కాలుష్యంతో గర్భిణుల్లో ఫ్లూ

వాయు కాలుష్యం బారినపడకుండా గర్భిణులను కాపాడుకోవటం ఎంతైనా అవసరమని తాజా అధ్యయనం సూచిస్తోంది. గాలిలోని అతి సూక్ష్మ రేణువుల (యూఎఫ్‌పీలు) మూలంగా గర్భిణుల్లో శ్వాసకోశ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పెరుగుతున్నట్టు తేలటమే దీనికి కారణం.

Published : 02 May 2023 00:38 IST

వాయు కాలుష్యం బారినపడకుండా గర్భిణులను కాపాడుకోవటం ఎంతైనా అవసరమని తాజా అధ్యయనం సూచిస్తోంది. గాలిలోని అతి సూక్ష్మ రేణువుల (యూఎఫ్‌పీలు) మూలంగా గర్భిణుల్లో శ్వాసకోశ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పెరుగుతున్నట్టు తేలటమే దీనికి కారణం. వాయు కాలుష్యం ఊపిరితిత్తుల్లోని రక్షణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల ముప్పూ పెరుగుతుంది. మామూలుగానే గర్భిణులకు తీవ్ర ఫ్లూ ముప్పు ఎక్కువ. అయినా కూడా వాయు కాలుష్యం, ఇన్‌ఫ్లూయెంజా మధ్య సంబంధంపై ఇప్పటివరకూ పెద్దగా అధ్యయనాలు జరగలేదు. దీనిపై లోతుగా దృష్టి సారించాలని.. తల్లుల ఆరోగ్యం మీద స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో పడే ప్రభావాలను నివారించటానికిది అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. గర్భిణుల్లో రక్తం మరింత ఎక్కువగా పంప్‌ కావటం.. శ్వాసించేటప్పుడు ఎక్కువ మొత్తంలో గాలిని తీసుకోవటం, వదలటం.. పిండాన్ని రక్షించటానికి తోడ్పడే కొన్ని రోగనిరోధక కణాల్లో మార్పులు సంభవించటం వంటివన్నీ వీరిలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పెరగటానికి దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. ఫ్లూ టీకా సమర్థమైంది, సురక్షితమైంది అయినప్పటికీ గర్భిణుల్లో దీని సామర్థ్యం 50% కన్నా తక్కువగానే ఉంటుంది. అందువల్ల టీకా తీసుకున్నప్పటికీ వీరికి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఎక్కువగానే ఉంటుందని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది అకాల మరణాల్లో తొమ్మిదింటికి కాలుష్యమే కారణమవుతోంది. వాయు మిశ్రమాలు, అతి సూక్ష్మ రేణువులు ఎంతోమందికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యంతో ప్రమాదం ఎక్కువగా గలవారిని గుర్తించి, కాపాడుకోవాల్సిన అవసరముందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్లూ, యూఎఫ్‌ఏలు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో గర్భిణులను కాపాడుకోవటానికి కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని