Seasonal diseases: వానా వానా జబ్బప్పా!

ఉక్కపోతతో ఉడికించిన వేసవి పోయి చల్లటి చిరుజల్లులతో పలకరించే వానకాలం వస్తే ఎవరికి మాత్రం ఆనందంగా ఉండదు? అయితే మనకే కాదు.. ఇది జబ్బులకూ ఆహ్లాదకరమైన కాలమే. ఫ్లూ, డెంగీ, న్యుమోనియా, మలేరియా, వాంతులు, విరేచనాలు, కామెర్ల వంటివెన్నో విజృంభిస్తుంటాయి.

Updated : 18 Jun 2024 06:56 IST

ఉక్కపోతతో ఉడికించిన వేసవి పోయి చల్లటి చిరుజల్లులతో పలకరించే వానకాలం వస్తే ఎవరికి మాత్రం ఆనందంగా ఉండదు? అయితే మనకే కాదు.. ఇది జబ్బులకూ ఆహ్లాదకరమైన కాలమే. ఫ్లూ, డెంగీ, న్యుమోనియా, మలేరియా, వాంతులు, విరేచనాలు, కామెర్ల వంటివెన్నో విజృంభిస్తుంటాయి. చాలావరకివి మామూలుగా తగ్గిపోయేవే అయినా కొందరికి ప్రమాదకరంగానూ మారొచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులతో బాధపడేవారికి.. వృద్ధులకు, పిల్లలకు, గర్భిణులకు కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. కాబట్టి జాగ్రత్త అవసరం. నివారణ చర్యలు, టీకాలతో వీటిని చాలావరకూ అడ్డుకోవచ్చు. ఒకవేళ వచ్చినా సత్వరం స్పందిస్తే తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. 

మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలోనే రెండు రెట్లు ఎక్కువగా జబ్బుల బారినపడుతుంటారు. వయసుతో నిమిత్తం లేదు. పిల్లల దగ్గరి నుంచి వృద్ధుల వరకూ ఎంతోమంది ఆసుపత్రుల్లో చేరటం చూస్తుంటాం. ఈ కాలంలో వాతావరణం మారటమే కాదు.. కలుషితమయ్యే నీరు, ముసురుకొచ్చే దోమల దండుతో వచ్చే జబ్బులు చాలా ఎక్కువ. అంతేనా? అప్పటికే ఉన్న కొన్ని జబ్బులూ తీవ్రం కావొచ్చు. ఎందుకంటే వర్షాకాలంలో వాతావరణం మారటం శ్వాసకోశ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. శ్వాస మార్గాలు సంకోచించటం వల్ల అలర్జీలు, ఆస్థమా, సైనసైటిస్, సీవోపీడీ వంటి సమస్యలు ఉద్ధృతమవుతాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ముందే డాక్టర్‌ను సంప్రదించి మందుల మోతాదులను సరిచేసుకోవాలి. మరో ముఖ్య విషయం- ఆస్థమా, సైనసైటిస్‌ వంటి సమస్యలు ఉద్ధృతమయ్యే ముందు చాలామందికి జలుబు, ఫ్లూ వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రావటం. ఈ ఇన్‌ఫెక్షన్లను నిర్లక్ష్యం చేసి, సరైన చికిత్స తీసుకోకపోతే పాత జబ్బులు తీవ్రమయ్యే ప్రమాదముందని గుర్తించాలి.

ఫ్లూ తక్కువది కాదు

చాలామంది ఫ్లూను తేలికగా తీసుకుంటారు. నిజానికి చాలామందిలో పెద్దగా ఇబ్బంది పెట్టదు కూడా. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతునొప్పి వంటి లక్షణాలు రెండు మూడు రోజుల్లో వాటంతటవే తగ్గుతాయి. మొదట్లో పారాసిటమాల్‌ మాత్రలు వేసుకుంటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటే చాలు. కానీ ఫ్లూ కొందరికి తీవ్రం కావొచ్చు. కాబట్టి నిర్లక్ష్యం తగదు. ముఖ్యంగా ఆస్థమా, సైనసైటిస్‌ వంటి శ్వాసకోశ సమస్యలు గలవారికి.. గర్భిణులకు, 60 ఏళ్లు పైబడ్డవారికి జలుబు లక్షణాలు కనిపిస్తే ఫ్లూ పరీక్ష చేయించటం మంచిది. మూడు రోజులైనా బాధలు తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. జబ్బు నిర్ధరణ అయితే ఫ్లూ మందులు విధిగా వేసుకోవాలి. 

టీకాతో నివారణ: ఫ్లూ టీకాతో అసలు సమస్య రాకుండానే చూసుకోవచ్చు. దీన్ని సాధారణంగా వర్షాకాలం ఆరంభం కావటానికి రెండు నెలల ముందే వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నా రెండు వారాల్లో యాంటీబాడీలు పుట్టుకొచ్చి, పని చేయటం మొదలెడతాయి. ఫ్లూ కారక ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి టీకాను ఏటా తీసుకోవాలి. మనదేశంలో ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాలకు ప్రత్యేకించిన రెండు రకాల టీకాలూ అందుబాటులో ఉన్నాయి. అమెరికా, యూరప్‌ దేశాలకు వెళ్లేవారు ఉత్తరార్ధ గోళానికి ఉద్దేశించిన టీకా తీసుకోవచ్చు. ఇక్కడే ఉండేవారు మాత్రం దక్షిణార్ధ గోళం వారికోసం రూపొందించినది తీసుకోవాలి. ఎందుకంటే మనదేశం ఉత్తరార్ధ గోళంలో ఉన్నప్పటికీ చాలా ఫ్లూ వైరస్‌లు దక్షిణార్ధ గోళం నుంచే ఇక్కడికి వ్యాపిస్తుంటాయి.

న్యుమోనియా బాధ

వానాకాలంలో కొందరికి బ్యాక్టీరియాతో వచ్చే న్యుమోనియా కూడా ఎక్కువవుతుంది. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి.. మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్థమా, హెచ్‌ఐవీ వంటి సమస్యలతో బాధపడేవారికి.. కీమోథెరపీ తీసుకుంటున్నవారికి.. పొగ, మద్యం తాగేవారికి.. ఊబకాయులకు దీని ముప్పు ఎక్కువ. జలుబు మాదిరిగానే ఇందులోనూ జ్వరం, దగ్గు లాంటి మామూలు లక్షణాలే ఉండటం వల్ల నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది ప్రమాదం. కొందరికి దగ్గుతో పాటు ఛాతీ నొప్పి ఉండొచ్చు. రెండు మూడు రోజులకు కళ్లె రంగు పసుపు, ఆకుపచ్చ, నల్ల రంగులోకి మారొచ్చు. కొన్నిసార్లు రక్తం చారలూ కనిపించొచ్చు. కొందరికి చలి, ఆయాసమూ రావొచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ సలహా మేరకు ఎక్స్‌రే తీయించుకోవాలి. కొందరు అత్యుత్సాహంతోనో, భయంతోనో తమకుతామే సీటీ స్కాన్‌ చేయించుకుంటుంటారు. ఇది అవసరం లేదు. డాక్టర్‌ సూచిస్తేనే దీన్ని చేయించుకోవాలి. మామూలు ఎక్స్‌రేతోనే న్యుమోనియా ఉన్నదీ లేనిదీ బయటపడుతుంది. న్యుమోనియా లక్షణాలు ఉండి, ఎక్స్‌రేలో ఎలాంటి మార్పులు కనిపించకపోతేనే సీటీ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. కళ్లెను పరీక్షించి, బ్యాక్టీరియా రకాలను బట్టి యాంటీబయాటిక్‌ మందులు వాడితే న్యుమోనియా తగ్గుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్‌ రక్తంలోకి వ్యాపించొచ్చు, ఊపిరితిత్తుల్లో చీము ఏర్పడొచ్చు. సత్వరం చికిత్స తీసుకుంటే ఇలాంటి ప్రమాదకర సమస్యల బారినపడకుండా చూసుకోవచ్చు. 

న్యుమోనియాకూ టీకా అందుబాటులో ఉంది. ముందు కాంజ్యుగేటెడ్‌ టీకా, ఆ తర్వాత కనీసం రెండు నెలలకు మామూలు న్యుమోనియా టీకా తీసుకోవాలి. కాంజ్యుగేటెడ్‌ టీకాను జీవితంలో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. మామూలు న్యుమోనియా టీకాను ప్రతి ఐదేళ్లకోసారి తీసుకోవాలి. వృద్ధులకు, మధుమేహం వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారికిది తప్పనిసరి.

డెంగీ కలవరం

ఇది ప్రతి రెండు, మూడేళ్లకోసారి విరుచుకు పడుతుంటుంది. గత రెండేళ్లుగా స్తబ్ధుగా ఉండటం వల్ల ఈసారి డెంగీ విజృంభించే అవకాశముంది. ఇప్పటికే దీని సూచనలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల మరణాలూ సంభవిస్తున్నాయి. డెంగీలో హఠాత్తుగా తీవ్ర జ్వరం వస్తుంది. తలనొప్పి, కళ్ల వెనక నొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు వేధిస్తాయి. నిజానికి నూటికి 99 మందికి ఏమీ కాదు. ఒక్క శాతం మందికి తీవ్రంగా పరిణమించొచ్చు. ఇదీ చికిత్సతో తగ్గుతుంది. అందువల్ల డెంగీకి భయపడాల్సిన పనిలేదు. అలాగని నిర్లక్ష్యం పనికిరాదు. డెంగీలో మొదటి ఐదు రోజులు జ్వరం తీవ్రంగా ఉంటుంది. ఈ దశలో పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. పారాసిటమాల్‌ మాత్రలు వేసుకుంటూ.. తగినంత నీరు, ద్రవాలు తాగితే చాలు. జ్వరం తగ్గిన తర్వాతే జాగ్రత్త అవసరం. రక్తం చిక్కబడటం, రక్తపోటు పడిపోవటం, ప్లేట్‌లెట్‌ కణాలు తగ్గటం ఈ దశలోనే మొదలవుతాయి. డెంగీలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గటం కన్నా రక్తపోటు పడిపోవటమే అసలు ప్రమాదం. ఇది డెంగీ షాక్‌ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. కానీ చాలామంది జ్వరం తగ్గగానే పూర్తిగా నయమైందని భావిస్తుంటారు. ఈ సమయంలో డాక్టర్లు చెప్పినట్టు నడచుకోవాలి.

  • ప్లేట్‌లెట్లు ఎక్కించేది కొందరికే: డెంగీలో అందరికీ ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన పనిలేదు. వీటి సంఖ్య 20వేల కన్నా తగ్గి, చర్మం మీద మచ్చల వంటి రక్త స్రావ లక్షణాలు కనిపిస్తుంటేనే ఎక్కించాలి. ఒకవేళ ప్లేట్‌లెట్లు 10వేల కన్నా తగ్గితే రక్తస్రావం కాకపోయినా ఎక్కించాలి. అనవసరంగా వీటిని ఎక్కిస్తే ఇతర దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. 
  • కొందరు బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి పండ్లు తీసుకుంటుంటారు. వీటితో ప్లేట్‌లెట్లు పెరుగుతున్నట్టు శాస్త్రీయంగా కచ్చితంగా రుజువు కాలేదు. కాబట్టి ఇలాంటి చిట్కాల మీద ఆధారపడొద్దు. 

నివారణ తేలికే: దోమలు కుట్టకుండా చూసుకుంటే డెంగీని పూర్తిగా నివారించుకోవచ్చు. ఇది ఈడిస్‌ ఈజిప్టై దోమలతో వ్యాపిస్తుంది. ఇవి 100 మీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్లలేవు. మంచి నీటిలోనే వృద్ధి చెందుతాయి. కాబట్టి ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో పూల కుండీలు, ఎయిర్‌ కూలర్ల వంటి వాటిల్లో వారానికి ఒకరోజు పూర్తిగా నీరు ఖాళీ చేయాలి. ఇంటి మీదుండే నీటి ట్యాంకులపై మూత పెట్టి ఉంచాలి. పరిసరాల్లో కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, పగిలిన సీసాలు లేకుండా చూసుకోవాలి. తలుపులకు, కిటికీలకు సన్నటి జాలీ బిగించుకోవాలి. మంచానికి దోమతెరలు కట్టుకోవాలి. పొడవైన చేతుల చొక్కాలు, ప్యాంటు ధరించాలి. కాళ్లూ చేతులకు దోమలను తరిమే మలాము రాసుకోవచ్చు. పిల్లలు పగలంతా బడిలోనే ఉంటారు. కాబట్టి పాఠశాలల్లోనూ పిల్లలకు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

మలేరియా గుబులు

ప్లాస్మోడియం జాతి పరాన్నజీవులతో మలేరియా వస్తుంది. ఇవి ఎనాఫిలస్‌ దోమ కాటుతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. మలేరియా తొలిదశలో తలనొప్పి, నీరసం, కండరాల నొప్పి, కడుపులో ఇబ్బంది వంటి లక్షణాలుంటాయి. అనంతరం రోజు విడిచి రోజు జ్వరం రావటం.. విపరీతమైన చలి వేధిస్తాయి. కొందరిలో రక్తహీనత, ప్లీహం పెద్దగా అవటం వంటి సమస్యలూ రావొచ్చు. కొందరికి పరాన్నజీవులతో నిండిన రక్తకణాలు మెదడులోని సూక్ష్మ రక్తనాళాల్లో చిక్కుకుపోవచ్చు (సెరిబ్రల్‌ మలేరియా). వీరిలో మెదడు వాచి, దెబ్బతినొచ్చు. మూర్ఛ రావొచ్చు. కోమాలోకీ వెళ్లిపోవచ్చు. ఊపిరితిత్తుల్లో ద్రవాలు నిండిపోయి శ్వాస తీసుకోవటం కష్టం కావొచ్చు. మూత్రపిండాలూ విఫలం కావొచ్చు. కాబట్టి మలేరియాను విస్మరించటానికి లేదు. గర్భిణులకైతే మరింత జాగ్రత్త అవసరం. 

ఈకాలంలో జ్వరం వస్తే?

  • జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్‌ మాత్రలు వేసుకోవచ్చు గానీ ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్‌ వంటి నొప్పి మందులు అసలే వాడొద్దు. ఈ కాలంలో వైరల్‌ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది. కాబట్టి నొప్పి మందులు వేసుకుంటే ప్రమాదం. 
  • నీరు, ద్రవాలు ఎక్కువగా తాగాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. 
  • వైరల్‌ జ్వరాల నిర్ధరణ తేలికే. సంపూర్ణ రక్త పరీక్ష (సీబీపీ) చేస్తే వెంటనే అర్థమవుతుంది. తెల్ల రక్తకణాల సంఖ్య పెరిగితే చాలావరకూ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ అనుకోవచ్చు. వీటి సంఖ్య నార్మల్‌గా ఉన్నా, తగ్గినా వైరల్‌ జ్వరాలు కావొచ్చు. వీటిని అనుమానిస్తే సత్వరం ఫలితాన్నిచ్చే ర్యాపిడ్‌ డయాగ్నొస్టిక్‌ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఎన్‌ఎస్‌1 యాంటీజెన్, డెంగీ ఐజీజీ, డెంగీ ఐజీఎం యాంటీబాడీలుంటే వెంటనే బయటపడతాయి. అవసరమైతే ఎలీసా పరీక్షతో నిర్ధరించుకోవచ్చు. మలేరియా, ఫ్లూను గుర్తించే ర్యాపిడ్‌ పరీక్షలూ ఉన్నాయి. గంట, రెండు గంటల్లోనే సమస్య ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. 
  • జ్వరం నిర్ధరణ కాకుండా మందులు వాడటం తగదు. ఇది శరీరానికి హాని చేస్తుంది. డబ్బూ వృథా అవుతుంది. అనవసర సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ అనంతరం బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. సరైన మందులు వాడితే ఈ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను నివారించుకోవచ్చు. ఆస్థమా వంటి సమస్యలు ఉద్ధృతం కాకుండా కాపాడుకోవచ్చు. 
  • సొంతంగా యాంటీబయాటిక్‌ మందులు కొనుక్కొని, వేసుకోవటం తగదు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లకు ఇవి పనిచేయవు. అనసరంగా యాంటీబయాటిక్‌ మందులు వాడితే బ్యాక్టీరియా మొండిగా తయారవుతుంది. నిజంగా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు ఆ మందులు వాడితే పనిచేయవు. ఇది కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెట్టొచ్చు.

వాంతులు, నీళ్ల విరేచనాలు

ఎండాకాలంలో ఎండిపోయిన బావులు, చెరువులు, కాల్వలు వానలకు నిండుతాయి. ఈ క్రమంలో తాగు నీరు, ఆహార పదార్థాలు కలుషితమయ్యే ప్రమాదముంది. దీంతో వాంతులు, నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు, కామెర్లు, టైఫాయిడ్‌ వంటి రకరకాల సమస్యలు వస్తుంటాయి. నీళ్ల విరేచనాలతో ఒంట్లో నీటిశాతం తగ్గుతుంది. పరిస్థితి అంతవరకూ రాకుండా ఓఆర్‌ఎస్‌ పొడిని కలిపిన నీటిని తరచూ తాగాలి. ఓఆర్‌ఎస్‌ పొడి అందుబాటులో లేకపోతే గ్లాసు నీటిలో చారెడు చక్కెర, చిటికెడు ఉప్పు కలిపి తాగాలి. టైఫాయిడ్‌లో జ్వరం విడవకుండా వేధిస్తుంది. వాంతులు, విరేచనాలు, ఆకలి తగ్గటం, కడుపు నొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం కూడా ఉండొచ్చు. సమస్యను నిర్ధరించి, పూర్తికాలం యాంటీబయాటిక్‌ మందులు వాడితే టైఫాయిడ్‌ నయమవుతుంది. హెపటైటిస్‌ ఎ, ఇ వైరస్‌లతో వచ్చే కామెర్లు రెండు, మూడు వారాల్లో వాటంతటవే తగ్గుతాయి. కానీ కొన్నిసార్లు నెలల కొద్దీ వేధించొచ్చు. ఇందులో కళ్లు, చర్మం, మూత్రం పసుపు పచ్చగా మారతాయి. ఆకలి తగ్గుతుంది. కొందరికి మలం తెల్లగా, నల్లగా రావొచ్చు కూడా. మనలో చాలామంది కామెర్లకు నాటు వైద్యాలు తీసుకుంటుంటారు. ఇది మంచిది కాదు. జబ్బును నిర్ధరించుకొని, తగు చికిత్స తీసుకోవాలి.

నీరు, ఆహార పరిశుభ్రత కీలకం: ఈ కాలంలో కాచి, చల్లార్చి, వడపోసిన నీటిని మాత్రమే తాగాలి. బాటిళ్లలో అమ్మే సురక్షితమైన నీరైనా తాగొచ్చు. అయితే విశ్వసనీయమైన కంపెనీలవే ఎంచుకోవాలి. అప్పుడే వండిన ఆహారం తినాలి. ఆహార పదార్థాలు, తాగు నీరు మీద ఈగలు వాలనీయొద్దు. భోజనం చేసే ముందు, వండటం ఆరంభించే ముందు, మల విసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. హోటళ్లలో భోజనం వండేవారు, వడ్డించేవారికిది మరింత ముఖ్యం. వీలైనంత వరకూ వంటలను చేత్తో తాకకుండా చూడాలి. వంట పాత్రలూ శుభ్రంగా ఉండాలి. 

ఫంగల్‌ బెడద

వానాకాలంలో వాతావరణంలో తేమ పెరగటం వల్ల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువయ్యే ప్రమాదముంది. గ్రామాల్లో చాలామంది బురదలో పనిచేస్తుంటారు. వీరికి కాళ్లకు ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. మధుమేహం గలవారికి కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే ఇన్‌ఫెక్షన్‌ తలెత్తే అవకాశముంది. కాబట్టి జాగ్రత్త అవసరం. 

డా।। ఎం.వి.రావు
కన్సల్టెంట్‌ ఫిజిషియన్‌
యశోదా హాస్పిటల్‌, సోమాజిగూడ, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని