LifeSpan: ఆయుష్షు ఆహారం!

ఎంతసేపూ ఆరోగ్యం కోసమేనా? ఆయుష్షు కోసమూ తినండి! ఇప్పుడు ఆయుష్షును పెంచే ఆహార పద్ధతులు, పదార్థాల మీద మక్కువ పెరుగుతోంది.

Updated : 11 Apr 2023 11:12 IST

ఎంతసేపూ ఆరోగ్యం కోసమేనా? ఆయుష్షు కోసమూ తినండి! ఇప్పుడు ఆయుష్షును పెంచే ఆహార పద్ధతులు, పదార్థాల మీద మక్కువ పెరుగుతోంది. అలాంటి వాటిపై ఓ కన్నేద్దాం.


తక్కువ ప్రొటీన్‌

కండరాల నిర్మాణంలో, కండరాల మోతాదులో ప్రొటీన్‌ పాత్ర కీలకం. వృద్ధాప్య ప్రక్రియ సజావుగా సాగటానికి కండర మోతాదు తగినంత ఉండటం చాలా ముఖ్యం. అయితే ప్రొటీన్‌ శరీరంలో కొన్ని ఉపయోగకర, పునరుత్తేజిత మార్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తుండటం గమనార్హం. వందేళ్లకు పైగా జీవించేవారు నివసించే కొన్ని ప్రాంతాల్లో చేపట్టిన అధ్యయనమూ ఇదే సూచిస్తోంది. మిగతా ప్రపంచంతో పోలిస్తే ఈ ప్రాంతాల్లో ప్రొటీన్‌.. ముఖ్యంగా మాంసాహార ప్రొటీన్‌ తక్కువగా తినటం విశేషం. కొందరు పరిశోధకులైతే మాంసాహార ప్రొటీన్‌ను పూర్తిగా మానెయ్యటమే మంచిదనీ సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో ఆయుష్షు పెరగటానికిది పెద్దగా ఉపయోగపడదనే భావిస్తున్నారు.  


చిక్కుళ్లు

వందేళ్లకు పైగా జీవించినవారి చాలామంది ఆహారంలో చిక్కుడు (బీన్స్‌) జాతికి చెందిన పదార్థాలు ప్రధానంగా ఉండటం విశేషం. వీరంతా సోయాబీన్స్‌ దగ్గర్నుంచి ఉలవల వరకు చాలారకాల బీన్స్‌, పప్పులు తింటున్నారని తేల్చారు. ఏజియాన్‌ సముద్రంలోని చిన్న ద్వీపమైన ఇకారియా వాసులు తవుడుతో కూడిన ధాన్యాలు, బంగాళాదుంపలు, ఆలివ్‌ నూన్‌, పండ్లు, కూరగాయలతో పాటు బీన్స్‌ ఎక్కువగా తింటున్నారని గుర్తించారు. మధ్యధరా ఆహార పద్ధతి మాదిరిగానే ఇదీ జీవనకాలాన్ని నాలుగేళ్లకు పైగా పెంచుతుందని కనుగొన్నారు.


కణ ప్రక్రియల మీదా దృష్టి  

ఆయుష్షును పెంచే ఆహారం విషయంలో కణస్థాయి నుంచి ఆలోంచించటం మంచిదనేది మరికొందరి వాదన. అందుకే కణ స్థాయి ప్రక్రియలను ఉత్తేజితం చేసే రసాయనాలతో కూడిన పదార్థాల మీద దృష్టి సారిస్తున్నారు. అలాంటి వాటిల్లో కొన్ని ఇవీ..

* ఎర్ర ఉల్లిగడ్డలో క్వెర్‌సెటిన్‌ అనే రసాయనం ఉంటుంది. ఇది వార్ధక్య (సెనిసెంట్‌) కణాలను సమర్థంగా తగ్గిస్తున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వార్ధక్య కణాలతో ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఇవి విభజన, వృద్ధి చెందే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అయినా రోగనిరోధక వ్యవస్థ వీటిని తొలగించదు. దీంతో వార్ధక్య కణాలు అలా తిరుగాడుతుంటాయి. అలాగని ఊరికే ఉండవు. వయసుతో పాటు ముంచుకొచ్చే అల్జీమర్స్‌, కీళ్లవాతం, క్యాన్సర్ల వంటి సమస్యలతో ముడిపడిన వాపుకారక రసాయనాలను విడుదల చేస్తుంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

* పసుపు సైతం మేలు చేస్తుంది. దీనిలోని కర్‌క్యుమిన్‌ దీర్ఘకాల వాపుప్రక్రియను తగ్గిస్తున్నట్టు చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. క్యాన్సర్ల దగ్గర్నుంచి అల్జీమర్స్‌ వరకూ రకరకాల సమస్యలకు కణస్థాయిలో తలెత్తే వాపుప్రక్రియే బీజం వేస్తోందని గట్టిగా భావిస్తున్నారు.

* రోజుకు రెండు, మూడు కప్పులు కాఫీ తాగితే ఆయుష్షు పెరుగుతున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. వీరికి గుండెజబ్బులు తలెత్తే ముప్పూ తగ్గుతున్నట్టు బయటపడింది.

* దానిమ్మగింజల్లో యూరోలితిన్‌ ఎ అనే రసాయనం దండిగా ఉంటుంది. ఇది కణాల శక్తి కేంద్రమైన మైటోకాండ్రియా పనితీరును మెరుగు పరుస్తుంది. దానిమ్మగింజల రసంతో ఈగల ఆయుష్షు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వృద్ధులకు నాలుగు నెలల పాటు రోజుకు 1,000 మి.గ్రా. యూరోలితిన్‌ ఎ ఇవ్వగా కండరాల సామర్థ్యం గణనీయంగా మెరుగైనట్టూ బయటపడటం విశేషం.

* పిస్తా, బాదం వంటి గింజపప్పులు (నట్స్‌) సైతం జీవనకాలం పెరగటానికి తోడ్పడతాయి. పరిశోధకులు 30 ఏళ్ల పాటు 1.20 లక్షల మంది ఆహార పద్ధతులను పరిశీలించి.. రోజూ గింజపప్పులు తినేవారికి మరణించే ముప్పు 20% తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని