Beware of rabies: రేబిస్‌తో జాగ్రత్త!

టీకాలతో రేబిస్‌ను పూర్తిగా నివారించుకోవచ్చు. అయినా మనదగ్గర ఇప్పటికీ ఎంతోమంది కుక్కకాటుతో దీని బారినపడి, ప్రాణాలు కోల్పోతున్నారు. వీధి కుక్కలతోనే కాదు, పెంపుడు జంతువులతోనూ రేబిస్‌ సోకుతుంది. ఇటీవల పెంపుడు కుక్క కరవటం వల్ల తండ్రి, కొడుకులు మరణించిన ఘటన బాగా కలచివేసింది.

Updated : 09 Jul 2024 07:31 IST

టీకాలతో రేబిస్‌ను పూర్తిగా నివారించుకోవచ్చు. అయినా మనదగ్గర ఇప్పటికీ ఎంతోమంది కుక్కకాటుతో దీని బారినపడి, ప్రాణాలు కోల్పోతున్నారు. వీధి కుక్కలతోనే కాదు, పెంపుడు జంతువులతోనూ రేబిస్‌ సోకుతుంది. ఇటీవల పెంపుడు కుక్క కరవటం వల్ల తండ్రి, కొడుకులు మరణించిన ఘటన బాగా కలచివేసింది. వైద్యశాస్త్రం గణనీయంగా అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ కుక్కలు, పిల్లులు కరిచి మనుషులు చనిపోవడం ఎంత బాధాకరమో! దీనికి ప్రధాన కారణం సరైన అవగాహన లేకపోవటమే. కుక్కల వంటివి కరిచినప్పుడు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే రేబిస్‌ మరణాలను ఆపొచ్చు.

కుక్కలు కరవటం పెద్ద సమస్య. దీంతో సోకే రేబిస్‌ జబ్బు చాలా ప్రమాదకరమైంది. టీకాలు, తగు చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయానికీ దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రేబిస్‌ కారణంగా ఏటా 55వేల మంది మృత్యువాత పడుతున్నారని అంచనా. వీరిలో 36 శాతం మంది మనదేశానికి చెందినవారే. ప్రతి సంవత్సరం మనదగ్గర సుమారు 20వేల మంది రేబిస్‌తో చనిపోతున్నారు. ఆసుపత్రుల్లో నమోదు అవుతున్న రేబిస్‌ కేసులు, మరణాలను పరిశీలిస్తే 30 నుంచి 60 శాతం మంది పదిహేనేళ్ల లోపు పిల్లలే కావటం గమనార్హం. రేబిస్‌ మరణం అతి భయంకరమైంది. ఇందులో గొంతు మింగుడు పడదు. నీళ్లను చూస్తే భయం వచ్చేస్తుంది. తీవ్ర ఆందోళనతో గడగడ లాడుతుంటారు. మింగుడు పడకపోవడం వల్ల తినలేరు, తాగలేరు. జబ్బు తీవ్రమవుతున్నా స్పృహ కోల్పోరు. రేబిస్‌ బారినపడ్డవారికే కాదు, కుటుంబ సభ్యులకూ ఇదో అత్యంత భయంకరమైన అనుభవం. కాసింత జాగ్రత్త వహిస్తే దీన్ని తప్పించుకోవచ్చు.  

ఏంటీ రేబిస్‌?

ఇది ప్రధానంగా జంతువుల నుంచి సంక్రమించే ‘లిస్సా’ వైరస్‌తో వస్తుంది. ఈ వైరస్‌ జంతువుల లాలాజలంలో ఉంటుంది. పిచ్చి కుక్క కరిస్తే రేబిస్‌ వ్యాధి వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే కుక్కే కాదు, పిల్లి, నక్క, కోతి, గబ్బిలం వంటివి కరిచినా రేబిస్‌ జబ్బు వచ్చే అవకాశం ఉంది.

ఈ జంతువులు కరిచిన వారందరికీ రేబిస్‌ వస్తుందా?

రాదు. కరిచిన జంతువుకు రేబిస్‌ జబ్బు (పిచ్చి లక్షణాలు) ఉంటేనే ప్రమాదం పొంచి ఉంటుంది. వైరస్‌ ఒంట్లో ప్రవేశించిన తర్వాత 1-3 నెలల్లోపు ఎప్పుడైనా రేబిస్‌ రావొచ్చు. అయితే కొందరిలో మొదటి వారంలోపే రావొచ్చు. కొందరికి ఏడాది తర్వాతా రావొచ్చు. కాబట్టి కుక్క కరిచిన వెంటనే వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి.

టీకా ప్రక్రియ ఎలా ఉంటుంది.  

మొత్తం 5 ఇంజెక్షన్లు తీసుకోవాలి. కరిచిన రోజు ‘0’ మోతాదు.. ఆ తర్వాత 3, 7, 14, 28 రోజులలో మిగిలిన నాలుగు మోతాదుల ఇంజెక్షన్లు తీసుకోవాలి. వీటిని చేతి కండకు (జబ్బకు) ఇస్తారు. చిన్న పిల్లలకైతే తొడ ముందు భాగంలోని కండకు ఇస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులలో చర్మానికి టీకా ఇస్తారు.

గత సంవత్సరం వరకు మా కుక్కకి టీకా వేయించాం. ఈ సంవత్సరం వేయించలేదు. ఇప్పుడు కరిచింది ఏం చేయాలి?

అయినా తప్పకుండా టీకా తీసుకోవాల్సిందే.

కరవలేదు. కానీ గోళ్లతో గీరింది - రక్తం వచ్చింది. ఏం చేయాలి?

టీకా తీసుకోవాల్సిందే. కాలి గోళ్లను కుక్క నోట్లో పెట్టుకున్నప్పుడు లాలాజలం గోళ్లలో ఉండొచ్చు. లాలాజలంలో ఉన్న రేబిస్‌ కారక వైరస్‌ మన చర్మంలోని రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించొచ్చు. కాబట్టి తప్పకుండా టీకా వేయించుకోవాలి.

మొదటి రోజు మొత్తం ఎన్ని రకాల ఇంజెక్షన్లు చేయించుకోవాలి?

ఒక చేతికి రేబిస్‌ టీకా ఇస్తారు. టెటనస్‌ టీకా ఇవ్వాల్సి వస్తే రెండో చేతికి చేస్తారు. కరిచిన గాయాల వద్ద ‘ఇమ్యునో గ్లోబ్యులిన్‌’ ఇంజక్షన్‌ ఇస్తారు.

ప్రథమ చికిత్స ఎలా చేయాలి?

కుక్క కాటు గాయాన్ని సబ్బు, ధారగా పడుతున్న స్వచ్ఛమైన నీటితో శుభ్రంగా కడగాలి. గాయం వద్ద వైరస్‌ చాలాకాలం జీవించి ఉంటుంది. అక్కడ వృద్ధి చెందుతూ వస్తుంది. కాబట్టి కరిచిన వెంటనే గానీ ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు గానీ గాయాన్ని కనీసం 5 నిమిషాల సేపైనా కడగాలి. 10-15 నిమిషాల సేపు కడిగితే ఇంకా మంచిది. గాయాన్ని నేరుగా చేత్తో ముట్టుకోవద్దు. చేతులకు గ్లవుజులు వేసుకుంటే మంచిది. కడిగిన తర్వాత గాయాన్ని పొడిగా తుడిచి యాంటీసెప్టిక్‌ లోషన్లు రాసి, అలాగే వదిలేయాలి. గాయం పెద్దగా ఉన్నా కూడా సాధ్యమైనంతవరకూ కుట్లు వేయకపోవటమే ఉత్తమం. ఒకవేళ కుట్లు తప్పనిసరిగా వేయాల్సి వస్తే వదులుగానే వేయాలి.

ఎవరిదో కుక్క కరిచి వెళ్లిపోయింది. మళ్లీ కనిపించలేదు. ఏం చేయాలి?

కచ్చితంగా టీకా వేయించుకోవాలి.

కరిస్తే ఏం చేయాలి?

కుక్కలు, పిల్లుల వంటి జంతువులలో ఏది కరిచినా యాంటీ రేబిస్‌ టీకా వేయించుకోవాలి. కేవలం టెటనస్‌ ఇంజక్షన్‌ తీసుకుంటే సరిపోదు. రేబిస్‌ కారక వైరస్‌ నాడులను చేరుకొని, గంటకు 3 మిల్లీమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ మెదడుకు వ్యాపిస్తాయి. క్రమంగా రేబిస్‌ లక్షణాలు మొదలవుతాయి. కాబట్టి కరిచిన తక్షణం చికిత్స తీసుకోవాలి. వైరస్‌ నాడులకు చేరుకోకమందే చికిత్స ఆరంభించటం అన్నింటికన్నా ముఖ్యమని గుర్తించాలి.

కుక్కలు, పిల్లుల వంటి వాటి కోరలు చేతికి తగలటం.. పుండ్లు, పగుళ్ల వంటివి లేని చోట నాలుకతో నాకటం వంటి సందర్భాల్లో ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆ భాగాన్ని శుభ్రం చేసుకుంటే చాలు. రక్తస్రావం కాకుండా కేవలం పైపైన గీసుకుపోయినప్పుడు వెంటనే పద్ధతి ప్రకారం పుండును శుభ్రం చేయాలి. యాంటీ రేబిస్‌ టీకాలు తీసుకోవాలి. ఇక కోరలు దిగటం, చర్మం చీరుకుపోవటం, రక్తస్రావంతో కూడిన గాయాలు అవటం.. లేదా శరీరం మీద పుండ్లు ఉన్నచోట కుక్కలు నాకటం, చర్మం మీద గాయాలకు కుక్క చొంగ తగలటం జరిగితే తీవ్రంగా పరిగణించాలి.

గర్భిణిలు, బాలింతలు, పసి పిల్లలు రేబిస్‌ టీకా తీసుకోవచ్చా?

నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

ఎవరు వేయించుకోనవసరం లేదు?

పెంచుకుంటున్న కుక్కకి గాని, పిల్లికి గాని క్రమబద్ధంగా యాంటీ రేబిస్‌ టీకా ఇప్పిస్తున్నట్టయితే ఆ జంతువు తోక తొక్కినప్పుడో, కాలు తొక్కినప్పుడో కరిస్తే, పిచ్చి లక్షణాలు ఏమీ లేకుండా ఉంటే 10 రోజుల పాటు ఆ జంతువును గమనిస్తూ ఉండాలి. 10 వ రోజు ఆ జంతువు ఆరోగ్యంగా ఉంటే యాంటీ రేబిస్‌ టీకా అవసరం లేదు.

కుక్క కరిచిన వారు పథ్యం చేయాలా?

ఎటువంటి పథ్యాలూ అవసరం లేదు.

టీకా వేయించుకున్నాక ఎప్పటి నుండి రేబిస్‌ వ్యాధికి రక్షణ ఉంటుంది?

రేబిస్‌ టీకాలు 7 వ రోజు నుంచీ పని చేయటం మొదలెడతాయి. తొలి 7 రోజుల వరకు మనకు రేబిస్‌ వ్యాధి నుంచి రక్షణ ఉండదు. కాబట్టి మొదటి రోజే ‘ఇమ్యునో గ్లోబ్యులిన్‌’ ఇంజక్షన్‌ కూడా చేయించుకోవాలి. బరువును బట్టి దీని మోతాదును నిర్ణయిస్తారు. మొదటి ఏడు రోజులు ‘ఇమ్యునో గ్లోబ్యులిన్‌’ రక్షణగా ఉంటుంది. ఆ తర్వాత టీకాతో రక్షణ లభిస్తుంది.

కరిచిన కుక్కనో, పిల్లినో చంపేశారు లేదా అది ఏ కారు కిందో పడి చనిపోయింది. ఏం చేయాలి?

టీకా వేయించుకోవాల్సిందే. పిచ్చి పట్టిన జంతువు 10 రోజులలో చనిపోతుంది. ఈ లోపే ప్రమాదంలో చనిపోతే దానికి పిచ్చి ఉందో లేదో మనకు తెలియదు. అందువల్ల దాన్ని పిచ్చి కుక్కే అనుకుని వ్యాక్సిన్‌ వేయించుకోవడం సురక్షితం.

మా పెంపుడు కుక్కకు క్రమబద్ధంగా రేబిస్‌ టీకా చేయించాం. పొరపాటున వేలు కొరికింది. ఆ మర్నాడు ఆక్సిడెంట్లో చనిపోయింది. అప్పుడు ఏం చెయ్యాలి?

టీకా ఐదు మోతాదులూ వేయించుకోవడమే మంచిది.

మరి కరిచిన జంతువుకు రేబిస్‌ వ్యాధి ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

జంతువులకు రేబిస్‌ సోకినా ఆ విషయం మనకు తెలియకపోవచ్చు. వాటిల్లో పిచ్చి లక్షణాలు కనపడొచ్చు, కనిపించకపోవచ్చు. అందువల్ల ఏ కుక్కలు కరిచినా మన జాగ్రత్తలో మనముండాలి.

అందరూ టీకాలు వేయించుకోవాల్సిందేనా?

అక్కర్లేదు. క్రమబద్ధంగా రేబిస్‌ టీకా వేయించిన పెంపుడు జంతువు కరిస్తే టీకా తీసుకోవాల్సిన అవసరం లేదు.

బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలా?

పాత తరం టీకాను ఎక్కువ మొత్తంలో (3-5 ఎం.ఎల్‌) ఇచ్చేవారు. వీటిని 7 నుంచి 14 వరకూ ఇవ్వాల్సి వచ్చేది. అందుకే బొడ్డు చుట్టూ ఇచ్చేవారు. అరుదుగా వీటితో ప్రమాదకరమైన దుష్ప్రభావాలూ వస్తుండేవి. ఇప్పుడు తయారుచేస్తున్న ఆధునిక టీకాలను తక్కువ మోతాదులోనే (1 ఎం.ఎల్‌) ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల చేతి కండకు చేస్తారు. ఇవి మరింత సురక్షితమైనవి కూడా.

మా పెంపుడు కుక్కకు క్రమబద్ధంగా రేబిస్‌ టీకా చేయించాం. అకారణంగా కరిచింది. ఏం చేయాలి?

తప్పకుండా టీకాలు తీసుకోవటం ఆరంభించాలి. కుక్కను కట్టి వేసి 10 రోజుల పాటు పరిశీలించాలి. ఈ 10 రోజులలో దానికి రేబిస్‌ ఉందో లేదో తెలిసిపోతుంది.  

ఒకసారి టీకాలను పూర్తి షెడ్యూల్‌ చేయించుకున్న వారికి మళ్లీ ఎప్పుడన్నా కుక్క గానీ, పిల్లి గానీ కరిస్తే టీకా తీసుకోవాలా?

తీసుకోవటమే మంచిది. రెండు మోతాదులు (0, 3) వేయించుకుంటే చాలు.

కరవక ముందే వాక్సినేషన్‌ చేయించుకోవచ్చా?

ప్రజలందరూ ముందుగానే రేబిస్‌ టీకాను తీసుకోవటం అనవసరం. అయితే కుక్కలు, పిల్లులతో వ్యవహరించే పశువుల డాక్టర్లు, పశువుల ఆసుపత్రుల సిబ్బంది, పోస్ట్‌మెన్లు, టీకాలు తయారుచేసే సిబ్బంది వేయించుకోవచ్చు. వీళ్లు 0, 7, 21 రోజులలో మూడు మోతాదులు తీసుకుంటే సరిపోతుంది. 

వీధి కుక్కలకూ.. ఇప్పుడు పెంపుడు జంతువులకు అందరూ టీకాలు వేయిస్తున్నారు. అలాగే వీధి కుక్కలకూ టీకాలు ఇప్పించటం మంచిది.  స్థానిక ప్రభుత్వ సంస్థలు ఈ బాధ్యత చేపట్టాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు