Anxiety disorder: మితిమీరిన ఆందోళన

ఆందోళన సహజం. ఎప్పుడో అప్పుడు, ఏదో ఒక సందర్భంలో అంతా ఆందోళనకు గురయ్యేవారే. జబ్బుల గురించో.. ఆర్థిక, కుటుంబ సమస్యల గురించో బాధపడటం కొత్తేమీ కాదు.

Updated : 16 May 2023 06:37 IST

ఆందోళన సహజం. ఎప్పుడో అప్పుడు, ఏదో ఒక సందర్భంలో అంతా ఆందోళనకు గురయ్యేవారే. జబ్బుల గురించో.. ఆర్థిక, కుటుంబ సమస్యల గురించో బాధపడటం కొత్తేమీ కాదు. వాటిని అంతే త్వరగా మరచిపోతుంటాం కూడా. కానీ అదేపనిగా అతిగా బాధపడుతుంటే? అదీ ఇబ్బంది చిన్నదైనా, అసలు కారణమేదీ లేకపోయినా భయపడుతుంటే? రోజువారీ పనులకూ విఘాతం కలిగిస్తుంటే? ఆందోళన జబ్బు (జనరలైజ్డ్‌ ఆంగ్జయిటీ డిజార్డర్‌) ఇలాగే వేధిస్తుంది. దీన్ని తేలికగా తీసుకోవటం తగదు. మందులు, కౌన్సెలింగ్‌ తప్పనిసరి. లేకపోతే దీర్ఘకాలం వెంటాడుతుంది. శారీరకంగా, సామాజికంగా, వృత్తిగతంగా అన్నిరకాలుగా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. కాబట్టి దీనిపై అవగాహన కలిగుండటం అవసరం.


ఆందోళన మంచిది! ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం. ప్రమాదాలు, ముప్పులను గుర్తించే మన శరీర వ్యవస్థలో ఇదొక భాగం. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవటానికో, అక్కడి నుంచి పారిపోవటానికో మనల్ని సిద్ధం చేస్తుంది. గుండె వేగం పెరగటం, రక్త ప్రసరణ పుంజుకోవటం, శ్వాస వేగంగా తీసుకోవటం వంటి మార్పులన్నీ దీని ఫలితమే. ఇవన్నీ శరీరానికి తక్షణ శక్తిని అందించి, ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి శరీరానికి తోడ్పడేవే. దాన్నుంచి బయటపడ్డాక అన్నీ సద్దుమణుగుతాయి. అయితే ఆందోళన వ్యవస్థతో చిక్కేంటంటే- ఇది ఎప్పుడైనా ప్రేరేపితం కావటం. ఎలాంటి ప్రమాదం లేకపోయినా ప్రమాదంలో ఉన్నామన్న ఆలోచన కలిగితే చాలు. వెంటనే రంగంలోకి దూకుతుంది. ప్రమాదం ఎదురైనప్పుడు తలెత్తే స్పందనలన్నింటినీ సృష్టిస్తుంది. ఒకరకంగా దీన్ని ఇంట్లో పొగను గుర్తించే డిటెక్టర్‌లాంటిదని చెప్పుకోవచ్చు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడే కాదు.. ఇంట్లోంచి ఎలాంటి పొగలు వెలువడినా స్మోక్‌ డిటెక్టర్‌ స్పందించి, మోత మోగుతుంది. ఆందోళన కూడా ఇలాగే స్పందిస్తుంది. మనసులో ఊహించుకునే భయాలూ దీన్ని ప్రేరేపిస్తుండటం మరో సమస్య. ప్రస్తుతం మన జీవన విధానం మారిపోయింది. దీంతో సామాజిక భయాలూ ఎక్కువయ్యాయి. ఉదాహరణకు- ఆఫీసుకు చేరుకోవటం ఆలస్యమవుతోందని, బాస్‌ తిడతాడేమోనని భయపడొచ్చు. కొత్తవారితో సమావేశం ఎలా పరిణమిస్తుందోనని గాబరా పడొచ్చు. ఇవేవీ ప్రత్యక్ష ప్రమాదాలు కావు. అయినా ఆందోళన కలిగించొచ్చు. ప్రత్యక్షంగా ఎదురయ్యే ప్రమాదాల నుంచి బయటపడటానికిది తోడ్పడటం మంచి విషయమే కావొచ్చు గానీ బాధలు, భయాలతో పుట్టుకొచ్చే ఆందోళనతో మంచి కన్నా కీడే ఎక్కువ. కొన్నిసార్లు పనులు త్వరగా జరగటానికి తోడ్పడినప్పటికీ రోజువారీ ఎదురయ్యే ఇబ్బందుల విషయంలో అదేపనిగా ఆందోళనకు గురవుతుంటే మాత్రం సమస్యగా పరిణమిస్తుంది.


సమస్యగా ఎప్పుడు?

ఆందోళన పడినంత మాత్రాన అది జబ్బు కాదు. ఎంతో కొంత ఒత్తిడికి గురవటం, కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడో, కొత్త పని మొదలెట్టినప్పుడో ఆందోళన పడటం మామూలే. ఇదొక లక్షణం మాత్రమే. కానీ ఆందోళన పడటం ఎక్కువై, తరచూ చిన్న చిన్న విషయాలకూ భయపడుతూ.. అంతకుముందు లేని ఆందోళన కొత్తగా మొదలైతే అనుమానించాల్సిందే. మామూలు పరిస్థితుల్లోనూ అతిగా ఆందోళన పడటం, ఇంతకు ముందు కన్నా ఎక్కువగా భయపడటం, దీంతో రోజువారీ పనులూ అస్తవ్యస్తమైతే జబ్బుగా మారినట్టే. ఇందులో ప్రత్యేక కారణమేదీ లేకుండానే ఆందోళన తలెత్తుతుంది. ఉదాహరణకు- భర్త ఆఫీసు నుంచి ఇంటికి రావటం ఆలస్యమైందనుకోండి. ఏదైనా ప్రమాదం అయ్యుండొచ్చని గాబరా పడొచ్చు. పిల్లలు స్కూలు నుంచి ఇంటికి రావటం ఆలస్యమైనా జరగకూడనిదేమైనా జరిగిందేమోనని భయపడొచ్చు. విద్యార్థులు తాము పరీక్షలో పాసవుతామో లేదోనని మథన పడుతుండొచ్చు. ఇది ఒక పరిస్థితికో, ఒక సంఘటనకో పరిమితం కాదు. మనసును ఏ విషయమైనా పట్టుకొని వేధిస్తుండొచ్చు. దాని గురించే పదే పదే బాధపడుతూ ఉండొచ్చు. దీంతో వ్యక్తిగత, సామాజిక, వృత్తి జీవితమూ అస్తవ్యస్తమవుతుంది. విద్యార్థులు చదువు మీద మనసు పెట్టలేకపోవచ్చు. ఉద్యోగుల్లో పని సామర్థ్యం తగ్గొచ్చు. ఆలోచనలతో ముడిపడి ఉండటం వల్ల చాలామంది దీన్ని గుర్తించటంలో పొరపడుతుంటారు. సరైన విధంగా ఆలోచించటం లేదోమోననీ అపోహ పడుతుంటారు. దీంతో డాక్టర్‌ దగ్గరికి వచ్చేసరికే చాలా అలస్యమైపోతుంటుంది.


ఉన్నట్టుండి ఉద్ధృత భయం

ఆందోళన సమస్య మరీ తీవ్రమైనప్పుడు హఠాత్తుగా, కాసేపు భయం ఉద్ధృతమయ్యే (పానిక్‌ అటాక్‌) ప్రమాదముంది. ఇది రోజులో ఎప్పుడైనా, ఎలాంటి పందర్భాల్లోనైనా రావొచ్చు. ఇలాంటి సమయంలో 5-10 నిమిషాల సేపు చాలా ఎక్కువగా.. చనిపోతామేమో అన్నంత భయం వేయొచ్చు. చెమటలు పట్టడం, తిమ్మిర్లు, వణకటం, అత్యవసరంగా బాత్రూమ్‌కు వెళ్లాలని అనిపించటం, ఊపిరి తీసుకోలేకపోవటం, ఛాతీలో బరువు పెట్టినట్టు అనిపించటం, వెంటనే ఇంట్లోంచి బయటకు వెళ్లి శ్వాస తీసుకోవాలని అనిపించటం వంటివీ తలెత్తొచ్చు. కొందరైతే గుండెపోటు వచ్చిందనీ, ఆసుపత్రికి వెళ్తే గానీ బతకమనీ అనుకోవచ్చు.


ఎందుకొస్తుంది?

ఆందోళన జబ్బు సాధారణంగా యుక్తవయసు చివర్లో గానీ 30ల్లో గానీ మొదలవుతుంటుంది. కొన్నిసార్లు బాల్యంలోనే తలెత్తొచ్చు. మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువ. అయితే ఆందోళన సమస్య ఎందుకొస్తుందనేది కచ్చితంగా తెలియదు. జన్యు స్వభావం ఒక కారణం కావొచ్చు. రక్త సంబంధీకుల్లో ఎవరికైనా ఆందోళన సమస్య ఉంటే వచ్చే అవకాశం ఎక్కువ. మన మెదడులోని అమిగ్దల వంటి భాగాలు భయం, ఆందోళన, జ్ఞాపకశక్తి, భావోద్వేగాలను నియంత్రిస్తుంటాయి. జ్ఞానేంద్రియాల నుంచి అందే సమాచారాన్ని అమిగ్దల గుర్తించి, గాబాఎర్జిక్‌ నాడీకణాలను ప్రేరేపిస్తుంది. ఇవి ఒత్తిడి, ఆందోళన, భయం వంటి భావాలు తగ్గటానికి తోడ్పడతాయి. వీటి సంఖ్య తగ్గితే ప్రతికూల భావనలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఒత్తిడి ప్రతిస్పందనలు పుట్టుకొస్తాయి. ఆందోళన సమస్యతో బాధపడేవారిలో అమిగ్దల వంటి భాగాల్లో ప్రతిస్పందనల చర్యలు ఉద్ధృతంగా ఉండొచ్చనేది ఒక భావన. ఇలా మెదడులోనే రకరకాల మార్పులు తలెత్తుతాయి. కొన్ని రసాయనాలు తగ్గుతాయి. కొన్ని అనుసంధానాలు సరిగా పనిచేయవు. ఇవన్నీ సమస్యకు దారితీస్తుంటాయి. జన్యు స్వభావం ఉండి, ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఎదురైనప్పుడు సమస్యగా మారుతుంది. ఒత్తిడి లేకపోయినా కొందరిలో చిన్న చిన్న విషయాలకూ ఆందోళన తలెత్తొచ్చు. కొన్నిసార్లు తీవ్ర జ్వరంతోనూ ప్రేరేపితం కావొచ్చు.


కేవలం భయం కాదు

ఆందోళన, భయాలు ఒకదాంతో మరోటి ముడిపడినవే కావొచ్చు. అలాగని ఆందోళన అనేది కేవలం భయం (ఫోబియా) కాదు. ఫోబియాలో ఏదో ఒక దానికి అనవసరంగా, అతిగా భయపడుతుంటారు. కొందరు బల్లులంటే భయపడొచ్చు. కొందరికి ఒంటరితనంతో భయం కలగొచ్చు. కానీ ఆందోళన జబ్బులో అలా కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా భయాలు పుట్టొచ్చు. పని బాగానే వచ్చినా చేయలేమోనని గాబరా పడొచ్చు. తమ సామర్థ్యం మీద తమకే అనుమానం రావొచ్చు. ప్రతికూల ఆలోచనలు మొదలవ్వచ్చు. 

* ఆందోళనను కొందరు మానసిక ఒత్తిడిగానూ భావిస్తుంటారు. ఇవి రెండూ ఒకటి కావు. ఒత్తిడికి గురైనప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల తోడ్పాటుతో బయటపడే అవకాశముంది. కానీ ఆందోళన జబ్బులో ఇది సాధ్యం కాదు. చికిత్స తీసుకోవాల్సిందే.


నిర్ధరణ ఎలా?

లక్షణాలు, ఇబ్బందుల ఆధారంగానే సమస్యను నిర్ధరిస్తారు. ఆందోళన ఎప్పుడు, ఎలా మొదలైంది? ఏ సంఘటన తర్వాత ఆరంభమైంది? దీని మూలంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? అనేవి క్షుణ్ణంగా పరిశీలించటం ముఖ్యం. థైరాయిడ్‌ గ్రంథి సమస్యలు, కొన్నిరకాల మందులూ ఆందోళనకు కారణం కావొచ్చు. కాబట్టి ఇలాంటి కారణాలేవైనా ఉన్నాయేమో కూడా చూస్తారు.


లక్షణాలు రకరకాలు

ఆందోళన మానసికంగానే కాదు, శారీరకంగానూ కుంగదీస్తుంది. దీంతో రకరకాల లక్షణాలు కనిపిస్తుంటాయి.

* రోజువారీ విషయాలకూ అతిగా బాధపడిపోవటం.
* భయాలు, బాధలను నియంత్రించుకోలేకపోవటం.
* భవిష్యత్తు, ఆరోగ్యం, ఆర్థిక స్థితి మీద బెంగ. ఉద్యోగం పోతుందేమో, రాణిస్తానో లేదోనని భయపడటం.
* అవసరమైన దానికన్నా అతిగా బాధపడుతున్నామని తెలిసి ఉండటం.
* చిరాకు పడటం. విశ్రాంతి తీసుకోలేకపోవటం.
* ఏకాగ్రత తగ్గటం. పనులు త్వరగా పూర్తిచేయకపోవటం.
* తేలికగా ఉలికిపడటం
* వేడి ఆవిర్లు, చల్లటి చెమటలు
* నిద్ర పట్టకపోవటం. నిద్ర పట్టినా త్వరగా మెలకువ రావటం.
* ఒళ్లునొప్పులు
* నీరసం, నిస్సత్తువ
* గుండె దడ, ఆయాసం.


చికిత్స- మందులు తప్పనిసరి

ఆందోళన సమస్యగా మారిందంటే అప్పటికే దీంతో చాలా సతమతమవుతున్నారనే అర్థం. అందువల్ల మందులు వాడుకోవటం తప్పనిసరి. దీనికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇందుకు రెండు రకాల మందులు ఉపయోగపడతాయి. ఒకటో రకం- తక్షణం ఉపశమనం కలిగించే బెంజోడైజోపీన్‌ మందులు. ఇవి గుండె దడ, నిద్రలేమి, ఆకలి మందగించటం, విశ్రాంతి పొందలేకపోవటం వంటి ఇబ్బందులను వెంటనే తగ్గిస్తాయి. సమస్య తీవ్రతను అదుపు చేస్తాయి. రెండో రకం- ఎస్‌ఎస్‌ఆర్‌ఐ మందులు. ఇవి అంతర్గతంగా ఉన్న సమస్యను తగ్గిస్తాయి. వీటిని దీర్ఘకాలం వాడుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర ఆందోళన సమస్య(ఎండీడీ)గా మారుతుంది. 

కౌన్సెలింగ్‌: ఆందోళన కాస్త తగ్గుముఖం పట్టాక, చెప్పిన మాట వింటారనే నమ్మకం కలిగికా కౌన్సెలింగ్‌, ప్రవర్తనను మార్చే చికిత్స ఆరంభిస్తారు. ఇందులో జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను, సందర్భాలను ఎదుర్కోవటాన్ని, విశ్రాంతిని పొందటమెలాగో నేర్పిస్తారు. ఉన్నట్టుండి తీవ్ర భయాలకు లోనుకాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అవగతం చేయిస్తారు. 

కుటుంబ సభ్యుల తోడ్పాటు: ఆందోళనతో బాధపడేవారిలో మెదడు ప్రతిదానికీ భయపడటానికి అనువుగా తయారై ఉంటుంది. ఏం చేసినా భయపడుతుంటారు. కొందరు అనవసరంగా మందులు వేసుకుంటున్నామనీ అనుకోవచ్చు. వీటి వల్ల ఏదో అవుతుందనీ భయపడొచ్చు. కాబట్టి కుటుంబ సభ్యుల పర్యవేక్షణ, అండ అవసరం. వీరిని విసుక్కోకుండా చూసుకోవాలి.


జీవనశైలి మార్పూ ముఖ్యమే

మానసిక ఆరోగ్యం బాగుండేలా చూసుకుంటే, మంచి జీవనశైలిని పాటిస్తే ఆందోళన సమస్య ముప్పు తగ్గుతుంది. అప్పటికే జన్యు స్వభావం ఉన్నా కూడా మానసికంగా బాగుంటే తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. నిద్ర బాగా పట్టేలా చూసుకోవాలి. నలుగురితో కలిసి మెలసి తిరగాలి. నవ్వుతూ మాట్లాడాలి. విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే విశ్రాంతి తీసుకునే పద్ధతులనూ నేర్చుకోవాలి. చిన్న చిన్న ఒత్తిళ్లను వదిలేయాలి. అనవసర గొడవల్లో తలదూర్చొద్దు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా, ధ్యానం మేలు చేస్తాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని