అశ్లీల చిత్రాలు తరచూ చూస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి!

అశ్లీల చిత్రాలు తరచుగా చూస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి. ఇది పురుషుల్లో శృంగారంపై ఆసక్తి తగ్గటానికి, స్తంభనలోపానికి దారితీయొచ్చు!

Updated : 28 May 2023 15:40 IST

అశ్లీల చిత్రాలు తరచుగా చూస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి. ఇది పురుషుల్లో శృంగారంపై ఆసక్తి తగ్గటానికి, స్తంభనలోపానికి దారితీయొచ్చు! అశ్లీల చిత్రాలను చూడటం కూడా ఒకరకంగా కొకైన్‌ వంటి మాదక ద్రవ్యాల వ్యసనం లాంటిదే అనుకోవచ్చు. మాదక ద్రవ్యాలను తీసుకున్నప్పుడు మన మెదడులో ‘హాయి భావన’ కలిగించే భాగాలు ప్రేరేపితమవుతుంటాయి. అందుకే మాదక ద్రవ్యాలను మళ్లీ మళ్లీ తీసుకోవాలని మనసు తహతహలాడిపోతుంటుంది. అయితే చిక్కేటంటే.. ఒకసారి వీటికి అలవాటుపడితే క్రమంగా వాటి ప్రభావాన్ని ‘తట్టుకునే’ సామర్థ్యమూ పెరుగుతూ వస్తుండటం. మొదట్లో మాదిరిగా హాయి కలగదు. అందువల్ల తరచుగా.. మరింత ఎక్కువ మోతాదులో మాదక ద్రవ్యాలను తీసుకోవటమూ మొదలవుతుంది.

అశ్లీల చిత్రాలను తరచుగా చూసేవారిలోనూ ఇలాగే జరుగుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. అశ్లీల చిత్రాలను చూసినప్పుడు కూడా మాదక ద్రవ్యాలను తీసుకున్నప్పుడు మెదడులో ప్రేరేపితమయ్యే భాగాలే ప్రేరేపితమవుతాయి. వీటిని తరచుగా చూసేవారిలో క్రమంగా వాటి ప్రభావాన్ని ‘తట్టుకోవటం’ సంభవిస్తోందని.. దీంతో శృంగార స్పందనలు, శృంగారంపై ఆసక్తి తగ్గుతూ వస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇది నిజ జీవితంలో శృంగారానుభూతిపై విపరీత ప్రభావం చూపుతుండటం గమనార్హం. నిజంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా ‘అలాంటి దృశ్యాలే’ మనసులో కదలాడుతుండటం, సహజ శృంగారానికీ వాటికీ పోలిక లేకపోవటం మూలంగా చాలామంది అసంతృప్తికి, ఆందోళనలకు లోనవుతున్నారని పరిశోధకులు వివరిస్తున్నారు. కాబట్టి అశ్లీల చిత్రాలకు దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.

నిద్ర.. వీర్యానికి బాసట

నిద్ర తక్కువైతేనే కాదు..ఎక్కువైనా ఇబ్బందే. అందుకే రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందలాడే లేవాలని చెబుతుంటారు. ఇది శాస్త్రీయంగానూ రుజువైంది. నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు చైనా పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా కొందరికి 6 గంటలు, అంతకన్నా తక్కువసేపు.. మరికొందరికి 7-8 గంటల సేపు.. ఇంకొందరికి 9 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలని సూచించారు. అనంతరం వీర్యకణాల సంఖ్య, రూపు, కదలికలను పరిశీలించారు. వీరందరిలో కెల్లా 7-8 గంటల సేపు నిద్రపోయినవారిలో వీర్యం నాణ్యత బాగా ఉంటున్నట్టు తేలింది. 6 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు పడుకునేవారిలో వీర్యం నాణ్యత బాగా పడిపోవటం గమనార్హం.

ఆలస్యంగా నిద్రపోవటం, తగినంత విశ్రాంతి లేకపోవటం చాలా హానికరం. ఎందుకంటే వీరిలో ఆరోగ్యకరమైన వీర్యకణాలను దెబ్బతీసే ప్రోటీన్‌ (యాంటీస్పెర్మ్‌ యాంటీబాడీ) స్థాయులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సంతాన సమస్యలతో బాధపడే పురుషులు రాత్రిపూట తగినంత సేపు నిద్రపోవటం, అదీ త్వరగానే పడుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పడుకోవటానికి కనీసం 2 గంటల ముందే భోజనం చేయటం.. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్ల వంటివి కనీసం 45 నిమిషాల ముందే కట్టేయటం.. నిద్ర పోవటానికి ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం.. గదిలో ప్రకాశవంతమైన లైట్లు లేకుండా చూసుకోవటం.. మనసుకు నచ్చిన సంగీతాన్ని వినటం.. వదులుగా ఉండే దుస్తులు ధరించటం..వంటి వాటితో నిద్ర బాగా పట్టేలా చూసుకోవచ్చు.

ఈ ఆహారం మంచిదట

బాదం, జీడిపప్పు, అక్రోట్ల వంటి గింజపప్పులు (నట్స్‌) చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల బరువు అదుపులో ఉండటం దగ్గర్నుంచి ఉత్సాహం, మేధోశక్తి, మూడ్‌ పుంజుకోవటం వరకూ ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. ఇవి శృంగార జీవితం మెరుగుపడటానికీ తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. రోజుకు 60 గ్రాముల గింజపప్పులు తినేవారిలో శృంగార ఆసక్తి పెరగటంతో పాటు మెరుగైన భావప్రాప్తిని పొందుతుండటం గమనార్హం.

తాజా పండ్లు, కూరగాయలు తక్కువగా ఉండే పాశ్చాత్య ఆహార అలవాట్లు గల కొందరిపై పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరికి తమ మామూలు ఆహారం, మరికొందరికి బాదం, అక్రోట్లు, హేజెల్‌ నట్స్‌ కూడా తినమని సూచించారు. ఇలా 14 వారాలు చేసిన తర్వాత పరిశీలించగా.. గింజపప్పులు జతచేసినవారిలో శృంగారాసక్తి, భావప్రాప్తి మెరుగుపడినట్టు తేలింది. గింజపప్పుల్లో ప్రొటీన్‌, పీచు, అత్యవసర విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి.

ఇవన్నీ ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడేవే. వీటిల్లో ఫాలీఫెనాల్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లూ ఉంటాయి. ఇవి స్తంభనలోపం తగ్గటానికే కాకుండా గుండె రక్తనాళ వ్యవస్థకూ మేలు చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారానికి గింజపప్పులనూ జోడించినట్టయితే అంగ స్తంభన, శృంగారాసక్తి మెరుగయ్యే అవకాశమున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని వివరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని