ఉక్కు పిండాలే! కావాలి
ఇది జాతీయ పోషణ మాసం
ఇనుప కండలు, ఉక్కు నరాలు, అంతే గట్టి మనసు! ఇలాంటి యువతతోనే సుదృఢ జాతి నిర్మాణం సాధ్యమన్నది స్వామి వివేకానంద ఉద్బోధ. ఆయన ఉద్దేశం ఏదైనప్పటికీ- ఆరోగ్యపరంగా బలమైన సమాజ నిర్మాణంలో ఇనుము (ఐరన్) నిజంగానే కీలకపాత్ర పోషిస్తుంది!
శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకాల్లో అతి ముఖ్యమైన ఐరన్- శరీర పటుత్వానికే కాదు, మానసిక బలానికీ ఎంతగానో తోడ్పడుతుంది. బాల్యం నుంచే.. ఇంకా చెప్పాలంటే తల్లి కడుపులో ఉన్నప్పట్నుంచే భావి జీవితానికి, వ్యక్తిత్వానికి మంచి బాటలు పరుస్తుంది. ఒకవైపు కణాలన్నింటికీ నవోత్తేజాన్ని అందిస్తూనే.. మరోవైపు మేధస్సునూ, తెలివితేటలనూ ఇనుమడింపజేస్తుంది. ప్రవర్తన సమస్యల బారిన పడకుండానూ కాపాడుతుంది. జాతీయ పోషణ మాసం (సెప్టెంబరు) సందర్భంగా ఐరన్ ప్రాముఖ్యత, ఆవశ్యకతపై సమగ్ర కథనం ఈ వారం మీకోసం.
పిట్ట కొంచెం, కూత ఘనం అంటారు. ఇది సూక్ష్మ పోషకాలకు అతికినట్టు సరిపోతుంది. శరీరానికి అతి తక్కువ మోతాదుల్లో అవసరమయ్యేవే అయినా ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు. కణాల వృద్ధి, ఎంజైమ్‌ల తయారీ, జీవ క్రియల దగ్గర్నుంచి జన్యు వ్యక్తీకరణ, రోగనిరోధక వ్యవస్థ బలోపేతం వరకూ ఎన్నెన్నో పనుల్లో పాలు పంచుకుంటాయి. మెదడు బరువు, సైజు తగినంత ఉండటానికి.. అది సాఫీగా పనిచేయటానికీ సూక్ష్మ పోషకాల పాత్రే కీలకం. మనదేశంలో సుమారు 40% మంది పిల్లలు పోషణలోపంతో బాధపడుతున్నారని అంచనా. పోషణలోపం అనగానే ప్రొటీన్లు, పిండి పదార్థాలు తగినంత లభించకపోవటమే గుర్తుకొస్తుంది. వీటి కన్నా లవణాలు, ఖనిజాలు, విటమిన్ల వంటి సూక్ష్మపోషకాల లోపమే మనదగ్గర ఎక్కువ. ఒకరకంగా దీన్ని ‘కనిపించని ఆకలి’ అనుకోవచ్చు. ఇది బయటికేమీ కనిపించకపోవచ్చు. అంతా మామూలుగానే ఉండొచ్చు. లోపల మాత్రం ప్రతి కణం పోషకాల లోపంతో ఆవురావురుమంటూ అలమటిస్తూనే ఉంటుంది. తల్లి కడుపులో నలుసు పడ్డప్పట్నుంచీ, పుట్టిన తర్వాత రెండేళ్ల వరకూ.. అంటే తొలి వెయ్యిరోజుల్లో బిడ్డకు కావాల్సిన పోషకాలన్నీ తగినంత లభించటం అత్యవసరం. ఇవి లోపిస్తే శరీరం మీదే కాకుండా మానసిక వికాసం పైనా విపరీత ప్రభావం పడుతుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడు, పుట్టిన తర్వాత రెండేళ్ల వరకే మెదడు ఎదుగుతుంది. అందుకే పుట్టినప్పుడు పిల్లలకు తల పెద్దగా, శరీరం చిన్నగా ఉంటుంది. కీలకమైన ఈ సమయంలో మెదడు సరిగా ఎదగకపోతే దాని దుష్ఫలితాలు బాల్యంలోనే కాదు, జీవితాంతం వెంటాడతాయి. జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి, తెలివితేటలు తగ్గుతాయి. భావోద్వేగాల నియంత్రణ కొరవడుతుంది, ప్రవర్తన తీరుతెన్నులు అస్తవ్యస్తమవుతాయి. పెద్దయ్యాక శరీర సామర్థ్యమూ తగ్గుతుంది.
ఐరన్- ప్రత్యేక పోషకం రక్తహీనత లేకపోయినా ఐరన్ లోపం గల పిల్లలు 71% మంది. అంటే దాదాపు మూడొంతుల మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారన్నమాట.![]() |
నిర్ధారణ ఎలా? హిమోగ్లోబిన్ తగ్గటంతోనే కాదు. ఫోలిక్ యాసిడ్, రాగి, విటమిన్ బి6, బి12.. ఇలా దేని లోపంతోనైనా రక్తహీనత రావొచ్చు. అందువల్ల రక్తహీనత లక్షణాలు కనిపించినప్పుడు ఫెర్రిటిన్, టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ (టీఐబీసీ) పరీక్షలు చేస్తారు. ఐరన్ లోపంలో ముందుగా తగ్గేది ఫెర్రిటిన్. ఆ తర్వాత టీఐబీసీ స్థాయులు పెరగటం ఆరంభిస్తాయి. చివర్లో హిమోగ్లోబిన్ మోతాదులు తగ్గుతాయి. ఫెర్రిటిన్ తక్కువుండి (డెసీలీటర్‌కు 12 నానోగ్రామ్‌ల కన్నా తక్కువ), టీఐబీసీ ఎక్కువుంటే (డెసీలీటర్‌కు 450 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువ) ఐరన్ లోపం ఉన్నట్టే. విదేశాల్లో ఈ పరీక్షలను అందరికీ కచ్చితంగా చేస్తారు. మనదేశంలోనూ 9వ నెలలో అందరికీ ముందస్తుగా వీటిని చేయటం మంచిది. |
చికిత్స- సిరప్, మాత్రలు, ఆహారం ![]() |
నివారణ మన చేతుల్లోనే.. ఐరన్ లోపాన్ని సరి చేసుకున్నా దాని పర్యవసానాలు, ప్రభావాలు మున్ముందు కనిపిస్తాయి. అందువల్ల సమస్య రాకుండా చూసుకోవటంలోనే గొప్పతనముంది. గర్భిణులంతా ఐరన్, ఫోలిక్ యాసిడ్ విధిగా తీసుకోవాలి. అలాగే పాలిచ్చే తల్లులూ ఐరన్ తీసుకోవాలి. దీంతో పిల్లల్లో ఐరన్ లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు. గర్భిణికి ఐరన్ సమృద్ధిగా ఉన్నప్పుడు కడపులోని బిడ్డ దాన్ని గ్రహించి, కాలేయంలో దాచుకుంటుంది. ఇది పుట్టిన తర్వాత 3-6 నెలల వరకు ఉపయోగపడుతుంది. తల్లిపాలలో ఐరన్ ఉన్నా 3 నెలల తర్వాత అది సరిపోకపోవచ్చు. అందువల్ల తగినంత బరువుతో పుట్టినప్పటికీ.. పిల్లలందరికీ 3 నెలలు నిండగానే రోజూ ఐరన్ చుక్కల మందు ఇవ్వటం తప్పనిసరి. ప్రతి కిలో బరువుకు 1 మి.గ్రా. చొప్పున మూడు నెలల పాటు.. అంటే అదనపు ఆహారం మొదలెట్టేంతవరకు పట్టించాలి. అదే నెలలు నిండకముందే పుట్టినవారికైతే రెండో నెల నుంచే ఐరన్ ఆరంభించాలి. వీరికి ప్రతి కిలో బరువుకు 2 మి.గ్రా. చొప్పున ఆరు నెలలు నిండేంతవరకు ఇవ్వాలి. హిమోగ్లోబిన్ మోతాదులు నార్మల్‌గా ఉన్నా కూడా ఐరన్ చుక్కలు ఇవ్వాలి. దీంతో ఐరన్ లోపాన్ని చాలావరకు నివారించుకోవచ్చు. ఏడాది వరకు ఆవు పాలు, గేదె పాలు పిల్లలకు ఇవ్వద్దు. వీటిల్లో ఐరన్ ఉండదు. పైగా ఇవి పిల్లల పేగులను దెబ్బతీయొచ్చు. అలర్జీలూ రావొచ్చు. |
రక్తహీనతకు మించి.. ఒక్క హిమోగ్లోబిన్ తయారీకే కాదు.. మెదడు కణాల వృద్ధికి, మెదడు పరిమాణం పెరగటానికి, మెదడులో నాడీ సమాచార రసాయనాల ఉత్పత్తికి, నాడుల మీదుండే రక్షణ పొర ఏర్పడటానికీ ఐరన్ అత్యవసరం. ఐరన్ లోపం ఒకింతే ఉన్నప్పుడు మెదడు ఎదుగుదల కుంటుపడుతుంది, కాస్త ఎక్కువగా తగ్గితే ఒంట్లోని కణాల సామర్థ్యం సన్నగిల్లుతుంది. లోపం మరీ ఎక్కువైతే రక్తహీనతకు దారితీస్తుంది. అందువల్ల ఐరన్ లోపంతో తలెత్తే ఇతరత్రా సమస్యల గురించి తెలుసుకొని ఉండటం మంచిది. వీటిల్లో కొన్ని జీవితాంతమూ వెంటాడుతూ వస్తాయి మరి.* మేధో శక్తి తగ్గటం: గర్భిణికి ఐరన్ లోపముంటే అది పుట్టబోయే పిల్లలకూ శాపంగా పరిణమిస్తుంది. మెదడు కణాలు సరిగా వృద్ధి చెందవు. నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేసే గాబా, అసిటైల్ కొలీన్, డోపమైన్ వంటి రసాయనాల ఉత్పత్తి, పనితీరు అస్తవ్యస్తమవుతాయి. మన మెదడులో దాదాపు 200 కోట్ల నాడీ కణాలుంటాయి. ఇవి ఒకదాంతో మరోటి అనుసంధానం కావటానికి ఐరన్ అత్యవసరం. లేకపోతే అనుసంధాన వ్యవస్థ దెబ్బతిని మేధో శక్తి సన్నగిల్లుతుంది. మెదడులో హిప్పోక్యాంపస్ పరిమాణం తగ్గటం వల్ల జ్ఞాపకశక్తి, తెలివి తేటలు (ఐక్యూ), విషయగ్రహణ సామర్థ్యం మందగిస్తాయి. |
పెద్దయ్యాకా వదలదు.. * నాడులు దెబ్బతినటం: చిన్నప్పుడు ఐరన్ లోపిస్తే నాడుల మీద రక్షణగా ఉండే మైలీన్ పొర సరిగా ఏర్పడదు. దీంతో నాడులు దెబ్బతింటాయి. దీని ప్రభావం పెద్దయ్యాకా కనిపిస్తుంది.![]() * నిద్ర సమస్యలు: చిన్నప్పుడు ఐరన్ లోపం వల్ల పెద్దయ్యాక నిద్ర సమస్యలు బయలుదేరొచ్చు. దీంతో కలత నిద్రతో సతమతమవుతుంటారు. * నిరంతర ఒత్తిడి: ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు రక్తంలోకి పెద్దఎత్తున అడ్రినలిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది అక్కడ్నుంచి పారిపోవటానికి, లేదంటే ఎదిరించి పోరాడటానికి అవసరమైన శక్తి అందిస్తుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడు, పుట్టిన వెంటనే ఐరన్ లోపం గలవారికి ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో అడ్రినలిన్ వంటి స్టిరాయిడ్ హార్మోన్లు తగినంత ఉత్పత్తి కావు. దీంతో పారిపోవటం, పోరాడటం చేతకాదు. నిరంతరం ఒత్తిడి కొనసాగుతూ వస్తుంది. |
ఇతర సూక్ష్మ పోషకాలు ![]() * అయోడిన్: ఇది లోపిస్తే గాయిటర్, థైరాయిడ్ పనితీరు తగ్గటం, బుద్ధిమాంద్యం వంటివి తలెత్తుతాయి. అయోడిన్ ఉప్పు తీసుకుంటే వీటిని నివారించుకోవచ్చు. * జింక్: జన్యు వ్యక్తీకరణకు, రోగనిరోధక వ్యవస్థ బలోపేతానికి, కణాల మరమ్మతుకు ఇది అవసరం. ఇది లోపిస్తే తెలివి తేటలు తగ్గొచ్చు, చర్మం మీద దద్దుర్లు, నోరు పొక్కటం తలెత్తొచ్చు. * విటమిన్ బి1: మనం తీసుకున్న పిండి పదార్థం శక్తిగా మారటానికిది తోడ్పడుతుంది. కండరాలు, నాడుల సంకోచ వ్యాకోచాలకు, మెదడుకు తగినంత గ్లూకోజు అందటానికి ఇది అవసరం. దీని లోపంతో నాడులు చచ్చుపడతాయి, మెదడు కణజాలం, గుండె కండరాలు దెబ్బతింటాయి. * విటమిన్ ఎ: దీన్ని అవయవాల్లోని పైపొరల (ఎపిథీలియల్) టానిక్ అనుకోవచ్చు. ఎందుకంటే నోరు, కళ్లు, పేగులు, శ్వాసకోశంలోని పొరలు దెబ్బతినకుండా కాపాడుతుంది మరి. అందుకే దీన్ని మ్యాజిక్ బుల్లెట్ అంటారు. పిల్లలందరికీ 9 నెలల వయసు నుంచి 2.5 సంవత్సరాలు వచ్చేవరకు ప్రతి 6 నెలలకు ఒకసారి విటమిన్ ఎ మందు మోతాదు ఇవ్వాలి. * ఫోలిక్ యాసిడ్: ఇది లేకపోతే కణాలు వృద్ధి చెందవు. అందుకే గర్భధారణకు ప్రయత్నించటానికి ముందు నుంచే దీన్ని తీసుకోవాలి. ఇది లోపిస్తే పిల్లల్లో పుట్టుకతో వెన్ను, నాడుల లోపాలు, మెదడు సరిగా ఎదగకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. * విటమిన్ ఇ: కణజాలం క్షీణించకుండా కాపాడుతుంది. ఇది లోపిస్తే నడుస్తున్నప్పుడు తూలటం, నాడుల సరిగా పనిచేయకపోవటం వంటివి తలెత్తుతాయి. * రాగి: హిమోగ్లోబిన్ తయారీకిది తప్పనిసరి. ఎముకలు, కండర బంధనాలు, అనుసంధాన కణజాలం, రక్తనాళాలు, మైలీన్ పొర వృద్ధి చెందటానికి తోడ్పడుతుంది. ఇది లోపిస్తే రక్తహీనత, ఆకలి తగ్గటం, తరచూ ఇన్ఫెక్షన్లు వేధించొచ్చు. * క్యాల్షియం: కండరాలు, ఎముకల దృఢత్వానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. మెదడు కణాలు, నాడులు విస్తరించటానికీ ఉపయోగపడుతుంది. * విటమిన్ బి6: మెదడు వృద్ధి, రక్తం తయారీలో, 140 రకాల ఎంజైమ్‌ల పనితీరులో ఇది పాలు పంచుకుంటుంది. * విటమిన్ బి12: నాడుల మీది రక్షణ పొర తయారీకిది అవసరం. ఇది లోపిస్తే నాడీ సమస్యలు బయలుదేరతాయి. * విటమిన్ సి: కణజాల మరమ్మతులో, రక్తం తయారుకావటంలో, రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావటంలో ఇది పాలు పంచుకుంటుంది. విటమిన్ సి తక్కువగా గలవారికి మెదడు పరిమాణమూ తక్కువగా ఉండటం గమనార్హం. * విటమిన్ డి: ఇది కణాల వృద్ధికి, ప్రోటీన్ల తయారీకి, రోగనిరోధక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతుంది. |
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kakani Govardhan Reddy: అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్: కోటంరెడ్డికి మంత్రి కాకాణి కౌంటర్
-
Movies News
Writer Padmabhushan Review: రివ్యూ: రైటర్ పద్మభూషణ్
-
Sports News
Virat Kohli: స్పిన్ ఎదుర్కోవడం కోహ్లీకి కాస్త కష్టమే.. కింగ్‌కు మాజీ ఆటగాడి సూచన ఇదే..!
-
India News
అలా చేస్తే.. 2030 కల్లా భారత్ దివాలా తీయడం ఖాయం: హరియాణా సీఎం కీలక వ్యాఖ్యలు
-
World News
Chinese spy balloon: అమెరికా అణ్వాయుధ స్థావరంపై చైనా నిఘా బెలూన్..!
-
Politics News
Kotamreddy: అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్.. ఆషామాషీగా జరగదు: కోటంరెడ్డి