Diabetes: చక్కెర వ్యాధికి చెక్‌ పెట్టేద్దాం!

ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. మధుమేహం (Diabetes) విషయంలో ప్రకృతి వైద్యం ఇలాగే వ్యవహరిస్తుంది.

Updated : 14 Jun 2022 16:46 IST

ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. మధుమేహం (Diabetes) విషయంలో ప్రకృతి వైద్యం ఇలాగే వ్యవహరిస్తుంది. జీవనశైలితో ముడిపడిన వ్యాధిని జీవనశైలిని మార్చుకోవటం ద్వారానే సరిదిద్దుకోవచ్చని సూచిస్తుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని సుఖీభవ వెల్‌నెస్‌ సెంటర్‌ మధుమేహ చికిత్సలో ఈ సూత్రాన్నే అనుసరిస్తోంది.

మధుమేహం(Diabetes) జబ్బు కాదు. ఒక అవ్యవస్థ (డిజార్డర్). మన జీవనశైలితో గతి తప్పిన శరీర వ్యవస్థల ఫలితం. ‘కొందరికి జన్యువుల మూలంగా మధుమేహం రావొచ్చు గానీ చాలావరకిది మన జీవనశైలితో ముడిపడిందే. వంశపారంపర్యంగా వచ్చే మధుమేహాన్ని టైప్-1 రకం అంటారు. ఇది చిన్న వయసులోనే వస్తుంది. పెద్దయ్యాక మొదలయ్యేది టైప్-2  రకం. మధుమేహుల్లో ఎక్కువమంది ఇలాంటివారే. దీనికి మూలం అస్తవ్యస్తమైన మన ఆహార, విహారాలే’ అంటారు ‘సుఖీభవ’ నిర్వాహకురాలు డాక్టర్  అర్చన. ప్రస్తుతం అందరివీ ఉరుకుల పరుగుల జీవితాలే. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ అనుక్షణం పని ఒత్తిళ్లతో సతమతమయ్యేవారెందరో. ఏమాత్రం శారీరక శ్రమలేని పనులు పెరిగిపోవటం, వేళకు భోజనం చేయకపోవటం, కంటి నిండా నిద్రలేకపోవటం వంటివన్నీ శరీరం మీద విపరీత ప్రభావం చూపేవే. ఎప్పుడో అప్పుడంటే ఇబ్బందేమీ ఉండకపోవచ్చు దీర్ఘకాలంగా ఇలాంటి జీవనశైలి గలవారిలో గ్రంథుల వ్యవస్థ పనితీరు అస్తవ్యస్తమవుతుంది. మన కణాలన్నింటికీ శక్తి అవసరం. ఇది మనం తినే ఆహారంలోని గ్లూకోజు నుంచే లభిస్తుంది. దీన్ని కణాల్లోకి వెళ్లేలా చేసేది ఇన్సులిన్ . కొందరిలో ఇన్సులిన్  తగినంతగా ఉత్పత్తి కాకపోవచ్చు. ఉత్పత్తి అయినా కణాలు ఇన్సులిన్‌కు స్పందించకపోవచ్చు. దీంతో గ్లూకోజు కణాల్లోకి వెళ్లదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజు స్థాయులు అదేపనిగా పెరిగిపోతుంటాయి. ఇదే మధుమేహం. మధుమేహంతో పెద్ద చిక్కు- గుండెజబ్బులు, నాడులు దెబ్బతినటం, పాదాల మీద పుండ్లు పడటం, ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలకు దారితీయటం. అందుకే దీన్ని నియంత్రణలో పెట్టుకోవటం ఎంతో అవసరం. ఇందుకు ప్రకృతి వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఆహారమే ఔషధం!

‘‘మధుమేహ (Diabetes)చికిత్సలో జీవనశైలిని సరిదిద్దటం చాలా కీలకమైన విషయం. ఇందులో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మధుమేహానికి ఆహారమే ఔషధం’’ అంటారు డాక్టర్  అర్చన. తమ సెంటర్ లో ఇందుకోసం ప్రత్యేకమైన ఆహార పద్ధతులు రూపొందించామని చెబుతారు. ముఖ్యంగా ల్యాక్టోవెజిటేరియన్‌ డైట్ బాగా ఉపయోగపడుతుందంటారు. ఇందులో తాజా ఆకుకూరలు, పుల్లటి పండ్లు, చీజ్ వంటి పాల పదార్థాలతో కూడిన ఆహారం ఇస్తారు. అలాగే పొట్టుతీయని గోధుమ పిండితో చేసిన చపాతీలూ ఎంతో మేలు చేస్తాయి. ఆహార పద్ధతులనే కాదు.. ఉదయం నుంచీ రాత్రి వరకూ నీళ్లు తాగే విధానం, యోగా, ప్రాణాయామం, వ్యాయామం వంటి వాటినీ క్రమశిక్షణతో పాటించేలా సెంటర్‌లో తర్ఫీదు ఇస్తారు. రోజును ఉదయం పూట నీళ్లు తాగటంతో ఆరంభించటం మధుమేహులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ‘ఇది రక్తంలోని విషతుల్యాలు బయటకు వెళ్లిపోవటానికీ... గ్లూకోజు, రక్తపోటు నియంత్రణలో ఉండటానికీ దోహదం చేస్తుంది’ అంటారు డాక్టర్ అర్చన. నీళ్లు తాగిన తర్వాత బాదం, పిస్తా వంటి గింజపప్పులను తీసుకునేలా చూస్తారు. మధుమేహులకు ఆహారం విషయంలోనే కాదు.. శారీరక శ్రమ, వ్యాయామం మీదా శ్రద్ధ అవసరం. ఇవి కణాల్లోకి గ్లూకోజు సరిగా వెళ్లటానికి తోడ్పడతాయి. అందుకే ప్రకృతి వైద్యం యోగాసనాలకు చాలా ప్రాధాన్యమిస్తుంది. మధుమేహులకు అర్ధ మత్స్యేంద్రాసనం, పశ్చిమోత్తానాసనం బాగా ఉపయోగపడతాయి. ఇక ప్రాణాయామంలో కపాలభాతి చాలా మేలు చేస్తుంది. దీన్ని రోజుకు రెండు మూడు సార్లు చేయాల్సి ఉంటుంది. ‘సుఖీభవ’లో నిపుణులు వీటిని సాధన చేయిస్తారు. వీటితో పాటు నడక వంటి వ్యాయామాలూ చేయాల్సి ఉంటుంది.

డొక్క శుద్ధి!

గతి తప్పిన జీవనశైలి మూలంగా పొట్టలో విషతుల్యాలు పేరుకుపోతాయి.(Diabetes) నిజానికి అన్ని జబ్బులకూ ఇదే మూలమన్నది ప్రకృతి వైద్యం సిద్ధాంతం. అందుకే మధుమేహులకు పొట్ట, పేగులు శుభ్రమయ్యేలా సెంటర్‌లో ప్రత్యేక చికిత్స చేస్తారు. ఇందుకు ఎనీమా బాగా ఉపయోగపడుతుంది. ‘‘ఆయా వ్యక్తుల అవసరాన్ని బట్టి త్రిఫల చూర్ణం, ఇతర ప్రత్యేకమైన మూలికలతో ఎనీమా ఇస్తుంటాం. దీంతో విషతుల్యాలు త్వరగా, బాగా బయటకు పోతాయి’’ అని డాక్టర్ అర్చన చెబుతారు. అంతేకాదు, తమ దగ్గర మధుమేహుల కోసం ప్రత్యేకంగా ఇన్‌ ఫ్రారెడ్ కిరణాల చికిత్స సదుపాయమూ ఉందంటున్నారు. ఈ కిరణాలు ఒంట్లోంచి విషతుల్యాలు బయటకు వెళ్లేలా తోడ్పడతాయి. ఇలా 10, 15 రోజుల పాటు చికిత్స, శిక్షణ తీసుకొని.. ఇంటికి వెళ్లిన తర్వాతా విడవకుండా పాటిస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పూర్తిగా మధుమేహాన్ని వెనక్కి మళ్లించలేకపోవచ్చు గానీ గ్లూకోజు స్థాయులను (Diabetes)మాత్రం కచ్చితంగా తగ్గించుకోవచ్చు. దీంతో ఇన్సులిన్, మందుల మోతాదులనూ తగ్గించుకోవచ్చు. కేవలం చికిత్సగానే కాదు, మధుమేహ నివారణకూ ప్రకృతి వైద్యం ఉపయోగపడుతుంది. అంటే వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశం గలవారు త్వరగా దీని బారినపడకుండా కాపాడుకోవచ్చన్నమాట. కళ్ల నుంచి కాళ్ల వరకు.. మెదడు నుంచి మూత్ర పిండాల వరకూ అన్నింటినీ దెబ్బతీసే మధుమేహానికి తేలికైన, సరళమైన ప్రకృతి వైద్యం అందుబాటులో ఉండగా ఇక చింతించాల్సిన పనేముంది?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని