Updated : 01 Aug 2022 07:18 IST

Walking benefits: మీ కాళ్లల్లోనే దివ్య ఔషధం... ఏం చేయాలంటే?

‘రోజూ కాసేపు నడవండి’.. డాక్టర్లు తరచుగా ఈ మాట చెబుతూనే ఉంటారు. అయినా వింటేగా? ‘ఆ.. నడిస్తే ఎంత? నడవకపోతే ఎంత?’ అని అనుకునేవారు కొందరైతే.. సమయం లేదనో, బద్ధకంతోనో ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ పోయేవారు మరికొందరు. నిజానికి నడక ఓ దివ్య ఔషధం! వ్యాయామాల్లో ఇంత తేలికైంది మరోటి లేదు. ఎలాంటి వ్యాయామమైనా ఆరోగ్యాన్ని పెంపొందించేదే కావొచ్చు గానీ నడకతో ప్రత్యేకంగా లభించే ప్రయోజనాలూ ఉన్నాయి.

  • బరువు పెరగటాన్ని ప్రోత్సహించే జన్యువుల ప్రభావాలను నడక తిప్పికొడుతుంది. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలిన విషయమిది. ఊబకాయాన్ని ప్రేరేపించే 32 రకాల జన్యువుల పనితీరును పరిశీలించగా.. రోజుకు సుమారు గంట సేపు నడిచిన వారిలో వీటి ప్రభావాలు సగానికి సగం తగ్గుతుండటం విశేషం.
  • నడకతో తీపి పదార్థాల మీదికి మనసు మళ్లటమూ తగ్గుతుంది. పదిహేను నిమిషాలు నడిచినా చాలు. చాక్లెట్లు తినాలనే కోరిక తగ్గుముఖం పడుతున్నట్టు, ఒత్తిడిలో ఉన్నప్పుడు చాక్లెట్లు తినటమూ తగ్గుతున్నట్టు ఎక్స్‌టర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. ఇది ఒక్క చాక్లెట్లకే పరిమితం కావటం లేదు. ఇతరత్రా తీపి పదార్థాలను తినాలనే కోరికా తగ్గుతోంది.
  • ఎలాంటి శారీరక శ్రమ అయినా రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తగ్గటానికి తోడ్పడేదే. ఒక్క నడకతోనూ ఇది సాధ్యమవుతున్నట్టు అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ అధ్యయనం పేర్కొంటోంది. వారానికి 7 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నడిచిన స్త్రీలలో రొమ్ముక్యాన్సర్‌ ముప్పు 14% వరకు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అధిక బరువు, హార్మోన్‌ మాత్రలు వేసుకోవటం వంటి రొమ్ముక్యాన్సర్‌ ముప్పు కారకాలు గలవారికీ ఇలాంటి రక్షణ లభిస్తుండటం గమనార్హం.
  • కీళ్లవాపుతో తలెత్తే నొప్పులు తగ్గటానికి నడక దోహదం చేస్తున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, సమస్య అంతవరకూ రాకుండానూ కాపాడుతుంది. వారానికి ఐదారు కిలోమీటర్లు నడవటం కీళ్లవాపు నివారణకూ తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. నడవటం వల్ల కీళ్లు.. ముఖ్యంగా ఎక్కువగా అరిగిపోయే అవకాశమున్న మోకీళ్లు, తుంటి కీళ్లు, వాటి చుట్టూ ఉండే కండరాలు బలోపేతమవుతాయి. కీళ్లు ఒరుసుకుపోవటం తగ్గి, కదలికలు సాఫీగా సాగుతాయి. ఇవన్నీ కీళ్ల నొప్పుల బారినపడకుండా చూసేవే.
  • నడకతో రోగనిరోధకశక్తి సైతం పుంజుకుంటుంది. వారానికి ఒకసారి, అంతకన్నా తక్కువ వ్యాయామం చేసినవారితో పోలిస్తే.. రోజుకు కనీసం 20 నిమిషాల సేపు (వారంలో ఐదు రోజుల పాటు) నడిచిన వారికి జలుబు, ఫ్లూ వంటి ఇన్‌ఫెక్షన్ల ముప్పు 43% తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ జబ్బులు వచ్చినా లక్షణాల తీవ్రత తక్కువని, త్వరగానూ కోలుకుంటున్నారని వివరిస్తున్నాయి.

Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని