాలి?
వేసవిలో కొన్నికొన్ని పానీయాలు, సేవనాలకు ప్రాముఖ్యం ఇస్తూనే తగుజాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవి: మజ్జిగ (తక్రం), పాలు (క్షీరం), నెయ్యి (ఘృతం), కొబ్బరినీళ్లు (నారికేళొదకం) చెరుకురసం (ఇక్షురసం) పెరుగు (దధి). వీటి గురించి వివరంగా చూద్దాం.

*మజ్జిగ: ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పెరుగులో సగం లేదా నాలుగోవంతు నీరు కలిపి చిలికితే వచ్చే చిక్కటి మజ్జిగను తక్రం అంటారు. వేసవిలో దీన్ని తీసుకోవటం మంచిదేగానీ ఇది తగుమాత్రంగానే ఉండాలి. ఎండ తాపాన్ని తట్టుకుంటామన్న భావనతో మజ్జిగ అతిగా తాగటం మంచిది కాదు.
*పాలు: కొద్దిగా జిడ్డుగా, తీపిగా, జీవనీయంగా, రసాయనంగా కూడా పనికొస్తుంది కాబట్టి గ్రీష్మానికి పంచదార వేసిన పాలు పరమ శ్రేష్ఠం.
*నెయ్యి: గేదె పాల నుంచి తీసిన నెయ్యి చలవ చేస్తుంది, మధురంగా కూడా ఉంటుంది. దీన్ని వేసవిలో తగుమాత్రంగా తీసుకోవటం మంచిది.
*కొబ్బరినీళ్లు: దీనిలో జిడ్డు, తీపి ఉంటాయి. దీనికి బలాన్నిచ్చే రుష్య, చలవ చేసే శీత లక్షణాలూ ఉన్నాయి. తేలికగా జీర్ణమవుతుంది. దప్పిక తీరుస్తుంది. పిత్తం వేడిని తగ్గిస్తుంది. జఠరాగ్నిని పెంచుతుంది. ఇన్ని సుగుణాలు ఉంటాయి కాబట్టే వేసవికి కొబ్బరినీళ్లు పరమ శ్రేష్ఠమని గుర్తించాలి.
*చెరుకురసం: ఎండాకాలానికి ఇది చాలా మంచిది. అయితే యంత్రంతో నుంచి తీసిన రసం (యంత్రనిష్పీడితం) కంటే కూడా చెరుకు ముక్కల్ని చక్కగా నములుతూ ఆ రసం (దంతనిష్పీడితం) మింగటం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. యంత్రంతో తీసిన రసం దాహాన్ని పెంచుతుంది. నమిలి మింగే రసం దాహార్తిని తీర్చటమే కాదు, ఆకలిని కూడా పెంచుతుంది.
*పెరుగు: ఎండాకాలంలో పెరుగు త్వరగా పులుపెక్కుతుంది. పుల్లటి పెరుగు మంచిది కాదన్నది ఆయుర్వేద భావన. కాబట్టి ఈ కాలంలో తాజా, తీపి పెరుగు తినటం ఉత్తమం.

వేసవి వ్యాధులు
సాధారణంగా వేసవిలో చాలా ఎక్కువగా చూసే 4 సమస్యలు
కామల, విరేచనాలు, వడదెబ్బ, చెమటకాయలు.
*కామల అనేది చాలావరకూ తీవ్రమైన కామెర్ల సంబంధిత వ్యాధి అనుకోవచ్చు. ‘కామం లాతీతి కామలా’ అన్నది సూత్రం. అంటే ఆకలి, దప్పిక వంటి జీవసంబంధ కోరికలన్నింటినీ చంపేసే తీవ్ర సమస్య ఇది. రక్తహీనత(పాండు)తో ఆరంభమై వచ్చే సమస్యను నివారించుకునేందుకు ముందు నుంచీ చక్కటి జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. కామలకు కలబంద, నేల ఉసిరి మంచి విరుగుడు. నేలఉసిరిని బాగా నలగ్గొట్టి ఉండగా చేసి తీసుకుంటే మంచిది. అలాగే తిప్పతీగ ఆకులను మజ్జిగలో కలుపుకొని తాగాలి.
*విరేచనాలు: ఆహారంలో వచ్చే మార్పులు, కలుషిత నీరు వంటివి దీనికి మూలం. మలంతో పాటు నీరు ఎక్కువగా పోతుండటం వల్ల ఒంట్లో ద్రవహీనత వస్తుంది. గ్రీష్మతాపంతో ఒంట్లో సహజంగానే జల ధాతువు నశిస్తుంది కాబట్టి దీనికి తక్షణ చికిత్స చాలా అవసరం. వేగంగానీరుపోతుండే ఈ విరేచనాలను తక్షణం అడ్డుకునేందుకు ఆయుర్వేదంలో ఒక విశిష్టమైన పద్ధతి చెప్పారు.
ఉసిరి కాయలను బాగా దంచి గుజ్జుగా చెయ్యాలి. ఆ గుజ్జుతో బొడ్డు చుట్టూ గుండ్రటి కట్ట కట్టాలి. అందులో అరంగుళం లోతులో అల్లపురసం పోసి కొంతసేపు ఉంచితే.. ఎంతవేగంగా ఉన్న అతిసారమైనా నిమిషాల్లో తగ్గుతుందని శాస్త్రం. దీనికి తోడు నోటి ద్వారా ద్రవాలు, నీరు ఇస్తూనే ఉండాలి. అలాగే భృంగరాజం (గుంటగలగరాకు) ఉండచేసి ఉదయం, సాయంత్రం తీసుకుంటే విరేచనాలు కడతాయి.
*వడదెబ్బ: మంచి గంధం చెక్కను సాన మీద అరగదీసి రోజూ నీటితో కలిపి ఒక చెంచా లోపలికి తీసుకుంటే వడదెబ్బ తగలదు. ఎండలోకి వెళ్లే ముందే దీన్ని తీసుకుంటే వడదెబ్బను చాలా వరకూ నివారించుకోవచ్చు.
*చెమటకాయలు: శుభ్రత పాటించటం ముఖ్యం. పటిక ముక్కను పెనం మీద కొద్దిగా వేయించి.. అర చిటికెడు పొడి గ్లాసు నీటిలో కలుపుకుని తాగితే చెమటకాయలు రావు. చెమటకాయలు రాకుండా ఒంటికి మంచిగంధం రాసుకోవచ్చుగానీ దాన్ని నీటిలో కంటే కొబ్బరినూనెలో కలిపి రాసుకోవటం మంచిది. వేసవిలో శరీర దుర్గంధాన్ని పోగొట్టుకోవటానికి కూడా చందనం బాగా పని చేస్తుంది.

కూరలు
*కర్వేపాకు (కాలశాకం): ఇది చలవ చేస్తుంది, పిత్తాన్ని హరిస్తుంది. మెదడుకు బలాన్నిస్తుంది కాబట్టి ఈ కాలంలో కర్వేపాకు తప్పనిసరిగా తినాలి.
*క్యాబేజీ (కలంబి): ఇది మధురంగా ఉంటుంది. వేసవికాలానికి చాలా మంచిది. ముఖ్యంగా వేసవిలో ప్రసవించిన తల్లులకు పాలు తక్కువగా ఉంటే క్యాబేజీ కూర పెట్టటం మంచిదని శాస్త్రం చెబుతోంది. అందుకే దీన్ని ‘స్తన్యదం’గా గుర్తించారు.
*పొట్ల ఆకు (పటోల పత్రం): మన ప్రాంతంలో వాడకం కొంత తక్కువగానీ మిగతా ఆకు కూరల్లాగే
* పొట్ల ఆకును పప్పులో వేసుకుని తింటే పిత్తం తగ్గుతుంది, తేలికగా జీర్ణమవుతుంది.
*అరటి పువ్వు (కదళీ పుష్పం): నోటికి వగరుగానే అనిపించినా కడుపులోకి వెళ్లిన తార్వత జీర్ణమయ్యేది మధురంగానే! ఇది పిత్తాన్ని హరించే మంచి కూర. ఈ కాలంలో తప్పకుండా తినదగ్గది.
*బూడిద గుమ్మడికాయ (కూష్మాండం): లేతగా ఉండే బూడిద గుమ్మడి కాయ వేసవిలో చాలా శ్రేష్ఠం.
*కాకరకాయ: చలవ చేస్తుంది, మలబద్ధకాన్ని పోగొడుతుంది, వీటన్నింటినీ మించి విశేషంగా... ఆకలి పుట్టిస్తుంది!

పండ్లు
*అరటిపళ్లు: తోలు మీద మచ్చలు వచ్చి, బాగా మిగల పండిన అరటిపళ్లు చాలా మంచివి. ఇవి మంచి తీపిగా, రుచిగా, చలవగా ఉంటాయి, వేసవిలో మంచి బలాన్నిస్తాయి. పచ్చి వాటికంటే బాగా పండినవి తినటం ముఖ్యం.
*దానిమ్మ: తీపిగా ఉండటమే కాదు.. దాహాన్ని కూడా పోగొడుతుంది. శక్తినిస్తుంది, శరీరంపై వేడిమి ప్రభావాన్ని తగ్గిస్తుంది.
*ద్రాక్ష: చలవ చేస్తుంది, తీపిగా ఉంటుంది. ముఖ్యంగా ఇది చక్షుస్యం. అంటే వేసవిలో కళ్లు చల్లగా, హాయిగా ఉండేందుకు ద్రాక్ష మంచిది.
*బత్తాయి: మధురంగా ఉండే ఈ ఫలం దాహాన్ని పోగొడుతుంది, మంచి సత్తువనిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు