రక్తపోటు మామూలుగా ఉన్నా ఉప్పుతో చేటే

అధిక రక్తపోటుతో గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతుందనే విషయం తెలిసిందే. అయితే రక్తపోటు మామూలుగా ఉన్నా ఉప్పు ఎక్కువగా తినేవారికి గుండె, మెదడు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు స్వీడన్‌ పరిశోధకులు గుర్తించారు.

Published : 18 Apr 2023 00:23 IST

ధిక రక్తపోటుతో గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతుందనే విషయం తెలిసిందే. అయితే రక్తపోటు మామూలుగా ఉన్నా ఉప్పు ఎక్కువగా తినేవారికి గుండె, మెదడు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు స్వీడన్‌ పరిశోధకులు గుర్తించారు. అధిక రక్తపోటు తలెత్తటానికి ముందే ఉప్పుతో రక్తనాళాలు దెబ్బతింటున్నట్టు ఫలితాలు సూచిస్తున్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన జోనాస్‌ వూపియో చెబుతున్నారు. ఉప్పుతో రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెకు చేటు చేస్తుంది. కానీ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటంలో ఉప్పు పాత్ర గురించి పెద్దగా తెలియదు. అందుకే స్వీడన్‌ పరిశోధకులు తొలిసారిగా అధిక ఉప్పు వాడకం, రక్తనాళాల్లో పూడికల మీద అధ్యయనం చేశారు. ఈ రెండింటి మధ్య సంబంధం ఉండటమే కాదు.. ఉప్పు ఎంత ఎక్కువగా తింటే పూడికల ముప్పు అంత ఎక్కువగా పెరుగుతున్నట్టూ గుర్తించారు. అధిక రక్తపోటు లేకపోయినా ఉప్పు అధికంగా వాడేవారిలో పూడికల ఆనవాళ్లు కనిపిస్తుండటమే దీనికి నిదర్శనం. అంటే ఉప్పు విషయంలో అధిక రక్తపోటు, గుండె జబ్బులు గలవారే కాదు.. అంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నమాట. రోజుకు ఒక చెంచా కన్నా ఎక్కువ ఉప్పు తినొద్దన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు. నిజానికి ఎంత ఉప్పు తింటున్నామనేది అంచనా వేసుకోవటం ఎవరికైనా కష్టమే. భోజనం చేసేటప్పుడు విడిగా ఉప్పు వేసుకోకుండా చూసుకున్నా చాలావరకు తగ్గించుకోవచ్చు. ఉప్పుకు బదులు రుచి కోసం నిమ్మకాయ రసం వంటివి వాడుకున్నా మేలే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని