Updated : 14 Dec 2022 11:14 IST

Drinking water: నీరెప్పుడు తాగాలి?.. ఎంత తాగాలి?

మెదడు పనితీరు మెరుగవుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. బరువు తగ్గుతుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట రూపంలో కోల్పోయిన నీరు భర్తీ అవుతుంది. ఇలా చెప్పుకొంటూ పోతే నీరు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. మరి నీళ్లు తాగటానికి మంచి సమయం ఏది?

  • ఉదయం నిద్ర లేచాక ముందుగా గ్లాసు నీరు తాగటం మంచిది. ఇందులో కాస్త నిమ్మరసం కలుపుకొంటే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ సి, పొటాషియం సైతం లభిస్తాయి. రోజంతా హుషారుగా ఉండొచ్చు.
  • వేళ కాని వేళ ఆకలి వేస్తున్నట్టు అనిపించినా ముందు కాసిన్ని నీళ్లు తాగటం ఉత్తమం. ఆకలి, దాహం.. రెండింటి ప్రేరేపకాలను మెదడు ఒకేలా గ్రహిస్తుంది. కాబట్టే చాలాసార్లు ఆకలి, దాహం మధ్య తేడా తెలియదు. నీళ్లు తాగాక కొద్ది నిమిషాల తర్వాత ఆకలి తగ్గితే దాహం వేసిందనే అర్థం. దీంతో అనసరంగా తినటాన్ని అరికట్టొచ్చు.
  • విరేచనాలు, వాంతులు, జ్వరం మూలంగా ఒంట్లోంచి  చాలా నీరు వెళ్లిపోతుంది. వీటి లక్షణాలు ఆరంభమవుతున్న దశలోనే.. దాహం వేయకపోయినా కూడా తరచూ నీళ్లు తాగటం మంచిది. దీంతో జబ్బుల నుంచి త్వరగా కోలుకోవచ్చు. సాయంత్రం వేళల్లో నిరుత్సాహంగా, బడలికగా అనిపించినప్పుడు చాలామంది కాఫీ, టీ వైపు చూస్తుంటారు గానీ ముందుగా ఓ గ్లాసు నీరు తాగటం మేలు. దీంతో మెదడు చురుకుగా పనిచేస్తుంది. మూడ్‌ మెరుగవుతుంది.
  • తలనొప్పిగా అనిపించినప్పుడూ నీళ్లు తాగి చూడొచ్చు. ఎందుకంటే ఒంట్లో నీటిశాతం తగ్గినప్పుడు తలనొప్పి ప్రేరేపితమయ్యే అవకాశముంది.
  • మంచి ఆరోగ్యానికి నీరు అత్యంత అవసరం. మరి రోజుకు ఎంత నీరు తాగాలి? అందరికీ ఒకే నియమం సరిపోదు. మన శరీరానికి ద్రవాలు ఎందుకు అవసరమనేది తెలుసుకుంటే రోజుకు ఎంత నీరు తాగాలనే అంచనాకు రావొచ్చు. ప్రతీ కణం, కణజాలం, అవయవం సరిగా పనిచేయటానికి నీరు తప్పనిసరి.
  • ఉదాహరణకు- మూత్రం, చెమట, మలం ద్వారా మలినాలు బయటకు పోవటానికి.. శరీర ఉష్ణోగ్రత నార్మల్‌గా ఉండటానికి.. కీళ్లు తేలికగా కదలటానికి.. సున్నితమైన కణజాలాలు దెబ్బతినకుండా ఉండటానికి నీరు తోడ్పడుతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గితే ఇలాంటి పనులన్నీ మందగిస్తాయి. కొద్దిపాటి నీరు తగ్గినా శక్తి, ఉత్సాహం సన్నగిల్లుతాయి. అలసట ముంచుకొస్తుంది. కాబట్టి తగినంత నీరు తాగటం ప్రధానం.
  • రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలనేది సాధారణ సిఫారసు. అయితే ఎంత నీరు అవసరమనేది మన ఆరోగ్యంతో పాటు ఉష్ణోగ్రత, మన శారీరక శ్రమ, పనుల వంటి వాటి ఆధారపడి ఉంటుంది. తగినంత నీరు తాగుతున్నామా? లేదా? అనేది గుర్తించటానికి తేలికైన మార్గం మూత్రం రంగు. మామూలుగానైతే ఇది లేత పసుపు రంగులో ఉండాలి. ఏమాత్రం ముదురు రంగులోకి మారినా తగినంత నీరు తాగటం లేదనే అర్థం.
  • నీరు తాగటానికి దాహం వేసేంతవరకు ఆగటం సరికాదు. మనకు దాహం వేసే సరికే ఒంట్లో నీటి శాతం తగ్గిపోయి ఉంటుందని తెలుసుకోవాలి. కాబట్టి అప్పుడప్పుడు గొంతు తడిచేసుకుంటూ ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని