belching: బ్రేవ్‌.. బ్రేవ్‌.. త్రేన్పులతో ఇబ్బందా?

కడుపులో పేరుకునే గ్యాస్‌తో ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా నోటితో గాలిని పీల్చుకోవటం, ఆహారం జీర్ణమయ్యే సందర్భాల్లో కడుపులో గ్యాస్‌ పేరుకుపోతుంటుంది.

Published : 16 Jul 2022 19:24 IST

కడుపులో పేరుకునే గ్యాస్‌తో ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా నోటితో గాలిని పీల్చుకోవటం, ఆహారం జీర్ణమయ్యే సందర్భాల్లో కడుపులో గ్యాస్‌ పేరుకుపోతుంటుంది. ఇది బయటకు రావటానికి ప్రయత్నించటంతోనే త్రేన్పులు వస్తుంటాయి. కానీ, కొన్నిసార్లు ఈ గ్యాస్‌ జీర్ణాశయం, పేగుల్లోనే ఉండిపోయి కడుపు ఉబ్బరం, నొప్పికి దారి తీస్తుంది. తరచుగా త్రేన్పులు, ఆవలింతలతో చికాకు కలిగిస్తుంది. వీటి నుంచి తప్పించుకోవటానికి గ్యాస్‌ పేరుకుపోవటానికి గల కారణాలు, తగ్గించుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవటం మంచిది.

🔥 కొవ్వు పదార్థాలు తినటం కడుపు ఉబ్బరానికి దోహదం చేస్తుంది. జీర్ణాశయం నుంచి ఆహారం త్వరగా పేగుల్లోకి వెళ్లకుండా కొవ్వు అడ్డుకుంటుంది. దీంతో కడుపు నిండుగా అనిపిస్తుంది.

🔥 ఒత్తిడి, ఆందోళన, పొగ తాగటం, జీర్ణకోశంలో ఇన్‌ఫెక్షన్‌, ఇరిటేబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ కూడా కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి.

🔥 పిండి పదార్థాలు కూడా గ్యాస్‌ నిండేలా చేస్తాయి. ముఖ్యంగా క్యాబేజీ, కూల్‌డ్రింకులు, కాలీఫ్లవర్‌, బబుల్‌గమ్‌ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.

🔥 ఆహారాన్ని గబగబా తినటం, మాట్లాడుతూ తినటం, కూల్‌డ్రింకులు తాగటం వల్ల జీర్ణాశయంలోకి గాలి ఎక్కువగా చేరుకుంటుంది. ఇది త్రేన్పులు రావటానికి దోహదం చేస్తుంది. కాబట్టి నెమ్మదిగా తినటం అలవాటు చేసుకోవాలి. కూల్‌డ్రింకులను స్ట్రాతో తాగటం మానెయ్యాలి.

🔥 పొగతాగటం మానెయ్యాలి. పొగతో పాటు గాలి కూడా లోనికి వెళ్తుందని మరవరాదు.

🔥 పాల పదార్థాలు, పండ్లు వంటి వాటిల్లోని చక్కెర (గ్లుటెన్‌) పూర్తిగా జీర్ణం కాకపోవటం వల్ల కూడా గ్యాస్‌ పేరుకుంటుంది. ఇలాంటివి గమనిస్తే సాధ్యమైనంత వరకు గ్యాస్‌కు కారణమవుతున్న పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

🔥 కడుపు ఉబ్బరం, త్రేన్పులు చాలావరకు వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ అతిసారం, మలబద్ధకం, వికారం, వాంతులు, బరువు తగ్గటం, కడుపు నొప్పి, తరచుగా గుండెలో మంట, మలంలో రక్తం పడటం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని